కువైట్‌లో తెలుగు ప్రవాసుల గోస.. ఆదుకోవాలంటూ అభ్యర్థన!

ABN , First Publish Date - 2020-06-01T20:06:01+05:30 IST

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. కువైట్‌లోనూ దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో కువైట్‌లో చిక్కుకున్న తెలుగు ప్రవాసు

కువైట్‌లో తెలుగు ప్రవాసుల గోస.. ఆదుకోవాలంటూ అభ్యర్థన!

కువైట్: కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. కువైట్‌లోనూ దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో కువైట్‌లో చిక్కుకున్న తెలుగు ప్రవాసులు.. తమను స్వదేశానికి తరలించే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా నేపథ్యంలో ప్రపంచమే స్వీయ నిర్భందంలోకి వెళ్లిపోయింది. భారత ప్రభుత్వం కూడా లాక్‌డౌన్ అమలు చేస్తోంది. అయితే విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశాలనికి తరలించడం కోసం ‘వందే భారత్ మిషన్’ పేరుతో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసింది. దీంతో కువైట్‌లో ఉంటున్న దాదాపు 50వేల మంది భారతీయులు స్వదేశానికి రావడానికి ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో దాదాపు 17వేల మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఈ 17వేల మందిలో కువైట్ ప్రభుత్వం ప్రకటించిన ఆమ్నెస్టీ ద్వారా లబ్ధి పొందిన వారు కూడా ఉన్నారు. అయితే ‘వందే భారత్ మిషన్’‌లో భాగంగా హైదరాబాద్‌కు నడుపుతున్న విమానాల సంఖ్య చాలా తక్కువ. అంతేకాకుండా విమాన టికెట్‌ ధర అధికం. ఈ నేపథ్యంలో సొంత దేశానికి రాలేక, అక్కడే ఉండలేక వేలాది మంది తెలుగు ప్రవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆహార పదార్థాలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు.. అలాంటిది అధిక మొత్తంలో ఖర్చు చేసి విమానం టికెట్‌ను ఎలా కొనగలమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి తమను సొంత రాష్ట్రాలకు తరలించే చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. కువైట్ ఇప్పటి వరకు దాదాపు 27వేల మంది కరోనా బారినపడగా.. దాదాపు 212 మంది మృతి చెందారు. 


Updated Date - 2020-06-01T20:06:01+05:30 IST