ప్రాజెక్టులన్నీ తీసుకొని ఏం చేస్తారు?

ABN , First Publish Date - 2021-09-03T08:33:18+05:30 IST

‘ప్రాజెక్టులన్నీ తీసుకొని ఏం చేస్తారు? ఇన్ని ప్రాజెక్టులను మీ ఆధీనంలోకి తీసుకొని ఏ విధంగా పర్యవేక్షణ చేయగలరు? ప్రాజెక్టులకు ఆకస్మిక వరదలు వస్తే... ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌ను..

ప్రాజెక్టులన్నీ తీసుకొని ఏం చేస్తారు?

  • వరదల సమయంలో మేనేజ్‌మెంట్‌ ఎలా?
  • ప్రయోగాత్మకంగా ఒక ప్రాజెక్టు తీసుకోండి
  • కృష్ణాలో అంతర్రాష్ట్ర వివాదాలు ఉన్న వాటిని బోర్డు పరిధిలోకి చేరిస్తేనే మేలు జరిగే చాన్స్‌
  • వివాదాల్లేని గోదావరి ప్రాజెక్టులతో ఏం పని?
  • బోర్డుల ఉమ్మడి భేటీలో వాడివేడి చర్చ


హైదరాబాద్‌, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): ‘ప్రాజెక్టులన్నీ తీసుకొని ఏం చేస్తారు? ఇన్ని ప్రాజెక్టులను మీ ఆధీనంలోకి తీసుకొని ఏ విధంగా పర్యవేక్షణ చేయగలరు? ప్రాజెక్టులకు ఆకస్మిక వరదలు వస్తే... ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌ను అమలు చేసే సామర్థ్యాలు మీకున్నాయా? పంటలకు నీటి విడుదల చేయాలని ఒత్తిళ్లు వస్తే ఎలా?’ అంటూ కృష్ణా, గోదావరి బోర్డులపై తెలుగు రాష్ట్రాలు ప్రశ్నల వర్షం కురిపించాయి. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకొళ్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్‌ అమలు, తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు బుధవారం రాత్రి బోర్డుల ఉమ్మడి సమావేశం జరిగింది. ఇందులో తెలుగు రాష్ట్రాలు సంయుక్తంగా బోర్డుల తీరును ఎండగట్టాయి. గెజిట్‌లోని నాలుగు క్లాజులపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. వ్యవస్థాపక నిర్మాణంపై నోటిఫికేషన్‌, సీడ్‌ ఫండ్‌ (బోర్డులకు నిధులు), ప్రాజెక్టులకు అనుమతులు తీసుకోవడం, ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తేవడం.. వంటి అంశాలు ప్రస్తావనకు రాగా.. రెండు తెలుగు రాష్ట్రాలు ప్రశ్నల వర్షం కురిపించి... బోర్డులను ఇరుకున పెట్టాయి.


కృష్ణా నదిపై పోతిరెడ్డిపాడు, కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి, శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల వంటి అంతరాష్ట్ర వివాదాలు ఉన్న ప్రాజెక్టులనే బోర్డు పరిధిలోకి తీసుకోవాలని, అంతకంటే ముందు ఒక ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా అధీనంలోకి తీసుకొని అధ్యయనం చేయాలని సూచించాయి. గోదావరిలో జలాల లభ్యత పుష్కలంగా ఉంటుందని, ఎలాంటి వివాదాలు లేని ప్రాజెక్టులను బోర్డుల అధీనంలోకి తీసుకొని ఏం చేస్తారని ఉమ్మడిగా నిలదీశాయి. అంతర్రాష్ట్ర వివాదాలు లేని ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి చేరిస్తే మేలు కన్నా కీడే ఎక్కువ జరుగుతుందని స్పష్టం చేశాయి. 


అక్టోబరులో వద్దు

అక్టోబరు 14లోగా ప్రాజెక్టులను బోర్డుల అధీనంలోకి తీసుకోవాలన్న క్లాజును తెలుగు రాష్ట్రాలు తప్పుపట్టాయి. ఆ సమయంలో ప్రాజెక్టుల కింద సాగునీటి అవసరాలు ఎక్కువగా ఉంటాయని, పంటలు చేతికి వచ్చే దశలో ప్రాజెక్టులను బోర్డుల అధీనంలోకి తీసుకుంటే సమస్యలు పేర్కొన్నాయి. జనవరిలో అయితే అనుకూలంగా ఉంటుందని సూచించాయి. ప్రాజెక్టులు, మిషనరీ వివరాలు ఇవ్వాలని బోర్డులు కోరగా... అవన్నీ తీసుకొని ఏం చేస్తారని నిలదీశాయి. తొలుత సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని కోరాయి. ప్రధానంగా గెజిట్‌ అమలుపై తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయగా... ఏపీ సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేసిన ట్లు తెలిసింది. గెజిట్‌ అమలుపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే.. అవసర మైన ప్రాజెక్టులే బోర్డుల పరిధిలో ఉండాలని స్పష్టం చేశాయి.


అధ్యయనానికి కమిటీ

తెలుగు రాష్ట్రాల సూచనల నేపథ్యంలో ప్రాజెక్టులపై అధ్యయనానికి ఒక కమిటీని బోర్డులు సబ్‌ కమిటీలు వేశాయి. ఆ కమిటీ అధ్యయనం అనంతరం మరోసారి బోర్డుల సమావేశం జరగనుంది. అందులోనే వ్యవస్థాపక నిర్మాణం(ఆర్గనైజేషనల్‌ స్ట్రక్చర్‌)పై తుది నిర్ణయం తీసుకోనున్నాయి. ఈ మేరకు గెజిట్‌ విధించిన గడువు ప్రకారం అక్టోబరు14లోగా బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులను చేర్చడం కష్టమేనన్న వాదన వినిపిస్తోంది. మరో 40 రోజుల గడువు మాత్రమే ఉన్నందున, ఆలోగా వ్యవస్థాపక నిర్మాణంపై నోటిఫికేషన్‌ ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది. ’;’


కొనసాగుతున్న జలవిద్యుదుత్పత్తి

జల విద్యుత్‌ ఉత్పత్తిని ఆపబోమన్న మాటకే తెలంగాణ కట్టుబడింది. తక్షణం నిలిపివేయాలన్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఆదేశాలను పక్కనబెట్టింది. గురువారం శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల్లో జల విద్యుత్‌ ఉత్పత్తి యథాప్రకారం సాగింది.  కృష్ణా, గోదావరి బేసిన్లలో ఉన్న అన్ని ప్రాజెక్టులను కలుపుకొని ఈ సీజన్‌లో ఇప్పటివరకు 2,106 మిలియన్‌ యూనిట్ల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. శ్రీశైలంలో ఇప్పటిదాకా 840.98 మిలియన్‌ యూనిట్లను ఉత్పత్తి చేయగా.. నాగార్జునసాగర్‌లో 873 మిలియన్‌ యూనిట్లను,పులిచింతలలో 95.93 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. సగటున రోజుకు 21 మిలియన్‌ యూనిట్ల దాకా జలవిద్యుత్‌ ఉత్పత్తవుతోంది.  

Updated Date - 2021-09-03T08:33:18+05:30 IST