అమరావతికి జై కొడితే.. మా రాజీనామాలు

ABN , First Publish Date - 2020-08-06T08:08:53+05:30 IST

అధికార పక్షం వైసీపీకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు.

అమరావతికి జై కొడితే.. మా రాజీనామాలు

  • మా పదవులూ మీరే ఉంచుకోవచ్చు
  • జగన్‌కు బాబు బంపరాఫర్‌
  • డెడ్‌లైన్‌పై పారిపోయిన ప్రభుత్వం
  • తాజా ప్రజాతీర్పునకు సిద్ధపడకుండా
  • పిరికిపంద మాదిరిగా తప్పుకొన్నారు
  • అయినా వదలం.. కడిగేస్తాం: బాబు
  • అయోధ్యలాగే అమరావతిని కూడా
  • కేంద్ర సర్కారు చొరవ చేసి కాపాడాలి


రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉంటుందని ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టారు. ఎన్నికలు కాగానే మాట మార్చారు. అందుకే ప్రజా తీర్పుకు ముందుకు రావాలని సవాల్‌ చేశాం. రాలేకపోయారు. పిరికిపందల్లా తప్పుకొన్నారు.

 చంద్రబాబు, టీడీపీ అధ్యక్షుడు


అమరావతి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): అధికార పక్షం వైసీపీకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. ‘‘టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని కొందరు వైసీపీ మంత్రులు అడుగుతున్నారు. మాకేం అభ్యంతరం లేదు. రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉంటుందని ప్రకటించండి. మేం మా పదవులకు రాజీనామాలు చేస్తాం. వాటిని కూడా మీరే ఉంచుకోండి’’ అని జగన్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మూడు రాజధానులపై అధికార పక్షానికి తాను ఇచ్చిన 48 గంటల గడువు ముగిసిన తర్వాత బుధవారం సాయంత్రం చంద్రబాబు విలేకరులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ‘‘మూడు రాజధానుల అంశంపై అసెంబ్లీని రద్దు చేసి తాజాగా ప్రజా తీర్పు కోరాలని, ప్రజలు ప్రభుత్వానికి మద్దతు ఇస్తే మేం ఇక మాట్లాడబోమని చెప్పాను. కానీ ప్రభుత్వానికి స్పందించే దమ్ము లేక పారిపోయింది. ఎన్నికలకు ముందుకు రాలేక పిరికిపంద మాదిరిగా దాక్కొన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉంటుందని ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టారు.


ఎన్నికలు కాగానే మాట మార్చారు. అందుకే ప్రజా తీర్పుకు ముందుకు రావాలని సవాల్‌ చేశాం. రాలేకపోయారు’’ అని ఆయన విమర్శించారు. ఎన్నికల ముందూ, తర్వాతా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, మంత్రులు మాట్లాడిన మాటల వీడియోలను ఆయన ప్రదర్శించారు. ఎన్నికల ముందు ఒక ప్రచార సభలో ప్రతిపక్ష నాయకుని హోదాలో జగన్మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియోను విడిగా చూపించారు. రాజకీయ నాయకులు ఎన్నికల ముందు ఒక మాట చెప్పి, ఆ తర్వాత దానిని నిలుపుకోలేకపోతే రాజీనామా చేసి ఇంటికి వెళ్ళే పరిస్థితి రావాలని ఆ సభలో జగన్‌ వ్యాఖ్యానించారు. ‘‘మరి ఇప్పుడు రాజీనామా చేసి ఇంటికి వెళతారా? విజయవాడలో రాజధాని ఏర్పాటుకు మద్దతు ఇస్తున్నానని అసెంబ్లీలో ఆయనే స్వయంగా చెప్పారు.

అసెంబ్లీ బయటకు వచ్చి చెప్పారు. తమ పార్టీ నేతలతో పదేపదే చెప్పించారు. ఇప్పుడు ఎలా మాట మార్చారు? మీ నాయకులతో ఎన్నికల ముందు మాట్లాడించింది మీరు కాదా? మాట తప్పారనే మళ్లీ ఎన్నికలకు రావాలని సవాల్‌ విసిరాం. ఐదు కోట్ల మంది ప్రజలను మోసం చేస్తే, నయ వంచన చేస్తే, నమ్మక ద్రోహం చేస్తే ఊరుకోవాలా? ఈ వంచన ఇప్పటిది కాదు. రాష్ట్ర విభజన సమయంలోనూ ఇలాగే చేశారు. ఆ రోజు విభజన వద్దని గట్టిగా నిలబడితే జరిగేది కాదు. కానీ లోపాయికారీ అవగాహన కుదుర్చుకుని దానికి దారి సుగమం చేశారు. ఈ ప్రభుత్వం విశ్వసనీయత కోల్పోయింది’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.  


కేంద్రం జోక్యం చేసుకోవాలి...

అమరావతిని కాపాడటానికి కేంద్రం జోక్యం చేసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ‘‘వైసీపీ ప్రభుత్వం వచ్చీరాగానే విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేయాలని చూసింది. ఆ సమయంలో కేంద్రం జోక్యం చేసుకొంది. అటువంటివి చేయకూడదని గట్టిగా చెప్పింది. కోర్టులు కూడా అదే చెప్పాయి. ఇటువంటి ప్రయత్నాలు మళ్లీ జరగకుండా చూడటానికి ఏకంగా ప్రత్యేక చట్టమే తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. అమరావతిలో కూడా అదే జరుగుతోంది. విద్యుత్‌ పీపీఏల్లో పెట్టుబడి సంస్థలు ఉంటే, ఇక్కడ రైతులు ఉన్నారు. రైతులతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు యథాతథంగా అమలు జరిగేలా కేంద్రం చొరవ తీసుకోవాలి’’ అని కోరారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న అయోధ్య రామాలయం సమస్యను చొరవ తీసుకొని పరిష్కరించిన తరహాలోనే, అమరావతి సమస్యను కూడా కేంద్రం పరిష్కరించి వేల మంది రాజధాని రైతుల భవిష్యత్‌ను, రాష్ట్ర భవిష్యత్‌ను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు సుదినమని, ఎంతో మంది కోరుకొంటున్నట్లుగా రామాలయానికి శంకుస్థాపన జరిగిందని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.


రెండు రోజుల్లో అన్నీ చెబుతా..

అమరావతిలోనే రాజధాని ఎందుకు ఉండాలో, రాష్ట్రానికి అది ఎలా లాభమో రెండు రోజుల్లో చెబుతానని, అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏమిటో కూడా సవివరంగా ప్రజలకు చెప్పబోతున్నానని చంద్రబాబు అన్నారు. ‘‘విశాఖ ఒక సుందర నగరం. ప్రశాంతప్రదేశం. అక్కడి ప్రజలు ఎంతో మంచివారు. హుద్‌హుద్‌ తుఫాన్‌ వచ్చినప్పుడు వారు అందించిన సహకారం మరువలేనిది. ఈ ప్రభుత్వం ఆ నగరం జపం మొదలుపెట్టగానే అక్కడ వరుస ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి’ అని అన్నారు. కరోనా సమయంలో ప్రజలు బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో ఈ ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా కొట్టుకుపోతున్నాయని, అయినా ప్రజలు కనీసం సామాజిక మాధ్యమాల ద్వారా అయినా తమ భావాలు బయటకు చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ‘‘అవసరమైనప్పుడు ప్రతిఘటించాలి. నిరసించాలి. తిరగబడాలి. లేకపోతే దుష్ఫలితాలు చాలా ఉంటాయి. మన భవిష్యత్‌ తరాలు కూడా నష్టపోతాయి. తప్పుడు నిర్ణయాలు చేసిన ప్రభుత్వాలు నిలవలేదు. అన్నీ చరిత్ర చెత్తబుట్టలోకి కొట్టుకుపోయాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.


జగన్‌కు భయమెందుకు?: కళా 

‘‘ప్రజాభీష్టానికి విరుద్ధంగా సీఎం జగన్‌ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ప్రజల వద్దకెళ్లి రిఫరెండం తీసుకోవటానికి ఎందుకు భయపడుతున్నారు?’’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రశ్నించారు. సీఎం జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్రం అభాసుపాలవుతోందని ఎమ్మెల్యే చినరాజప్ప విమర్శించారు.


511.. 78.. 34  వైసీపీ వైఫల్యాల చిట్టా ఇది: పంచుమర్తి

‘వైసీపీ అధికారంలోకి వచ్చాక 511 మంది రైతులు ఆత్మహత్య చేసుకొన్నారు. కోర్టులు 78 సార్లు తప్పుడు నిర్ణయాలపై మొట్టికాయలు వేశాయి. 34 సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం రద్దు చేసింది’ అని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ చెప్పారు. వైసీపీ పాలన మొత్తం వైఫల్యాలమయం అని ఆరోపించారు. ‘రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కుపోయాయి. పనులు దొరక్క 64 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకొన్నారు. రాజధాని తరలింపు ప్రయత్నాలతో 78 మంది రైతులు చనిపోయారు. ఇళ్ళ స్థలాల పేరుతో రూ.3000 కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డారు’అని ఆరోపించారు.


ఇది మోసం కాదా...

మూడు రాజధానుల విషయంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి, మోసం చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ‘‘హైకోర్టు ఎక్కడ పెట్టాలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు. సుప్రీం కోర్టు సలహాతో రాష్ట్రపతి దానిని నిర్ణయిస్తారు. అదే మాదిరిగా నిర్ణయించి అమరావతిలో పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేకపోయినా దానిని మార్చేస్తామని, కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామని చెప్పడం మోసం కాదా? రాష్ట్ర రాజధాని ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించింది. అధికారంలో ఉన్న ఒకరో, ఇద్దరో తీసుకొనేది కాదు. విభజన సమయంలో కాంగ్రెస్‌ ఇలాగే తొందరపడింది. దానిని దిద్దుకొనే అవకాశం లేక నష్టపోయింది. ఈ ప్రభుత్వానికి దిద్దుకోవడానికి ఇంకా అవకాశం ఉంది’’ అని అన్నారు.

Updated Date - 2020-08-06T08:08:53+05:30 IST