ప్రైవేటు ప్రాక్టీసు రద్దు

ABN , First Publish Date - 2022-06-08T07:57:52+05:30 IST

త్తగా విధుల్లో చేరే వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. ప్రభుత్వ కొలువులో చేరితే ప్రైవేటు ప్రాక్టీసు చేయకూడదన్న నిబంధన విధించింది. ఈ మేరకు మంగళవారం జీవో నంబరు 56 జారీ చేసింది.

ప్రైవేటు ప్రాక్టీసు రద్దు

సర్కారీ కొలువులో చేరే వైద్యులకు షాక్‌

జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

కొత్తగా నియమితులయ్యే వారికి వర్తింపు 

డ్యూటీ టైమ్‌లోనూ డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీసు

రోగులను సొంత క్లినిక్‌లకు మళ్లిస్తున్న వైనం

ఈ నేపథ్యంలోనే సర్కారు నిర్ణయం

జీవోపై వైద్యుల్లో భిన్నాభిప్రాయాలు

ఎయిమ్స్‌ తరహాలో జీతాలిస్తే

అభ్యంతరం లేదని వ్యాఖ్యలు


హైదరాబాద్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): కొత్తగా విధుల్లో చేరే వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. ప్రభుత్వ కొలువులో చేరితే ప్రైవేటు ప్రాక్టీసు చేయకూడదన్న నిబంధన విధించింది. ఈ మేరకు మంగళవారం జీవో నంబరు 56 జారీ చేసింది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే బోధన, బోధనేతర వైద్యులందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి తెలంగాణ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీస్‌ నిబంధనల్లో సవరణ చేసింది. బోధనాస్పత్రుల్లో చేరే అసిస్టెంట్‌ ప్రొఫెసర్లూ ఇకపై ప్రైవేటు ప్రాక్టీసు చేయకూడదు. క్లినికల్‌, నాన్‌ క్లినికల్‌తో పాటు సూపర్‌ స్పెషాలిటీ విభాగాల వైద్యులకు ఈ నిబంధన వర్తిస్తుంది. కాగా, క్లినికల్‌లో జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, గైనకాలజీ, పిడియాట్రిక్స్‌, పల్మనరీ మెడిసిన్‌, సైకియాట్రీ, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్‌, అనస్థీషియా, రేడియో డయాగ్నసిస్‌, ఆంకాలజీ, ఈఎన్‌టీ, ఆప్తమాలజీ, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఫిజికల్‌ మెడిసిన్‌, ఎమర్జెన్సీ మెడిసిన్‌ వైద్యులు ఉన్నారు. ఇక నాన్‌ క్లినికల్‌లో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, కమ్యూనిటీ మెడిసిన్‌, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, ట్రాన్‌ఫ్యూజియన్‌ మెడిసిన్‌ వైద్యులు ఉన్నారు. సూపర్‌ స్పెషాలిటీ విభాగంలో కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, మెడికల్‌ ఆంకాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, కార్డియాక్‌ సర్జరీ, పిడియాట్రిక్‌ సర్జరీ, ప్లాస్టిక్‌ సర్జరీ వైద్యులు ఉన్నారు. ఈ కేటగిరీలకు చెందిన వైద్యులంతా ప్రైవేటు ప్రాక్టీసు చేయకూడదని జీవోలో స్పష్టం చేసింది.  


డ్యూటీ సమయంలో ప్రైవేటు ప్రాక్టీసు..

చాలా చోట్ల బోధనాస్పత్రుల వైద్యులు తమ సొంత క్లినిక్‌లలో బిజీగా ఉంటున్నారు. చాలా మంది సొంత ప్రాక్టీసుతో సమయానికి ప్రభుత్వ ఆస్పత్రులకు రావడం లేదు. ఎక్కువ సమయం ప్రైవేటు ప్రాక్టీసుకే ప్రాధాన్యమిస్తున్నారు. సర్కారీలో యంత్రపరికరాలున్నా సర్జరీలు చేయట్లేదు. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగుల్ని తమ సొంత క్లినిక్‌లకు పంపుతున్నారు. ఆరోగ్యశ్రీ కింద తమ ఆస్పత్రుల్లో ఉచితంగా సర్జరీ చేస్తామని చెబుతున్నారు. ఇటువంటి సంఘటనలు మంత్రి హరీశ్‌ దృష్టికి వచ్చాయి. దీంతో కొత్తగా చేరేవారికి ప్రైవేటు ప్రాక్టీసును రద్దు చేయాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన 2002 మెడికల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీసు నిబంధనలను మార్చారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోపై వైద్యుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది దీన్ని స్వాగతిస్తుండగా.. మరి కొంత మంది వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం అరకొర జీతాలిస్తూ ప్రైవేటు ప్రాక్టీసును నిషేధించడమేంటని కొందరు వైద్యులు ప్రశ్నిస్తున్నారు.


ఉదాహరణకు కార్డియాక్‌ సర్జరీ వైద్యులకు ప్రైవేటులో భారీగా డిమాండ్‌ ఉంది. ఒక్క సర్జరీకే లక్షల్లో చెల్లింపులుంటాయి. ప్రభుత్వాస్పత్రుల్లో నెలం తా పనిచేసినా ఒక్క సర్జరీకి వచ్చినంత కూడా రాదని అంటున్నారు. రూ.70 వేల జీతానికి ఎవరొస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎయిమ్స్‌ తరహాలో వేతనాలిచ్చి, ప్రైవేటు ప్రాక్టీసును నిషేధిస్తే తమకేం అభ్యంతరం లేదని అంటున్నారు. జీవో 56ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

Updated Date - 2022-06-08T07:57:52+05:30 IST