అందుకే సీక్రెట్‌గా ఉంచాం!

ABN , First Publish Date - 2021-06-06T05:30:00+05:30 IST

‘నువ్విలా’ చిత్రంతో తెలుగు సినీ అరంగేట్రం చేసిన యామీ గౌతమ్‌ ఆ తరువాత ‘గౌరవం, యుద్ధం, కొరియర్‌ బాయ్‌

అందుకే సీక్రెట్‌గా ఉంచాం!

‘నువ్విలా’ చిత్రంతో తెలుగు సినీ అరంగేట్రం చేసిన యామీ గౌతమ్‌ ఆ తరువాత ‘గౌరవం, యుద్ధం, కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌’ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. దక్షిణాది భాషలన్నిట్లో నటించిన ఈ ముప్ఫై రెండేళ్ళ భామ కొన్నేళ్ళుగా హిందీ సినిమాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ‘వికీ డోనర్‌, ఉరీ: ది సర్జికల్‌ స్ట్రైక్‌’ లాంటి హిట్‌ చిత్రాల్లో మెరిశారు. ప్రచారాన్ని పెద్దగా ఇష్టపడని యామీ ఈ మధ్యే ‘ఉరీ’ సినిమా దర్శకుడు ఆదిత్య ధార్‌ను వివాహం చేసుకొని వార్తల్లో నిలిచారు. సన్నిహితులకు కూడా తెలియని వాళ్ళ ప్రేమ వ్యవహారం గురించి ఆమె ఏం చెబుతున్నారంటే... 


‘‘సరిగ్గా రెండేళ్ళ కిందట... అంటే 2018 జూన్‌. ‘ఉరీ: ది సర్జికల్‌ స్ట్రైక్‌’ షూటింగ్‌ స్పాట్‌లో అడుగుపెట్టాను. ఆ చిత్రంలో ప్రధాన మహిళా పాత్ర నాది. నన్ను చూసిన ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి పలకరించాడు. ఆ చిత్రానికి దర్శకుడినంటూ పరిచయం చేసుకున్నాడు. అతనే ఆదిత్య. అంతకుముందు ఆదిత్య గురించి విన్నాను కానీ కలుసుకున్నది మాత్రం అదే మొదటి సారి. కానీ మా ఇద్దరి మధ్యా ఎంతో కాలంగా పరిచయం ఉన్నట్టనిపించింది. తనకూ అలాగే అనిపించిందంటాడు ఆదిత్య. సెట్‌లో ఎక్కువగా మాట్లాడే అవకాశం దొరక్కపోయినా, షూటింగ్‌కు తయారవుతున్నప్పుడో, సీన్లు వివరిస్తున్నప్పుడో చాలా విషయాలు చెప్పుకొనే వాళ్ళం. క్రమంగా మా ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరిగింది. అది ‘ప్రేమ’ అని ఇద్దరం తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. మా డేటింగ్‌ అలా మొదలయింది.


నేను ప్రేమలో పడతానని ఎప్పుడూ అనుకోలేదు. కుటుంబ నేపథ్యం వల్లో, పెరిగిన వాతావరణం వల్లో నా చుట్టూ ఒక గోడ కట్టుకున్నాను. ఆ పరిధిలోనే నేను సురక్ష్షితంగా ఉంటాననే భావన నాది. అయితే నేను పెళ్ళాడే వ్యక్తి ఎంతో సరదాగా, ఎనర్జిటిక్‌గా ఉండాలనీ, నా కాంప్లెక్స్‌ల నుంచి నన్ను బయటికి తీసుకువచ్చేవాడై ఉండాలనీ అనిపించేది. ఆదిత్య పరిచయం అయ్యాక నేను వెతుకుతున్న వ్యక్తి అతనేననిపించింది. అతన్ని దగ్గరగా గమనించిన తరువాత నాకు తగినవాడు అతనేననే నిర్ణయానికి వచ్చాను. ఆ సంగతే అతనికి చెప్పాను. 



స్నేహితులు నిష్టూరాలాడారు... 

‘ఉరీ’ సినిమా పూర్తయ్యాక ఆదిత్య, నేనూ తరచూ కలుసుకునేవాళ్ళం. కానీ మా ప్రేమను బహిరంగంగా ప్రదర్శించడం ఇద్దరికీ ఇష్టం లేదు. కొన్నాళ్ళయ్యాక మా కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియజేశాం. వాళ్ళు కూడా అంగీకరించారు. మొన్న మా పెళ్ళి గురించి ప్రకటించగానే చాలామంది స్నేహితులు ‘ఇంత రహస్యం ఎందుకు’ అని నిష్టూరంగా మాట్లాడారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే... మొదటి నుంచీ హడావుడికి నేను చాలా దూరంగా ఉంటాను. నా వ్యక్తిగత జీవితాన్ని ప్రచారానికి వీలైనంత దూరంగా ఉంచాలనుకుంటాను. ఆదిత్య మనస్తత్వం కూడా అదే. అందుకే ముందుగా మా పెళ్ళి విషయం మీడియాకు... కనీసం అత్యంత సన్నిహితులకు కూడా చెప్పలేదు. ప్రస్తుతం కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉండడం మరో కారణం. అందుకే కేవలం కుటుంబ సభ్యుల మధ్య... ఆడంబరాలకు దూరంగా పెళ్ళి చేసుకున్నాం. జీవితంలో ఎంతో అపురూపమైన ఈ సందర్భాన్ని మా కుటుంబాలకే పరిమితం చేసుకున్నాం. మా స్నేహం, ప్రేమ ఇప్పుడు మరో రూపాన్ని సంతరించుకుంది. కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాం. సోషల్‌ మీడియా ద్వారా మా వివాహం గురించి వెల్లడించి, అందరి ఆశీస్సులను కోరాం.’’ 


Updated Date - 2021-06-06T05:30:00+05:30 IST