కృష్ణా బోర్డు కార్యాలయం విశాఖలోనే!

ABN , First Publish Date - 2021-01-21T07:22:01+05:30 IST

కృష్ణా బోర్డు కార్యాలయాన్ని విశాఖపట్టణానికి తరలించడం దాదాపు ఖరారు అయినట్టే ఉంది. ఇదే విషయాన్ని బోర్డు అధికారులు ప్రకటించారు. కార్యాలయ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని చూడాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌

కృష్ణా బోర్డు కార్యాలయం విశాఖలోనే!

  • స్థలం చూడండి... మేం పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం
  • ఏపీకి లేఖ రాసిన కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి


హైదరాబాద్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): కృష్ణా బోర్డు కార్యాలయాన్ని విశాఖపట్టణానికి తరలించడం దాదాపు ఖరారు అయినట్టే ఉంది. ఇదే విషయాన్ని బోర్డు అధికారులు ప్రకటించారు. కార్యాలయ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని చూడాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ ఇరిగేషన్‌ శాఖ ఈఎన్‌సీకి కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయిపురె తాజాగా లేఖ రాశారు. తాత్కాలికంగా హైదరాబాద్‌ కేంద్రంగా ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని ఏపీకి తరలించాలని కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్టోబరులో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలోనూ దీనిపై చర్చ జరిగింది. కార్యాలయాన్ని ఏపీకి తరలించడానికి ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు. అయితే దీన్ని కర్నూలు లేదా విజయవాడలో ఏర్పాటు చేస్తారని అందరూ భావించారు. ఇందుకు భిన్నంగా విశాఖపట్నంలో బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.


ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తూ.. బోర్డు కార్యాలయాన్ని విశాఖపట్టణానికి తరలించవద్దని కోరింది. కృష్ణా బేసిన్‌కు విశాఖపట్నం దూరంగా ఉండడం, ఈ ప్రాంతం ఇతర బేసిన్‌లో ఉన్నందువల్ల వద్దని తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు స్పష్టం చేసింది. కానీ, బోర్డు మాత్రం వైజాగ్‌ వైపే మొగ్గు చూపింది. స్థలం దొరికిన తర్వాత తమ అధికారులు వచ్చి పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని లేఖలో తెలిపారు. బోర్డు కార్యాలయానికి సుమారు 7 వేల ఎస్‌ఎ్‌ఫటీ నిర్మాణ విస్తీర్ణం అవసరముంటుందని అంచనా వేస్తున్నారు. భవన సముదాయాన్ని చూసే పనిలో ఏపీ అధికారులు నిమగ్నమైనట్టు తెలుస్తోంది.ఒకటి రెండు మాసాల్లోనే బోర్డు కార్యాలయ తరలింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. 


తెలంగాణ ఫిర్యాదుకు సమాధానం ఇవ్వండి!

తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన గండికోట-చిత్రావతి లిప్టు ప్రాజెక్టుతోపాటు గండికోట నుంచి పైడిపాలెం లిప్టు వంటి అనుమతులు లేని ప్రాజెక్టుల నిర్మాణాలపై సమాధానమివ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కృష్ణా బోర్డు సూచించింది. ఈ మేరకు  ఏపీ ఇరిగేషన్‌ ఈఎన్‌సీకి బుధవారం లేఖ రాశారు. అనుమతులులేకుండా రూ.3,556 కోట్ల అంచనా వ్యయంతో గండికోట-చిత్రావతి లిప్టు, పైడిపాలెం లిప్టు ప్రాజెక్టులను, కుందూ నదిపై 8 టీఎంసీలు లిప్టు చేయడానికి రూ.564 కోట్ల నిధులతో ఏపీ చేపట్టిన ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై బోర్డు అధికారులు స్పందిస్తూ.. తాజాగా లేఖ రాశారు. 

Updated Date - 2021-01-21T07:22:01+05:30 IST