పుస్తకం పోగొట్టుకోదగ్గ ఆస్తి కాదు!

ABN , First Publish Date - 2021-04-26T06:06:51+05:30 IST

సాహిత్యాన్ని ‘పోగొట్టుకోవడంలో’ తెలుగువారంతటి వారు మరిలేరు. ఆదికవి నన్నయ దగ్గరనుంచే ఈ ‘పోగొట్టుకోవడం’ కూడా మొదల యింది....

పుస్తకం పోగొట్టుకోదగ్గ ఆస్తి కాదు!

సాహిత్యాన్ని ‘పోగొట్టుకోవడంలో’ తెలుగువారంతటి వారు మరిలేరు. ఆదికవి నన్నయ దగ్గరనుంచే ఈ ‘పోగొట్టుకోవడం’ కూడా మొదల యింది. ‘చాముండికా విలాసము’, ‘ఇంద్రవిజయము’ అనే పేరుతో వున్న రెండు గ్రంథాలు, నన్నయ రచనలు, ఇప్పుడు అలబ్ధ వాఙ్మయంలో చేరి కనిపిస్తాయి. అలాగే మహాకవి తిక్కన రచన ‘విజయసేనము’ కూడా ఇప్పుడు ‘అలబ్ధమై’ మనకు మిగలకుండా పోయింది. ప్రపంచ సాహిత్యంలోనే ఎన్నదగిన రచనలలో ఒకటిగా స్థానాన్ని సంపాదించుకున్న శాతవాహన రాజు హాలుని సంకలిత గ్రంథం ‘గాథాసప్తశతి’ని తాను ‘నూనూగుమీసాల నూత్నయవ్వనం’ - అంటే పదిహేను, పదహారేళ్ల ప్రాయంలోనే- ప్రాకృతం నుంచి తెలుగులోనికి అనువదించానని శ్రీనాథుడు స్వయంగా గొప్ప చెప్పుకున్నాడు. ఎంత ‘చిన్నపిల్లవాని చేష్టగా’ తీసివేద్దామనుకున్నా, అందులోనివిగా దొరికిన రెండు పద్యాలు ఆ రచనను అలా కొట్టిపారెయ్యడానికి వీలులేనివిగా నిరూపించాయి. ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏమంటే, శ్రీనాథుని ఈ రచన ఆ మహాకవి కాలం తరువాత వందల ఏళ్ళుగా మనతోనే వుండి, కేవలం పోయిన శతాబ్దంలోనే, మన కళ్ళెదురుగానే, మాయమై ‘పోయింది’ అన్నది! అదెలాగంటే, పోయిన శతాబ్దం నాల్గవదశకం దాకా, అంటే 1931 దాకా, శ్రీనాథుని ‘శాలి వాహన సప్తశతి’ కావ్యం లభ్యమై ఉండినదనడానికి నిదర్శనాలు ఉన్నాయి. క్రీ.శ.1931లో జరిగిన కాకతీయ చారిత్రక మహోత్సవాలలో భాగంగా జరిగిన గ్రంథ ప్రదర్శనలో శ్రీనాథుని ‘సప్తశతి’ ప్రదర్శించబడినట్లుగా ‘కాకతీయ సంచిక’కు అనుబంధమైన ‘ఉత్సవమున ప్రదర్శించిన గ్రంథములు’ పట్టికలో ఉన్నట్లుగానూ, ఆచార్య బిరుదురాజు రామరాజుగారి తాతగారి వద్ద ఉండిన ప్రతిని ప్రదర్శన కోసం ఇవ్వగా, ప్రదర్శనానంతరం ఆ ప్రతి తిరిగి వారి వద్దకు చేరలేదని చెబుతారని, ఆచార్య రవ్వా శ్రీహరిగారి ‘అలబ్ధ కావ్య పద్య ముక్తావళి’ గ్రంథంలో వ్రాసిన వివరం బట్టి తెలుస్తుంది. ఇదే కాకుండా, మాన్యులు మానవల్లి రామకృష్ణ కవి గారు శ్రీనాథుని ‘సప్తశతి’ నుంచి ఒక పద్యాన్ని, తాము ఉద్ధరించి ప్రచురించిన నన్నెచోడుని ‘కుమారసంభవం’ ప్రథమ భాగంలో ఉదాహరిస్తూ, ఇది శ్రీనాథుని సప్తశతిలో నాల్గవ ఆశ్వాసంలోనిదని పేర్కొన్నారనీ, ఇందు మూలకంగా కవిగారి వద్ద శ్రీనాథుని సప్తశతి ప్రతి ఉండినదేమో చెప్పలేమనీ కూడ ఈ గ్రంథంలో వ్రాసిన వివరాన్ని బట్టి తెలుస్తుంది. కాకతీయ ఉత్సవాలలో ప్రదర్శించబడిన గ్రంథాల వివరాలను పరిశీలించడానికి ‘కాకతీయ సంచిక’ దొరికినా, అందులో అనుబంధంగా ప్రచురించారని చెప్పిన ‘ఉత్సవమున ప్రదర్శించిన గ్రంథముల’ పట్టిక నాకు లభ్యం కాలేదుగాని, మానవల్లి రామకృష్ణకవి ప్రచురించిన 1909 నాటి ‘కుమారసంభవం’ ప్రతిలోని సంగతులు ఇప్పుడూ పరిశీలనకు అందు బాటులో వున్నవే కాబట్టి, ఆ సంగతిని ఇంకొంచెం వివరంగా శోధించి, ఆధారా లతోసహా అందులోని నిజాన్ని నిర్ధారించుకొనే చిన్న ప్రయత్నం ఇక్కడ చేశాను.


గడచిన ఇరవయ్యవ శతాబ్దం 1909 నాటి రోజులంటే, అప్పటికింకా తెలుగు సాహిత్యంలో కావ్యాల ప్రచురణ కష్టంతోనూ, ఖర్చుతోనూ కూడుకున్న పనే. కవిత్రయంవారి భారతం, పెద్దన, రాయలు, ఇత్యాది లబ్ధప్రతిష్ఠులైన కవుల కావ్యాల ప్రచురణ జరగడమే అంతంతమాత్రంగా ఉండిన కాలమది. అలాంటి రోజులలో ‘విస్మృత కవులు’ పేరుతో తాను ప్రచురించతలపెట్టిన కవుల రచనల పరంపరలో రెండవ కవి రచనగా ఆంధ్రదేశంలో ‘కవిగారు’గా లబ్ధప్రతిష్టులైన మానవల్లి రామకృష్ణకవి ఎన్నో తంటాలుపడి నన్నెచోడుని ‘కుమారసంభవం’ కావ్యాన్ని సంపాదించి, ప్రచురణ సౌలభ్యంకోసం (మొత్తం కావ్యాన్ని ఒకేసారి ప్రచురించడానికి వలసిన ఆర్థిక స్థోమత లేక) కావ్యాన్ని రెండు భాగాలుగా చేసి, మొదటి భాగాన్ని 1909లో ప్రచురించారు. ఆ కావ్యంలో నన్నెచోడుడు వాడిన ప్రాచీన పదముల వివరణకోసం మానవల్లి వారు అప్పటికి లభ్యమ వుతూండిన (ప్రచురణ అయిన, ప్రచురణ కాని తెలుగు, ద్రవిడ, కన్నడ, సంస్కృత, ప్రాకృతభాషలలోని కావ్యములు) దాదాపు 60 గ్రంథములలో నుండి ఉదాహ రణలు చూపి వివరణ ఇచ్చారు. అలా వ్యాఖ్యానం కోసంగా ఉపయోగించిన తెలుగు గ్రంథాలలో శ్రీనాథుని ‘సప్తశతి’ కూడా ఒకటి. 1909లో ముద్రితమైన ‘కుమారసంభవం’ మొదటిభాగం మొదటిపేజీలో అధోజ్ఞాపికలో మానవల్లివారు ఇచ్చిన వివరణ ఇలా వుంది: ‘మేమిందుఁ బ్రయోగములు చూపునపుడు ముద్రిత గ్రంథములనుండి పద్య భాగములను, అముద్రిత గ్రంథములనుండి పూర్ణ పద్యములనుదాహరించెదము’. గ్రంథం అప్పటికింకా ముద్రితం కాకుంటే, ఉదాహరించిన పద్యపు పూర్తి పాఠాన్ని ఇచ్చానని స్పష్టం చేశారు కవిగారు. అదీగాక, ముద్రిత గ్రంథములనుండి, అముద్రిత గ్రంథములనుండి ఇచ్చిన ఉదాహరణలన్నీ కూడా తాళపత్ర గ్రంథముల నుండి ఇచ్చినవేనని గ్రంథం పదవ పేజీలోని అధోజ్ఞాపికలో స్పష్టం చేశారు. అలా ‘కుమార సంభవ’ కావ్యం పంచమాశ్వాసంలోని ఒక వచనంలో వచ్చే ‘దావగొనక’ అనే మాటకు ‘నిలువ లేక’ అని అర్థం చెబుతూ, శ్రీనాథుని ‘సప్తశతి’లోని ‘వారణసేయ దావగొనవా’ అనే పద్యపు పూర్తి పాఠాన్ని ఉదాహరించి అది ‘శ్రీనాథునిసప్తశతిలో నాల్గవ ఆశ్వాసంలోనిది’ అని సూచించారుకవి గారు. దీనినిబట్టి శ్రీనాథుని ‘సప్తశతి’ గ్రంథపు తాళపత్ర ప్రతి ఆనాటికి కవిగారి వద్ద ఉన్నదని విదితమవుతున్నది కదా! గ్రంథాంతంలో ‘ఏతద్వ్యాఖ్యానోదాహృత గ్రంథ నామసంకేత వివరణము’ అనే శీర్షికన కవిగారు పొందుపరచిన ఉదాహృత గ్రంథాల పట్టికలో మొదటిది ‘భార’ సంకేతంతో కవిత్రయంవారి ‘భారతం’, ‘విజ’ అనే సంకేత నామంతో రెండవ గ్రంథం తిక్కన రచనయైున ‘విజయసేనము’ ఉన్నాయి. ఆ వరుసలో 14వ గ్రంథంగా ‘సప్త’ అనే సంకేతాక్షరాలతో ‘శ్రీనాథుని సప్తశతి’ కనుపిస్తుంది. అలా 1909 నాటికి కవిగారి వద్ద తాళపత్ర గ్రంథరాశిలో భాగంగా వుండిన ‘శ్రీనాథుని సప్తశతి’ కవిగారి చేత అప్పటిలోనే ఎందుకు పరిష్కారానికి నోచుకోలేదన్నది ఇప్పుడు జవాబు చెప్పలేని ప్రశ్న. అయితే, కవిగారి నిర్యాణానంతరం ఆయన వద్ద వుండిన ‘గ్రంథరాశి’ అంతా ఎక్కడికి పోయిందో ఆరా తీసి వెదికితే ఇప్పటికైనా శ్రీనాథుని ‘సప్తశతి’ తాళపత్ర ప్రతి (సంపూర్ణంగానో, అసంపూర్ణంగానో) దొరికే అవకాశంలేదంటారా? అలాగే, ‘కుమారసంభవం’ షష్ఠాశ్వాసంలోని ఒక పద్యంలో ‘గండరించు’ అనే మాటకు ‘పడియచ్చుకట్టి పోతపోయు’ అని అర్థం చెబుతూ, తిక్కన ‘విజయసేనము’ కావ్యం రెండవ ఆశ్వాసంలోని ‘మదనవశీకార మంత్ర దేవత దృష్టిగోచరమూర్తి’ అనే పద్యం పూర్తి పాఠాన్ని ఉదాహరించారు కవిగారు. దీనినిబట్టి చూస్తే ఇప్పుడు అలబ్ధమైపోయినదిగా భావిస్తూన్న తిక్కనమహాకవి ‘విజయసేనము’ తాళపత్ర ప్రతి కవిగారి వద్ద ఉండినట్లే కదా! ఈ గ్రంథం కూడా పోయిన శతాబ్దారంభం దాకా మనకు లభ్యమవుతూ వుండి, ఆ తరువాత మాయమై ‘పోయినదిగా’ భావించాలి కదా!


ఏదేమైనా, కాల ప్రవాహంలో ఏమంత వెనుకటిది కాని, క్రీ.శ.1909, 1931ల దాకా లభ్యమై వుండిన శ్రీనాథుని ‘సప్తశతి’, తిక్కన మహాకవి ‘విజయసేనము’ అప్పటిలోనే ముద్రణ భాగ్యానికి నోచుకోకపోవడం ఆంధ్రుల దురదృష్టం. కను మరుగై మిగిలిన శ్రీనాథుని అనువాదంలో హాలుని ‘గాథాసప్తశతి’ పూర్తి కావ్యాన్ని తలచుకున్నపుడల్లా, తెలుగు సాహిత్యాభిమానుల మనసులు అంతులేని దుఃఖానికి గురికావడం పరిపాటి అయిపోయింది. దానికి కారణం, మూల గ్రంథమైన హాలుని ‘గాథాసప్తశతి’ ఒక అభూత కల్పన కాక, క్రీ.శ. ప్రథమ, ద్వితీయ శతాబ్దాలలో దక్షిణభారత జనజీవనానికి సంబంధించిన ఎన్నెన్నో కోణాలు, అంశాలు సత్య దూరంకాని, సహజమైనరీతిలో అందులోని గాథలలో నిక్షిప్తమైవుండటమే. కవిత్వంలో పాండిత్యాంశాలనే కాక, పామరజన జీవనాంశాలనూ సమపాళ్ళలో సమయం సందర్భం దొరికినప్పుడల్లా రమ్యాతిరమ్యంగా, నిజానికి అతిదగ్గరగా, చూపడానికి ఎంతగానో ఇష్టపడి ఆచరణలో పెట్టిన శ్రీనాథుని కవిత్వంలో ‘గాథాసప్తశతి’ లోని గాథలు ఎలా తెలుగులోనూ మెరిసి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయో తెలుసుకోవాలనే జిజ్ఞాస సాహిత్యాభిలాషులైన ప్రతి ఒక్కరికీ ఉండడం సహజం కాదా! 


అదలా ఉండగా, ఒక జాతి సాహిత్యం అంటే లిఖిత సాహిత్యం మాత్రమే కాదు, అందులో మౌఖిక సాహిత్యం కూడా మోపెడంత భాగమై వుంటుంది. మనకి ఉండిన మౌఖిక సాహిత్యంలో ఎంత పోగొట్టుకున్నామో ఊహించుకోవడానికి ఒక చిన్న ఉదాహరణను తీసుకుని చెప్పుకుంటే బాగా అర్థమవుతుంది. ‘పదం’ మన మౌఖిక సాహిత్యంలో ఒక ప్రధా నాంగం. ఒక వంద, నూటయాభై ఏళ్ళ క్రితం దాకా ఈ తరహా సాహిత్యంలో ఎన్ని రకాల పదములు ఉండేవో ఈ 26 రకాల పదముల పేర్లతో విదితమవుతుంది: 1. క్షేత్రయపదములు, 2. ఘట్టుపల్లివారి పదములు, 3. బొల్లవరపువారి పదములు, 4. శోభనగిరివారి పదములు, 5. వీరభద్రయ్యగారి పద ములు, 6. తాళ్ళపాకవారి పదములు, 7. మాతృభూతేశ పదములు, 8. జటపల్లివారి పదములు, 9. ఇనుకొండ వారి పదములు, 10. శివరామపురమువారి పదములు, 11. యువరంగని పదములు, 12. మన్నారురంగని పదములు, 13. కస్తూరిరంగని పదములు, 14. సారంగ పాణి పదములు, 15. పరిమెళరంగ పదములు, 16. మల్లిఖార్జున పదములు, 17. వెంకట్రామశాస్త్రిగారి పదములు, 18. వేణంగిపదములు, 19. గర్భపురి పద ములు, 20. ధర్మపురి పదములు, 21. ఛత్రపురి పదములు, 22. సింహపురి పదములు, 23. భూతపురి పదములు, 24. దాసు శ్రీరాములు గారి పదములు, 25. గబ్బిట యజ్ఞన్నగారి పదములు, 26. యాసపదములు. 


ఇలా రాసుల కొలదిగా మనకుండిన 26 రకాల పదసాహిత్యంలో ఇప్పుడు మిగిలివున్న క్షేత్రయపదములు, తాళ్ళపాకవారి పదములు, సారంగపాణి పదములు తప్ప మిగతా 23 రకాల ‘పదములలోని’ సాహిత్యం గురించి కనీసం ఒకటి రెండు ఉత్తమమైనవైన ఉదాహరణలతోపాటుగా వివరంగా వ్రాయగలిగినవారు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? ఎన్ని రకాలైన సహజ భావచిత్రాలు, ఎంత భాష ఈ మిగిలిన 23 రకాల పదసాహిత్యంలో మరుగునపడి మాయమైపోయిందో తలుచుకుంటే బాధ కలగకుండా ఎలా వుండగలదు?  


పోతే పోయిందిలే, మళ్ళీ సంపాయించుకోవచ్చుననుకోవడానికి సాహిత్యం డబ్బు కాదు. కొన్ని వందల వేల సృజనాత్మక క్షణాలలో మానవ హృదయం, మనస్సు జమిలిగా చేసే తపస్సుకు ఫలంగా ఉనికిని సంతరించుకుని మనే ఒక మాటల నిర్మాణం. అన్నివిధాలా అచ్చంగా అదేలాంటి మరో జీవిని నిర్మించి ఉనికిలోనికి తేవడం బ్రహ్మకు సైతం ఎలా సాధ్యం కాదో, అలాగే అచ్చంగా అదే లాంటి మరో సాహిత్య గ్రంథాన్ని సృష్ఠించడం ఏ సాహిత్యకారుని వల్లనూ కాని పని. ఈ నిజాన్ని గుర్తిస్తే చాలు, పోయిన సాహిత్యాన్ని పోయినదిగా వదిలేసి నిమ్మళంగా కూర్చోవడం అనే దురవస్థను వదిలి, తనవంతుగా చేయగల కృషిని చేయడానికి ప్రతి సాహిత్యాభిలాషి ఉద్యుక్తుడౌతాడని ఆశించవచ్చు.


భట్టు వెంకటరావు

Updated Date - 2021-04-26T06:06:51+05:30 IST