కలెక్టర్లే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-01-16T08:48:50+05:30 IST

భూముల వివాదాలన్నింటినీ నిర్ణీత వ్యవధిలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ప్రత్యేక ట్రైబ్యునల్‌లో రెవెన్యూ కోర్టుల కేసులు,

కలెక్టర్లే పరిష్కరించాలి

భూ వివాదాల పరిష్కారమంతా వారి చేతిలోనే..

తహసీల్దార్ల అధికారాలన్నీ కలెక్టర్లకు బదిలీ

పాస్‌పోర్ట్‌ ఆధారంగా ఎన్నారైలకు పాస్‌పుస్తకాలు

హైకోర్టు తీర్పు మేరకే సాదాబైనామాల క్రమబద్ధీకరణ


హైదరాబాద్‌, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): భూముల వివాదాలన్నింటినీ నిర్ణీత వ్యవధిలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ప్రత్యేక ట్రైబ్యునల్‌లో రెవెన్యూ కోర్టుల కేసులు, పెండింగ్‌ మ్యుటేషన్లు, సంస్థలు/కంపెనీలు/ఎన్నారైలకు పట్టాదారు పాస్‌పుస్తకాల జారీ, పాస్‌పుస్తకంలో తగ్గిన విస్తీర్ణాన్ని సరి చేయడం, ఏజెన్సీ ప్రాంతాల్లో ఎల్‌టీఆర్‌ కేసులు, నిషేధిత జాబితా నవీకరణ, సాదా బైనామాల దరఖాస్తుల పరిశీలనాధికారం అంతా జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ అప్పగించిన విషయం తెలిసిందే. కాగా, ఆయా అంశాలను ఏ విధంగా పరిశీలించాలనే అంశంపై మంగళవారం రాత్రి భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సర్క్యులర్‌ (నంబర్‌ 1/2021 (15-1-2021))ను జారీ చేశారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం అదనపు కలెక్టర్‌(రెవెన్యూ)తోపాటు అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థల) సహకారం తీసుకోవాలని, ఇక ఎట్టి పరిస్థితుల్లో ఇతర అధికారులకు అధికారాలను దఖలు పరచరాదని స్పష్టం చే శారు. కీలకమైన సాదా బైనామాల క్రమబద్ధీకరణలో మాత్రం హైకోర్టు తుది తీర్పును ప్రామాణికం చేసుకోవాలని నిర్దేశించారు. ధరణి (తెలంగాణ భూమి హక్కులు పట్టాదారు పాస్‌పుస్తకం చట్టం-2020) రావడానికి ముందు భూములపై తహసీల్దార్లకు ఉన్న అధికారాలన్నింటినీ తాజాగా కలెక్టర్లకు దఖలు పరిచారు. తహసీల్దార్లు చేసే పనులన్నీ కలెక్టర్‌ స్వయంగా చేసేలా అధికారాలు కట్టబెట్టారు. ఇక ఎన్‌ఆర్‌ఐల(ప్రవాస భారతీయుల)కు పాస్‌పోర్ట్‌ ఆధారంగా పాస్‌బుక్‌ను జారీ చేయనున్నారు.  


పెండింగ్‌ మ్యుటేషన్లపై పరిశీలన ఇలా..

రిజిస్ట్రేషన్‌ జరిగినప్పటికీ భూరికార్డుల్లో పేర్లు చేరని రైతుల పెండింగ్‌ మ్యుటేషన్లను క్లియర్‌ చేయాలి. ఒక్కసారి భూవిక్రయం జరిగితే దరఖాస్తును వెంటనే పరిష్కరించాలి. ఒకటికి రెండుసార్లు సదరు భూమి రిజిస్ట్రేషన్‌ జరిగి ఉంటే.. డాక్యుమెంట్లను పరిశీలించాలి. ఒకసారి దరఖాస్తుదారుడి పత్రం ఆమోదం పొందితే స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలని ఎస్‌ఎంఎస్‌ పంపాలి. ఇక కంపెనీలు/సంస్థలు/సొసైటీలు/ట్ర్‌స్టలు పట్టాదారు పాస్‌పుస్తకాలకు నిర్ణీత నమూనా(ప్రి్‌సక్రైబ్డ్‌ ఫార్మాట్‌)లో దరఖాస్తులు స్వీకరించాలి. సంబంధిత కంపెనీ/ట్రస్ట్‌ క్లెయిమ్‌ చేస్తున్న భూమి వివరాలు తీసుకోవాలి. ఎన్నారైల కోసం ధరణిలో ప్రత్యేక సాప్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి, కలెక్టర్‌కు అందుబాటులో పెడతారు. 


ఆఽధార్‌ పెండింగ్‌ కేసుల్లో..

ఆధార్‌ నంబర్‌ సరిగా లేనివారు, ఆధార్‌ లేనివారు, బయోమెట్రిక్‌ ఫెయిల్యూర్‌ సందర్భాల్లో మీసేవ కేంద్రాల్లో పట్టాదారు పాస్‌పుస్తకం కోసం దరఖాస్తు చేసుకునేలా అవకాశం ఇవ్వాలి. ఇక పాస్‌పుస్తకంలో విస్తీర్ణం తగ్గిందనుకున్నవారు ధరణిలో దరఖాస్తులు పెట్టుకోవాలి. కలెక్టర్‌ వివరాలను సరిచేసుకొని, తగిన సంబంధిత సమాచారం ఆధారంగా దరఖాస్తును ఆమోదించడం లేదా తిరస్కరించడం చేయవచ్చు.


నిషేధిత జాబితాపై..

రిజిస్ట్రేషన్‌ చట్టం-1908లోని సెక్షన్‌-22(ఏ) ప్రకారం నిషేధిత భూముల విక్రయాలు జరగకుండా ఆటోలాక్‌ చేయాలి. ఒక సర్వేనెంబర్‌లోని భూమి అంతా నిషేధిత జాబితాలో ఉంటే.. అందులో పట్టా(ప్రైవేట్‌) భూములను వేరు చేసి పక్కాగా నిషేధిత జాబితా తయారు చేయాలి. నిషేధిత జాబితాలో చేర్చిన, తొలగించిన అంశాలపై జిల్లా కలెక్టర్‌లు అన్ని విజ్ఙప్తులపై విచారణ జరిపి... జాబితాను సిద్ధం చేయాలి. అనంతరం నివేదికను రిజిస్ట్రేషన్ల ఐజీతో పాటు భూపరిపాలన ప్రధాన కమిషనర్‌కు పంపించాలి. నిషేధిత జాబితాలో చేర్చిన, తీసివేసిన భూముల వివరాలను సమగ్రంగా సిద్ధం చేయాలి. కలెక్టర్‌ నివేదిక ఆధారంగా ఐజీ(రిజిస్ట్రేషన్లు), సీసీఎల్‌ఏ నిషేధిత జాబితాపై తగిన నిర్ణయం తీసుకోవాలి. జిల్లా కలెక్టర్లు జాబితాను ఐజీ(రిజిస్ట్రేషన్లు), సీసీఎల్‌ఏ కార్యాలయానికి ఈమెయిల్‌ ద్వారా సాఫ్ట్‌కాపీలు చిరునామాలకు పంపించాలి. సేకరించిన భూముల జాబితాతోపాటు ఏయే భూములను నిషేధిత జాబితాలో ప్రతిపాదిస్తున్నారో ఆ జాబితాను, షేధిత జాబితా నుంచి తొలగించే భూములకు సంబంధించిన మరో జాబితాను పంపించాలి. జాబితాలోని తప్పులు, సేకరించిన భూముల వివరాలను వారం రోజుల్లోపు సరిచేయాలి.


సాదా బైనామాల క్రమబద్ధీకరణపై..

సాదా బైనామాల క్రమబద్ధీకరణ దరఖాస్తులు మీసేవలో అందుబాటులో ఉన్నాయి. ఈ దరఖాస్తులను పరిశీలించి.. ఏజెన్సీ ప్రాంతాలు, అర్హతలేని ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులు, నిషేధిత జాబితాలోని ఆస్తులను తిరస్కరించాలి. 100లోపు దరఖాస్తులు వచ్చిన గ్రామాన్ని తొలిదశలో కలెక్టర్‌ క్షేత్రస్థాయి విచారణ చేయాలి. ముందే నిర్దేశించుకున్న షెడ్యూల్‌ ప్రకారం గ్రామాన్ని కలెక్టర్లు పరిశీలించి.. క్షేత్రస్థాయి విచారణ జరిపించాలి. సాదాబైనామా తర్వాత భూమి రిజిస్ట్రేషన్‌ జరిగిందా? అన్న వివరాలు తీసుకోవాలి. విచారణ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లో ఉండాలి. క్షేత్రస్థాయి పరిశీలనలతో చెక్‌లిస్టును కలెక్టర్‌ లాగిన్‌లో జనరేట్‌ చేయాలి.  క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం దరఖాస్తును ఆమోదించాలా? తిరస్కరించాలా? అనేది హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు తుది తీర్పు ఆధారంగా తీసుకోవాలి.

Updated Date - 2021-01-16T08:48:50+05:30 IST