Abn logo
Mar 25 2020 @ 05:00AM

పత్రికలకు విశ్వసనీయత అద్భుతం

పత్రికాధిపతులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని 

పాల్గొన్న ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణ

న్యూఢిల్లీ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా తీవ్రత నుంచి మనం ఎంత మేరకు బయటపడగలిగామన్నది మరో మూడు వారాల తర్వాత కానీ తేలదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దేశంలోని 14 కేంద్రాల్లో ఉన్న 11 భాషల్లో ప్రచురించే 20 ప్రముఖ పత్రికల అధినేతలతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశంలో నలుమూలలా కరోనా తీవ్రతను వివరించి, ప్రజలను జాగరూకులను చేయడంలో మీడియా ప్రశంసనీయమైన పాత్ర పోషించిందని కొనియాడారు.


కిందిస్థాయి వరకు సరైన సమాచారాన్ని వ్యాప్తి చేయడం ద్వారా సవాళ్లను ఎదుర్కొనే విధంగా మీడియా చెప్పుకోదగిన పాత్ర పోషిస్తోందని అన్నారు. ‘‘పత్రికలకు అద్భుతమైన విశ్వసనీయత ఉంది. స్థానిక పేజీలను ప్రజలు విస్తృతంగా చదువుతారు. అందు కే, కరోనా వైర్‌సకు సంబంధించి ప్రజలకు సరైన సమాచారాన్ని అందించడంలో పత్రికల పాత్ర అంతా ఇంతా కాదు. కరోనా సోకిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సల గురించి పత్రికలే ప్రజలకు వివరించగలవు. పరీక్ష కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి? ఎవరికి పరీక్ష నిర్వహించాలి? ఇళ్లలో ఉండడం ద్వారా కరోనాను నివారించుకోవడం ఎలా? తదితర అంశాలను పత్రికలే ప్రజలకు అర్థమయ్యేలా వివరించగలవు’’ అని వ్యాఖ్యానించారు. తమ తమ వెబ్‌ పోర్టళ్లలో కూడా పత్రికలు తగిన సమాచారాన్ని ఇవ్వాలని, లాక్‌ డౌన్‌ సమయంలో ఇది మరింత అవసరమని చెప్పారు. నిత్యావసర వస్తువుల లభ్యత గురించి కూడా పత్రికలు సమాచారాన్ని ఇవ్వగలవని తెలిపారు.


సామాజిక దూరం ప్రాధా న్యం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ఉందని, కరోనా వ్యాప్తి జరిగితే ఏర్పడే ప్రమాదాల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. ఇతర దేశాల నుంచి వచ్చే అంతర్జాతీ య డేటా, కేస్‌ స్టడీల గురించి వివరించాలని చెప్పారు. నిరాశావాదం, వ్యతిరేక ధోరణి, వదంతులకు ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రజల్లో పోరాట స్ఫూర్తిని పెంచాలని కోరారు. కాగా, క్లిష్ట సమయంలో దేశానికి సమర్థ నాయకత్వాన్ని అందిస్తున్నందుకు పలువురు పత్రికాధిపతులు ప్రధానిని ప్రశంసించారు. ప్రధాని సూచనలకు అనుగుణంగా ప్రజల కు స్ఫూర్తినిచ్చే కథనాలను అందిస్తామని చెప్పారు. ప్రింట్‌ మీడియా విశ్వసనీయతను పెంచినందుకు వారు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు, కరో నా వేగంగా వ్యాప్తి చెందుతోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్‌ తెలిపారు. ఈ సమావేశంలో సమాచార మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ కూడా పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement