రైతులకు సంకెళ్ల ఘనత కేసీఆర్‌దే

ABN , First Publish Date - 2021-11-30T05:08:25+05:30 IST

రైతులకు సంకెళ్ల ఘనత కేసీఆర్‌దే

రైతులకు సంకెళ్ల ఘనత కేసీఆర్‌దే
మాట్లాడుతున్నహనుమంతరావు, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి


  •   మిల్లర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు కుమ్మక్కై  దోపిడీ
  •   కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు 

పరిగి/కులకచర్ల/దోమ: రైతులకు సంకెళ్లు వేయించిన ఘనత దేశంలోనే  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కిందని మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు అన్నారు. సోమవారం పరిగిలో మాజీఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. గిట్టుబాటు ధర కోరేహక్కు రైతుకు ఉందని, దానికోసమే నిరసన తెలిపిన వారిని జైలుకు పంపిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. రాష్ట్రంలో నియంతపాలన కొనసాగుతోందన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ రెండూ ఒక్కటేనని, దొంగనాటకం ఆడుతున్నాయని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ రైతులతో ఆడుకుంటున్నారన్నారు. మిల్లర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ మోసాలను పార్లమెంట్‌లో నిలదీస్తామని తెలిపారు. గత సీజన్‌లో రైతుల నుంచి కట్‌చేసిన డబ్బులు వారి ఖాతాల్లో జమ చేయాలని డిసెంబర్‌ 3న వికారాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తానని వీహెచ్‌ తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ పెద్ద కుటుంబమని,  సమస్యల పరిష్కారానికి ఎదుటివారిపై పోరాటానికి మాత్రం ఏకతాటిపై ఉంటామని గుర్తు చేశారు. డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ వడ్ల కొనుగోళ్లలో టీఆర్‌ఎస్‌ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఒక్క పుట్టపహాడ్‌లోనే తూకంలో మోసం చేసి రైతుల పొట్టకొట్టారన్నారు. అంతకు ముందు వీహెచ్‌ కులకచర్ల, దోమ మండలాల్లో పర్యటించారు. అంతారం, పుట్టపహాడ్‌లలో వరికల్లాల దగ్గరకు వెళ్లి రైతులతో మాట్లాడారు. కొనుగోళ్లలో జాప్యం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని తెలిపారు. నాయకుల వెంట డీసీసీ ప్రధానకార్యదర్శి కె.హన్మంత్‌, పరిగి, దోమ, గండ్వీడ్‌ మండలాల కాంగ్రెస్‌ అధ్యక్షులు బి.పరశురాంరెడ్డి, ఎం.విజయ్‌కుమార్‌రెడ్డి, కేఎం.నారాయణ, రాజాపుల్లారెడ్డి, అశోక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-11-30T05:08:25+05:30 IST