‘ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య ఒప్పందంతోనే జీవో 203’

ABN , First Publish Date - 2020-06-06T03:57:51+05:30 IST

కృష్ణ జలాల అంశం తెలుగు రాష్ట్రాల్లో హీట్ రాజేసిన విషయం తెలిసిందే...

‘ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య ఒప్పందంతోనే జీవో 203’

హైదరాబాద్ : కృష్ణ జలాల అంశం తెలుగు రాష్ట్రాల్లో హీట్ రాజేసిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపు సామర్థ్యాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవో నంబర్‌ 203ను జారీ చేసింది. దీనిపై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నేతల ఒకరిపై విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. మరోవైపు ఈ జీవోపై తెలంగాణ ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు నిరసనకు దిగుతున్నారు. శుక్రవారం నాడు ‘పట్టిసీమపై మళ్లీ మొదటికొచ్చిన తెలంగాణ.. నీరూ నిప్పు’ అనే అంశంపై ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ THE DEBATE నిర్వహించింది. ఈ డిబెట్‌లో బీజేపీ నేత రఘునందన్ పాల్గొన్నారు. 


ప్రగతిభవన్‌లోనే...

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య ఒప్పందంతోనే జీవో ఇచ్చారని ఆరోపించారు. జీవో 203 విడుదల చేసినప్పుడు సీఎం కేసీఆర్‌ అభ్యంతరం చెప్పలేదన్నారు. జీవో నెంబర్‌ 203ను ప్రగతిభవన్‌లోనే తయారు చేశారని.. ఏపీలో సంతకం పెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. పాలమూరు ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్‌ కావాలనే విస్మరించిందని ఈ డిబెట్‌లో రఘునందన్‌ వ్యాఖ్యానించారు. 


గోదావరిలో నీటి సమస్య రావొచ్చు..

కృష్ణా, గోదావరి బోర్డు సమావేశాలు సాధారణంగా జరిగేవేనని విశ్లేషకులు లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. బోర్డులకు నీటిని కేటాయించే అధికారం లేదన్నారు. నీటిని వినియోగించుకునే అంశంలో యాజమాన్య పర్యవేక్షణ మాత్రమే కృష్ణా బోర్డు చేయగలదన్నారు. భవిష్యత్‌లో గోదావరిలో నీటి సమస్య రావొచ్చని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ఆల్మట్టి కట్టిన తర్వాత కృష్ణాకు నీరు రావడం కష్టంగా మారిందన్నారు. తెలంగాణకు వచ్చిన నష్టమేంటో అర్థం కావట్లేదని లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు.ట్రిబ్యునల్‌ తీర్పులను శిరసా వహించాలి. విభజన చట్టాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. కేంద్రం డీపీఆర్‌లు అడిగితే పక్షపాతం అనడం సరికాదు. విభజన చట్టం అమలులో కేంద్రం అలసత్వం వహించిందిఅని లక్ష్మీనారాయణ అన్నారు.


ఇదంతా రాజకీయ క్రీడలో భాగమే..

రెండు రాష్ట్రాల అధికారులు ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటారని కాంగ్రెస్‌ నేత సంపత్‌కుమార్‌ పేర్కొన్నారు. ఇదంతా రాజకీయ క్రీడలో భాగమేనని.. రాయలసీమకు నీళ్లిస్తామని జగన్‌ ప్రకటన చేసినప్పుడు కేసీఆర్‌ ఎందుకు మేల్కోలేదు? అని ఈ డిబెట్ ద్వారా సంపత్‌ ప్రశ్నించారు. ప్రజల సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో లబ్ధిపొందాలని యత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయ లబ్ధితో పాటు ఆర్థిక కోణం కూడా దాగి ఉందని సంపత్‌కుమార్‌ చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-06-06T03:57:51+05:30 IST