దర్శకుడి తర్వాత దర్శకుడిలా ఎడిటర్‌ ఆలోచించాలి

ABN , First Publish Date - 2021-04-04T05:30:00+05:30 IST

‘జెర్సీ’ సినిమా గుర్తుంది కదూ! హైదరాబాద్‌ టీమ్‌లో తన పేరు చూసుకున్నాక...మౌనంగానే హీరో నాని రైల్వే

దర్శకుడి తర్వాత దర్శకుడిలా ఎడిటర్‌ ఆలోచించాలి

‘జెర్సీ’ సినిమా గుర్తుంది కదూ! హైదరాబాద్‌ టీమ్‌లో తన పేరు చూసుకున్నాక...మౌనంగానే హీరో నాని రైల్వే స్టేషన్‌కు వెళతాడు. ట్రైన్‌ వచ్చిన తర్వాత తన భావోద్వేగాన్ని బయటపెడతాడు. మాటలకు అందని భావమది. మౌనాన్ని మించిన ఉద్వేగమది. ‘జెర్సీ’ చిత్రానికి ఉత్తమ ఎడిటర్‌గా జాతీయ పురస్కారానికి ఎంపికయ్యానని తెలిశాక...అటువంటి భావోద్వేగానికి గురయ్యానని అంటారు నవీన్‌ నూలి. జాతీయ పురస్కార గ్రహీతతో ముచ్చట్లు... ‘నవ్య’ పాఠకుల కోసం.



 అవార్డు వచ్చిన విషయం తెలిశాక... మీ ఫీలింగ్‌?

కరోనా కారణంగా అవార్డుల విషయమే మర్చిపోయా. అందుకని, సర్‌ప్రైజ్‌ అయ్యా. తర్వాత ‘జెర్సీ’లో ట్రైన్‌ సీక్వెన్స్‌లో హీరో నాని భావోద్వేగానికి లోనవుతారు కదా. సరిగ్గా అదే అనుభూతికి లోనయ్యా. నేను ఉన్న చోట ట్రైన్‌ లేదంతే!


 


ఈ సినిమా అవకాశం మీకు ఎలా వచ్చింది?

‘జెర్సీ’ అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ చూడగానే ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. నిర్మాత సూర్యదేవర నాగవంశీని ‘ఆ చిత్రానికి ఎడిటింగ్‌ ఎవరు చేస్తున్నారు’ అని అడిగా. అప్పటికి దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరితో నాకు పరిచయం లేదు. కొన్ని రోజులకు ‘గౌతమ్‌ వచ్చి కథ చెబుతాడు. విను. నేను అతనితో మాట్లాడాను’ అని వంశీ చెప్పారు. గౌతమ్‌ను క్యాజువల్‌గా ఓసారి కలిశా. ‘అరవింద సమేత...’ విడుదల తర్వాత కథ చెప్పాడు. వినగానే కనెక్ట్‌ అయ్యా. సినిమాతో అసోసియేట్‌ అయిన వారందరూ బాగా వస్తుందని చెప్పేవారు. ఎప్పుడు ఎడిట్‌ చేద్దామా అని ఎగ్జైటయ్యా. 


 ఎడిటింగ్‌ టైమ్‌లో గౌతమ్‌ తిన్ననూరి ఏమన్నారు?

మేమిద్దరం చాలా తక్కువ రోజులు కూర్చున్నాం. త్వరగా వర్క్‌ ఫినిష్‌ చేశా. అయితే, గౌతమ్‌కు ఎడిటింగ్‌ అంటే ఇంట్రెస్ట్‌. ఫైనల్‌ అవుట్‌పుట్‌ చూశాక... ‘పర్‌ఫెక్ట్‌! చాలా బావుంది’ అన్నాడు.


 హిందీ ‘జెర్సీ’కీ మీరు వర్క్‌ చేస్తున్నట్టున్నారు?

అవును. హిందీలో రీమేక్‌ చేస్తున్నారని తెలిసి గౌతమ్‌ను ‘నేను చేస్తా’ అని అడిగా. ‘సినిమాకు దర్శకుడు ఎంత ముఖ్యమో... ఎడిటర్‌ కూడా అంతే ముఖ్యం. మనిద్దరం కలిసి చేస్తున్నాం’ అని చెప్పాడు. ఇటీవలే ఎడిటింగ్‌ పూర్తయింది. హిందీలో నాకు తొలి చిత్రమదే.


 ఎడిటర్‌, డైరెక్టర్‌ మధ్య ఎటువంటి అనుబంధం ఉండాలి?

ఇద్దరి మధ్య ఎప్పుడూ ఓ ఎమోషనల్‌ కనెక్షన్‌ ఉండాలి. ఇద్దరి ఆలోచనా విధానం ఒకేలా ఉంటే మూవీ అవుట్‌పుట్‌ బావుంటుంది.


 గతంలో మీరు ట్రైలర్స్‌ కట్‌ చేశారు కదా! ట్రైలర్‌ కటింగ్‌... సినిమా ఎడిటింగ్‌... ఏది కష్టం?

రెండూ కష్టమే. సినిమాకు ట్రైలర్‌ ప్రజెంటేషన్‌ లాంటిది. అందులోనూ ఓ కథ చెప్పాలి. అయితే, సినిమా కథను చెప్పాలా? ఆసక్తికంగా ఉండేలా వేరే విధంగా కథను చెప్పాలా? అనేది ప్రశ్న. ఏదైనా చిన్న కథ లేకుండా ట్రైలర్లు కట్‌ చేయలేం! ఆ స్టోరి రావడానికి కష్టపడాలి. సినిమా అయితే... ఆర్టిస్టుల నటన, సాంకేతిక అంశాలు - దర్శకుడు అనుకున్నది ఏదైనా, అంతకుమించి బెటర్‌మెంట్‌ అయినా ఎడిటింగ్‌లోనే వస్తుంది.




 మీకు సంతృప్తినిచ్చిన సినిమాలు లేదా సన్నివేశాలు?

ఎడిటింగ్‌లో రెండు రకాలున్నాయి. ఒకటి... ఎక్కువ కట్స్‌ వేయడం! అది ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది. రెండు... దర్శకుడికీ, కొంతమందికీ మాత్రమే తెలిసేది. ఈ పద్థతిలో షాట్‌ కట్‌ అయిన విషయమూ ఎవరికీ తెలియదు. అటువంటి ఎడిటింగ్‌ నేను ఎక్కువ ఇష్టపడతా. ముఖ్యంగా ఎమోషన్‌ సీన్లు! అవి నటీనటుల ప్రతిభకు గీటురాయి వంటివి. ఒక్కొక్క ఆర్టిస్ట్‌ ఒక్కోలా చేస్తారు. ఆరిస్ట్‌ ఎంత ఎక్స్‌ప్రెస్సివ్‌గా ఉన్నారు? ప్రేక్షకులు ఎమోషనల్‌గా ఎంత కనెక్ట్‌ అవుతారు? అనే దాన్నిబట్టి ఎడిటింగ్‌ చేయాలి.


ఇక, సంతృప్తినిచ్చిన సన్నివేశాలకు వస్తే... ‘రంగస్థలం’లో ఎవరు హత్య చేశారనేది వెల్లడించే సన్నివేశం, చంపిందెవరో తెలుసుకోవడానికి రామ్‌చరణ్‌ చేసే అన్వేషణ. ‘జెర్సీ’కి వస్తే... ట్రైన్‌ సీక్వెన్స్‌! అలాగే, సినిమాలో కథను ఒకటే పాట... ‘స్పిరిట్‌ ఆఫ్‌ జెర్సీ’లో చూపించాం. అదీ కష్టమే! ‘అరవింద సమేత...’లో ఎన్టీఆర్‌ ఫోన్‌లో వార్నింగ్‌ ఇచ్చే సీన్‌.


 మీరు ఎటువంటి ఎడిటింగ్‌ ఇష్టపడతారు?

షాట్‌ కట్‌ అయినట్టు కూడా తెలియకూడదు. అదే ముఖ్యం! ప్రతి సినిమా ఒక ఎమోషనల్‌ రైడ్‌. యాక్షన్‌ ఫిల్మ్‌లోనూ ఓ ఎమోషన్‌ ఉంటుంది. అది ఇంపార్టెంట్‌. ప్రతీకారమో, మరొకటో... హీరోలు ఫైట్‌ చేయడానికి కారణం ఉంటుంది. అది కంటిన్యూ అయ్యేలా చూడాలి. దర్శకుడి తర్వాత దర్శకుడిలా ఎడిటర్‌ ఆలోచించాలి. అప్పుడే బెటర్‌ ఫిల్మ్‌ వస్తుంది.


 ఓ సినిమా ఎడిటింగ్‌కి ఎన్ని రోజులు పడుతుంది?

ఆరు నెలలు... మూడు నెలలు... ఐదు రోజులు... కంటెంట్‌ మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి భారీ సినిమాలు త్వరగా పూర్తవుతాయి. చిన్న చిత్రాలకు ఎక్కువ రోజులు పడుతుంది. ‘జెర్సీ’ని తీసుకుంటే... ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగైదు వరకూ, 20 రోజుల్లో పూర్తి చేశా.


 రివ్యూల్లో ఎడిటింగ్‌ ప్రస్తావన గురించి...

నీట్‌గా లేదా క్రిస్ప్‌గా ఉందనో రాస్తారు. గుడ్‌ అంటారు. ఎందుకు బావుందో రాయరు. బాలేదంటే... నిడివి సమస్యలే ఎక్కువ ఉంటాయి. రివ్యూలు రాసేవాళ్ళల్లో... 90 శాతంమందికి ఎడిటింగ్‌ అంటే తెలియదు. అవకాశం దొరికితే... వివరించే ప్రయత్నం చేస్తా. నిడివి సమస్య వస్తే... ఎడిటర్‌ను నిందిస్తారు. మాతో సినిమా అంతా ట్రావెల్‌ చేస్తే... మేం ఎంత ఎఫర్ట్స్‌ పెడతామో సమీక్షకులకు తెలుస్తుంది. 


 అవార్డు వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల స్పందన? 

నాకన్నా ఎక్కువ హ్యాపీగా ఉన్నది అమ్మే (విజయ). పదేళ్ళుగా... నాకు పెద్ద అవార్డు వస్తే అమ్మకు అంకితం ఇద్దామని అనుకుంటున్నా. అందుకని, నేషనల్‌ అవార్డు రాగానే అమ్మకు డెడికేట్‌ చేశా. నా గురించి ఎవరైనా ఏమైనా చెబితే... ఎంతో సంతోషపడుతుంది. 





సినిమా ఎడిటింగ్‌ కంటే ముందు ట్రైలర్లు కట్‌ చేసేవాణ్ణి. 2014 వరకూ పలు చిత్రాలకు ట్రైలర్లు కట్‌ చేశా. మధ్యలో కొన్ని చిత్రాలకు ఎడిటింగ్‌ చేసినప్పటికీ... ‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మన్‌’ (2015), ‘నాన్నకు ప్రేమతో’ (2016) చిత్రాల నుంచి ఎడిటర్‌గా పూర్తిస్థాయిలో నా ప్రయాణం ప్రారంభమైంది. ‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మన్‌’ ఎడిటింగ్‌కు గాను నంది అవార్డు అందుకున్నా. అంతకు ముందే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ నాకు పరిచయం. ‘జులాయి’కి ట్రైలర్లు చేసినప్పుడు... ప్రమోషన్‌ సాంగ్‌ ‘పకడో పకడో’కి ఎడిటింగ్‌ చేశా. నా వర్క్‌ ఆయనకు నచ్చింది. దేవిశ్రీ పర్సనల్‌ వీడియోస్‌ కొన్నిటికి వర్క్‌ చేశా. నా ఐడియాస్‌కు సుకుమార్‌ అయితే కరెక్ట్‌గా ఉంటుందని, దేవి ఆయనకు పరిచయం చేశారు.


ఆ తర్వాత ‘నాన్నకు ప్రేమతో’ చేశా. దానికీ ఎడిటర్‌గా నంది అవార్డు అందుకున్నా. ఇక, నా కెరీర్‌ పరంగా టర్నింగ్‌ పాయింట్‌ అంటే ‘రంగస్థలం’. ఆ చిత్రానికి చాలా కష్టపడ్డా. అందులో నా ఎడిటింగ్‌ దర్శకుల్లో చాలామందికి బాగా నచ్చింది. ఆ చిత్రానికి నేషనల్‌ అవార్డు వస్తే బావుంటుందనే ఫీలింగ్‌ వచ్చింది. ఇప్పటివరకూ ‘ధృవ’, ‘తొలిప్రేమ’, ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘జెర్సీ’, ‘అల... వైకుంఠపురములో’, ‘భీష్మ’, ‘క్రాక్‌’, ‘ఉప్పెన’ సహా పలు చిత్రాలకు పని చేశా. ప్రస్తుతం ‘ఆచార్య’తో పాటు పవన్‌కల్యాణ్‌ - రానా ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌, ‘వరుడు కావలెను’, ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ తదితర చిత్రాలకు పని చేస్తున్నా. అవార్డు వచ్చిన సందర్భంగా నన్ను నమ్మిన దర్శకులు అందరికీ థ్యాంక్స్‌.

 సత్య పులగం

Updated Date - 2021-04-04T05:30:00+05:30 IST