కాడి వదిలేసిన రైతన్న!

ABN , First Publish Date - 2021-01-17T08:59:15+05:30 IST

ప్రకృత్తి విపత్తులు రైతన్నను భయపెట్టాయా? విత్తు నాటేందుకు రైతన్న వెనకాడుతున్నాడా..............

కాడి వదిలేసిన రైతన్న!

  • వెంటాడుతున్న విపత్తుల భయం
  • కరోనాతో ఆర్థిక పరిస్థితులు తలకిందులు
  • ఆదుకోడానికి ముందుకురాని ప్రభుత్వాలు
  • రబీ సాగుకు దూరంగా సగం మంది
  • సీజన్‌ మొదలై మూడు నెలలు
  • సగానికిపైగా విస్తీర్ణంలో పడని పంటలు
  • చెరువులు.. ప్రాజెక్టుల్లో జలకళ
  • అయినా సాగుకు ఆసక్తిచూపని రైతన్న


(అమరావతి-ఆంధ్రజ్యోతి): ప్రకృత్తి విపత్తులు రైతన్నను భయపెట్టాయా? విత్తు నాటేందుకు రైతన్న వెనకాడుతున్నాడా? రబీ సీజన్‌ మొదలై మూడు నెలలు గడుస్తున్నా సగానికిపైగా విస్తీర్ణంలో విత్తనం పడకపోవడాన్ని చూస్తే ఇదే నిజమనిపిస్తోంది. రాష్ట్రంలో రబీ సాగు సాధారణ విస్తీర్ణం 59.65లక్షల ఎకరాలు. దీనిలో 56.87 లక్షల ఎకరాలు సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో డిసెంబరు నెలాఖరుకే 40.17 లక్షల ఎకరాలు సాగులోకి రావాలి. కానీ, వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారమే 20.05 లక్షల ఎకరాల్లోనే ఇప్పటి వరకు విత్తనం పడింది. నిరుడు ఇదే సమయానికి 38.22 లక్షల ఎకరాల్లో పంటలు సాగులోకి వచ్చాయి. దాళ్వా వరి సాగు విస్తీర్ణం వాస్తవ అంచనా 17.82 లక్షల ఎకరాలుకాగా.. 6.80 లక్షల ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. రబీలో అత్యధికంగా పండించే శనగ 11.62 లక్షల ఎకరాలకుగాను ఇప్పటి వరకు 8.32 లక్షల ఎకరాలు మాత్రమే సాగులోకి వచ్చింది. 9 లక్షల ఎకరాల్లో వేసే మినుము 6 లక్షల ఎకరాల్లోనే సాగయ్యింది. పెసర 3లక్షల ఎకరాలకుగాను లక్ష ఎకరాలకు మించలేదు. చిరుధాన్యాలు, తృణధాన్యాల పంటలు మూడో వంతు కూడా పడలేదు. పప్పుధాన్యాల పంటలు 25 లక్షల ఎకరాలకుగాను 16లక్షల ఎకరాలు, నూనె గింజల పంటలు 3.32లక్షల ఎకరాలకుగాను 1.42లక్షల ఎకరాల్లో సాగులో ఉన్నాయి. ఇతర పంటలు కూడా సగానికి సగమే వేశారు.  


వెంటాడుతున్న విపత్తులు.. ఆదుకోని ప్రభుత్వాలు

రబీ సాగు గణాంకాలను పరిశీలిస్తే.. సాగు చేసేందుకు రైతన్న వెనకాడుతున్నట్టు కనిపిస్తోంది. ఇందుకు ప్రధానంగా ప్రకృతి విపత్తులే కారణం. గతేడాది జూన్‌ నుంచి నవంబరు వరకు దక్షిణకోస్తా, రాయలసీమలో వరుస అల్పపీడనాలు, వాయుగుండం, నివర్‌ తుఫాన్‌తో కురిసన భారీ వర్షాలకు ఖరీఫ్‌ పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. రైతులు ఆర్థికంగా చితికిపోయారు. రబీ సాగులోకి దిగేందుకు వారికి పెట్టుబడుల సమస్య వెంటాడుతోంది. కరోనా నేపథ్యంలో పంట రుణాల సొమ్ము ఓ వైపు కుటుంబ అవసరాలకు, మరోవైపు పంటల సాగుకు వెచ్చించుకుంటూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని రైతులు చెప్తున్నారు. 2020లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెట్టుబడి సాయం రూ.13,500 అందినా, అది ఏ మూలకూ సరిపోలేదంటున్నారు. గత రబీలో పంట రుణాలకు వడ్డీతోసహా బాకీలు కట్టినా, వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ ఆగిపోయింది. నివర్‌ తుఫాన్‌తో పంట నష్టపోతే, రాష్ట్రప్రభుత్వం నామమాత్రంగా ఎకరాకు నాలుగైదు వేలు కూడా ఇవ్వలేదు. కేంద్రం నుంచి ఏ సాయమూ దక్కలేదు. దీనికితోడు రబీ సాగుకు విత్తన లభ్యత తక్కువగా ఉందని చెప్తున్నారు. సాధారణ రాయితీ విత్తనాల పంపిణీ ఇంకా పూర్తికాలేదు.


నివర్‌ తుఫాన్‌కు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రాయితీపై ఇస్తామన్న విత్తనాలు ఇప్పటికి 60ు మాత్రమే పంపిణీ చేశారు. ఈ పరిస్థితుల్లో రబీ సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. వాస్తవంగా వర్షాలు బాగా పడటంతో చెరువులు, ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. ఖరీఫ్‌ పంటలు దెబ్బతిన్న పరిస్థితుల్లో ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు రబీ సాగువైపు రైతులు విస్తృతంగా కదలాలి. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. సాగు విస్తీర్ణం గతేడాది గణాంకాలను కూడా ఇంతవరకూ చేరుకోలేదు. మున్ముందైనా రబీ సాగు పుంజుకుంటుందో లేదో చూడాలి. 

Updated Date - 2021-01-17T08:59:15+05:30 IST