కాలనీలకు కంచెలా?

ABN , First Publish Date - 2020-03-27T09:47:53+05:30 IST

‘మా ఊరికి మీరొద్దు.. మీ ఊరికి మేమొద్దు’ అంటూ తెలుగు రాష్ట్రాల్లో పలు గ్రామాల ప్రజలు కంచెలు వేస్తున్న కథనాలు చదివి.. హైదరాబాద్‌లో చాలా కాలనీలవాసులు అదే బాట పడుతున్నారు. ‘మా కాలనీలో మేముంటాం. మేం బయటకు వెళ్లం..

కాలనీలకు కంచెలా?

అత్యవసర సేవలకు ఇబ్బంది కలిగే ముప్పు

స్వయంసమృద్ధ పల్లెల్లో కంచెలతో ఇబ్బంది తక్కువ

కాలనీల్లో అలా చేస్తే సమస్యలతో అల్లకల్లోలం

వైద్యులు, నర్సులు, అత్యవసర సేవల సిబ్బందికి

జనతా కర్ఫ్యూ రోజున మాత్రమే ప్రశంసలా?

ఇప్పుడు వారిని అనుమానంగా చూడడం తప్పు

లాక్‌డౌన్‌లోనూ చప్పట్లు కొట్టి అభినందించండి


పొద్దున్నే పాలు రావాలి..  పేపర్‌ రావాలి! అత్యవసరమైతే బయటకు వెళ్లాలి! ఇవేమీ ఆలోచించకుండా పలు కాలనీల్లో అత్యుత్సాహంతో కంచెలు వేస్తున్నారు! జనతా కర్ఫ్యూ  రోజున చప్పట్లు కొట్టి.. ఇప్పుడు వైద్య సిబ్బందిని అనుమానంగా చూస్తున్నారు! కాలనీవాసులు చేయాల్సిన పనేనా ఇది!!?


(హైదరాబాద్‌ సిటీ బ్యూరో ప్రతినిధి-ఆంధ్రజ్యోతి)

‘మా ఊరికి మీరొద్దు.. మీ ఊరికి మేమొద్దు’ అంటూ తెలుగు రాష్ట్రాల్లో పలు గ్రామాల ప్రజలు కంచెలు వేస్తున్న కథనాలు చదివి.. హైదరాబాద్‌లో చాలా కాలనీలవాసులు అదే బాట పడుతున్నారు. ‘మా కాలనీలో మేముంటాం. మేం బయటకు వెళ్లం.. బయటోళ్లను లోపలికి రానివ్వం’ అనే తరహాలో వ్యవహరిస్తున్నారు. పాటిగడ్డకు ఆనుకొని ఉండే ఎన్‌బీటీ నగర్‌.. నేరెడ్‌మెట్‌ క్రాస్‌రోడ్స్‌కు సమీపంలోని శివసాయి నగర్‌.. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని దుర్గానగర్‌ బస్తీ, ప్రగతి కాలనీ, సంజీవరెడ్డినగర్‌ ప్రధాన రహదారిని ఆనుకొని ఉండే బాపునగర్‌ బంజారాబస్తీ, హయత్‌నగర్‌లోని పలు కాలనీల్లో ఇదే పరిస్థితి.


స్వయం సమృద్ధి కలిగిఉండే పల్లెటూళ్లల్లో కంచెలు కట్టడం వల్ల పెద్దగా నష్టం లేదు. పాలు, కూరగాయలు, ధాన్యం, పప్పుల వంటివి అక్కడే దొరుకుతాయి. కాలనీల్లో ఆ తరహా కంచెలు వేస్తే మాత్రం కష్టం. అత్యవసర సేవలు అందించాల్సిన వైద్యులు, విద్యుత్‌, నీటి సరఫరా, పారిశుధ్య సిబ్బంది, పాత్రికేయులు ఇలా చాలా మంది ఉంటుంటారు. కాలనీల్లో ఉండే దుకాణాలకు సరుకులు, కూరగాయలు రావాలి. పాలు రావాలి. నీళ్ల ట్యాంకర్లు రావాలి. విద్యుత్‌ సమస్యలు వస్తే సిబ్బంది వచ్చి బాగుచేయాలి. అలాంటి చోట్ల కంచెలు వేసి మూసేస్తే.. కాలనీవాసులు.. మరీ ముఖ్యంగా, అత్యవసర సేవలు అందించాల్సిన సిబ్బంది బయటకు వెళ్లడం కష్టమవుతుంది.


ఇప్పుడూ అలాగే చేద్దాం..

జనతా కర్ఫ్యూ సందర్భంగా వైద్యులను, వైద్యసిబ్బందిని, పోలీసులను అభినందిస్తూ చప్పట్లు కొట్టి, ఘంటానాదం చేశాం. అది ఆ ఒక్కరోజుకే పరిమితమైందని.. ఇప్పుడు కాలనీల్లో తమను అనుమానంగా చూస్తున్నారని వైద్యులు, ఇతర అత్యవసర సేవల సిబ్బంది వాపోతున్నారు. వారి పట్ల సానుకూలంగా వ్యవహరించడంతోపాటు, వారి సేవల్ని గుర్తిస్తున్నామన్న సందేశం వారికి అందించేలా వ్యవహరిస్తే మంచిందంటున్నారు. జనతా కర్ఫ్యూ రోజున ప్రదర్శించిన స్ఫూర్తిని మరింతకాలం కొనసాగించాలి. కాలనీలో వైద్యులు, నర్సులు ఉంటే.. వారు విధులకు వెళ్లేప్పుడు చప్పట్లు కొట్టి అభినందించి పంపాలి. కాలనీలను మూసివేయడం ఈ సమస్యకు పరిష్కారం కాదని చాలామంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వారు సూచిస్తున్న కొన్ని మార్గాలు..


  1. కాలనీని పూర్తిగా మూసేయడం కన్నా.. ఒక వాచ్‌మన్‌ను నియమించి, నిఘా పెట్టాలి. 
  2. వచ్చినవారికి దగ్గు, జలుబు వంటివి ఉంటే హెల్ప్‌లైన్‌ నంబర్‌ 104కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలి.
  3. కాలనీలో.. ఇటీవలికాలంలో విదేశాల నుంచి వచ్చినవాళ్లు ఎవరైనా ఉన్నారా? లేదా అలా వెళ్లొచ్చినవారితో ఎవరైనా గడిపారా? వారు ఇప్పుడు హోం క్వారంటైన్‌లో గడుపుతున్నారా? లేక బయట తిరుగుతున్నారా? గమనించాలి.
  4. ఇద్దరూ వైద్యులే ఉన్న కుటుంబాల్లో పిల్లలను సాధారణంగా బడికో, డేకేర్‌ సెంటర్‌కో పంపించి ఆస్పత్రులకు వెళ్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇద్దరూ ఆస్పత్రికి వెళ్తే పిల్లల పరిస్థితి ఏంటి? అందరూ వారికి అండగా నిలవాలి.

Updated Date - 2020-03-27T09:47:53+05:30 IST