హెచ్‌సీఎల్‌ అదరహో !

ABN , First Publish Date - 2021-01-16T06:57:12+05:30 IST

దేశీయ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ అంచనాలను మించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికాని (క్యూ3)కి కంపెనీ లాభం రూ.3,982 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక

హెచ్‌సీఎల్‌ అదరహో !

అంచనాలు మించిన కంపెనీ ఆర్థిక ఫలితాలు 

31% వృద్ధితో రూ.3,982 కోట్లకు క్యూ3 లాభం 


న్యూఢిల్లీ: దేశీయ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ అంచనాలను మించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికాని (క్యూ3)కి కంపెనీ లాభం రూ.3,982 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి నమోదైన రూ.3,037 కోట్ల లాభంతో పోలిస్తే 31.1 శాతం వృద్ధి కనబర్చింది. సంస్థ డిజిటల్‌, ప్రొడక్ట్స్‌, ప్లాట్‌ఫామ్‌ విభాగాల్లో పటిష్ఠమైన పనితీరు ఇందుకు దోహదపడింది. మున్ముందు త్రైమాసికాల్లో వ్యాపారం మరింత పుంజుకోనుందని హెచ్‌సీఎల్‌ టెక్‌ ధీమా వ్యక్తం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూలై-సెప్టెంబరు త్రైమాసికం (క్యూ2)తో పోల్చినా కంపెనీ మెరుగైన పనితీరును కనబర్చింది. క్యూ2 లాభం రూ.3,142 కోట్లతో పోలిస్తే 26.7 శాతం, ఆదాయం రూ.18,594 కోట్లతో పోలిస్తే 3.8 శాతం వృద్ధి నమోదైంది. 


డీడబ్ల్యూఎస్‌ కొనుగోలు పూర్తి 

ఆస్ట్రేలియాకు చెందిన ఐటీ కంపెనీ డీడబ్ల్యూఎస్‌ కొనుగోలు ప్రక్రియ ఈనెలలోనే పూర్తయినట్లు హెచ్‌సీఎల్‌ టెక్‌ వెల్లడించింది. డిసెంబరు త్రైమాసికానికి డీడబ్ల్యూఎస్‌ ఆదాయంతో కలిపి గణాంకాలను విడుదల చేసినట్లు స్పష్టం చేసింది. 


ఒక్కో షేరుకు రూ.4 డివిడెండ్‌ 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను వాటాదారులకు ఒక్కో షేరుపై రూ.4 మధ్యంతర డివిడెండ్‌ చెల్లించనున్నట్లు హెచ్‌సీఎల్‌ టెక్‌ ప్రకటించింది. 


మరిన్ని ముఖ్యాంశాలు.. 

గడిచిన త్రైమాసికంలో కంపెనీ 13 డీల్స్‌ కుదుర్చుకుంది. దాంతో బుకింగ్స్‌ వార్షిక ప్రాతిపదికన 13 శాతం పెరిగాయి. 

2020 డిసెంబరు చివరినాటికి కంపెనీలో 1,59,682 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గడిచిన మూడు నెలల్లో కంపెనీ నికరంగా 6,597 మందిని ఉద్యోగంలో చేర్చుకుంది. సమీక్షా కాలానికి కంపెనీ ఉద్యోగుల వలసల రేటు 10.2 శాతంగా నమోదైంది. 


లాభాల స్వీకరణతో షేరు 4% డౌన్‌ 

హెచ్‌సీఎల్‌ మెరుగైన పనితీరు కనబర్చినప్పటికీ ట్రేడర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో బీఎ స్‌ఈలో కంపెనీ షేరు 3.73 శాతం నష్టపోయి రూ.989.40 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో షేరు 3.72 శాతం నష్టపోయి రూ.989.50 వద్ద క్లోజైంది. 


6 నెలల్లో 20,000 మంది నియామకం 

వచ్చే రెండు త్రైమాసికాల్లో మరో 20,000 మందిని (ఫ్రెషర్లు+అనుభవజ్ఞులు) కంపెనీలో చేర్చుకోవాలనుకుంటున్నట్లు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సీఈఓ, ప్రెసిడెంట్‌ విజయ్‌ కుమార్‌ తెలిపారు. మొదటి, రెండో త్రైమాసికాల్లో ప్రాంగణ నియామాకాలకు ఇబ్బందులు ఎదురైనప్పటికీ మూడో త్రైమాసికంలో 4,022 మంది ఫ్రెషర్లను కంపెనీలో చేర్చుకోవడం జరిగిందని హెచ్‌సీఎల్‌ టెక్‌ చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ ఆఫీసర్‌ వీవీ అప్పారావు వెల్లడించారు. దాంతో డిసెంబరు చివరి నాటికి ఫ్రెషర్ల నియామకాలు 6,480కి చేరాయన్నారు. మార్చి త్రైమాసికంలో మరో 5,000 మందిని చేర్చుకునే యోచనలో ఉన్నామన్నారు. 


1,000 కోట్ల డాలర్లు దాటిన ఆదాయం 

గడిచిన మూడు నెలల కాలానికి హెచ్‌సీఎల్‌ టెక్‌ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 6.4 శాతం పెరిగి రూ.19,302 కోట్లుగా నమోదైంది. తద్వారా 2020 క్యాలెండర్‌ ఏడాదిలో కంపెనీ ఆర్జించిన మొత్తం ఆదాయం 1,000 కోట్ల డాలర్ల (రూ.75,000 కోట్లు) మైలురాయిని దాటింది. స్థిర కరెన్సీ ఆధారంగా డిసెంబరు త్రైమాసిక ఆదాయం 1.5-2.5 శాతం మేర వృద్ధిని నమోదు చేసుకోవవచ్చని క్యూ2 ఫలితాల సందర్భంగా కంపెనీ అంచనా వేసింది. వాస్తవానికి ఆదాయ వృద్ధి కంపెనీ అంచనాలను మించి 3.5 శాతంగా నమోదైంది. ఈ నేపథ్యంలో మార్చితో ముగియనున్న నాలుగో త్రైమాసిక (క్యూ4) ఆదాయ వృద్ధి అంచనాను కంపెనీ 2-3 శాతానికి పెంచింది. 

Updated Date - 2021-01-16T06:57:12+05:30 IST