నిలువెత్తు నిర్లక్ష్యం!

ABN , First Publish Date - 2021-04-20T08:29:48+05:30 IST

మార్చి రెండో వారం నుంచి రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలైంది. అప్పటి నుంచి రోజూ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రస్తుతం రోజుకు 7 వేల కేసులు నమోదవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 27 మంది కరోనా కాటుకు బలయ్యారు

నిలువెత్తు నిర్లక్ష్యం!

కరోనాపై పోరు పట్టించుకోని సర్కారు

సీఎం రెండు రోజులు సమీక్షించినా..కట్టుదిట్టమైన ఆంక్షల ఊసే లేదు

ప్రభుత్వ ఉద్యోగుల మరణ రోదన

వర్క్‌ ఫ్రం హోంపై స్పందన కరువు

పాఠశాలల్లో పెరుగుతున్న కేసులు

అయినా పది పరీక్షలకు ప్రభుత్వం రెడీ

సీబీఎస్‌ఈకి లేని సమస్య ‘స్టేట్‌’కేల?

విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన


సెకండ్‌ వేవ్‌లో కరోనా వైరస్‌ మహోగ్రరూపం దాల్చుతోంది. రోజుకు ఏడు వేలకుపైనే కేసులు నమోదవుతున్నాయి. డజన్ల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ సారి ప్రభుత్వ ఉద్యోగులు మృత్యువాతపడడం అధికమైంది. ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం లేదు. ఆక్సిజన్‌ కొరత ఏర్పడుతోంది. రెమ్‌డెసివిర్‌ లాంటి ప్రాణరక్షణ మందుల లభ్యత గగనమైంది. విద్యాలయాల్లోనూ కరోనా కోరలు చాస్తోంది. రాష్ట్రంలో పరిస్థితి ఇంత ప్రమాదకరంగా మారుతున్నా.. ప్రభుత్వం మాత్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. కరోనా కట్టడికి ఒక్క గట్టి నిర్ణయం తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. కొన్నిచోట్ల వ్యాపారులే స్వీయనియంత్రణ పద్ధతులు పాటిస్తున్నా ప్రభుత్వం మాత్రం పోతేపోనీలే అన్నట్టు వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మార్చి రెండో వారం నుంచి రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలైంది. అప్పటి నుంచి రోజూ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రస్తుతం రోజుకు 7 వేల కేసులు నమోదవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 27 మంది కరోనా కాటుకు బలయ్యారు. తాజా పరిస్థితిపై రెండు రోజులుగా సీఎం జగన్‌ సమీక్షిస్తున్నారనే వార్తలు బయటకు పొక్కడంతో.. కరోనా కట్టడికి సర్కారు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని అంతా భావించారు.


అయితే, సోమవారం సీఎం సమావేశం తర్వాత రెండు రోజుల సమీక్షలు, వాటి ఫలితాలు ఒట్టివేనని తేలిపోయింది. 1 నుంచి 9 తరగతుల వరకు సెలవులు ప్రకటించి, ఇక వారికి విద్యాసంవత్సరం ముగిసినట్టేనని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సరేశ్‌ ప్రకటించారు. 10వ తరగతి పరీక్షలు మాత్రం ఉంటాయని చెప్పారు. మరి పదో తరగతి విద్యార్థులు, టీచర్లకు వైరస్‌ సోకితే పరిస్థితేమిటి? గతేడాది అనుభవంతో తాజాగా సీబీఎ్‌సఈ కూడా టెన్త్‌ పరీక్షలను రద్దుచేసి ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా ప్రమోషన్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. గతం కంటే ఎక్కువగా కరోనా విజృంభిస్తుండడంతో కేంద్రం ముందుగానే చర్యలు చేపట్టింది. లాక్‌డౌన్‌ తప్ప అనేక నిర్ణయాలు తీసుకుంది. ఇదే పని ఏపీ సర్కారు ఎందుకు చేయడంలేదన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. సీబీఎ్‌సఈకి లేని సమస్య స్టేట్‌ సిలబ్‌సకే వస్తుందా? అని కొందరు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. 


విద్యార్థుల క్షేమం గాలికి..

ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు విద్యార్థుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. వారి క్షేమం కోరి పరీక్షలు రద్దుచేశారు. మరి కొన్ని చోట్ల వాయిదా వేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఏకంగా లాక్‌డౌన్‌ పెట్టేశారు. తెలంగాణలోనూ టెన్త్‌ పరీక్షలు రద్దుచేశారు. ఇంటర్‌ పరీక్షలు వాయిదావేశారు. పాఠశాలలు మూసివేశారు. ఏపీలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సర్కారు చర్యలు, వారి నిర్ణయాలు టెన్త్‌ విద్యార్ధులను మరింత ప్రమాదంలోకి నెట్టేసేలా ఉన్నాయని, ఈ నిర్ణయంపై వెంటనే పునరాలోచన చేసుకోవాలని విపక్షాలు, మానవహక్కుల సంస్థలు, వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఈ సారి కరోనా ఊహించని విధంగా చిన్నా, పెద్ద తేడాలేకుండా అందరినీ కోలుకోలేని దెబ్బతీస్తోందని, ఇలాంటి వితప్కర సమయంలో విద్యార్థుల విషయంలో రిస్క్‌ తీసుకోవద్దని అవి ప్రభుత్వానికి సూచిస్తున్నాయి. 


రెండు రోజుల సమీక్షతో ఏం తేల్చారు? 

గత రెండు రోజుల కాలంగా సీఎం జగన్‌ కరోనా కట్టడిపై సమీక్ష చేస్తున్నారని చెప్పినా.. చివరకు ఒక్కటంటే ఒక్క కఠిన నిర్ణయం కూడా తీసుకోలేదు. కొత్తగా ఎలాంటి ఆంక్షలు విధించలేదు. కరోనాను కట్టడిచేయాలంటే లాక్‌డౌన్‌ పెట్టాల్సిన పనిలేదని, కొద్దిపాటి ఆంక్షలు, నిబంధనల అమలు సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. చిరువ్యాపారులు, కార్మికుల ఉపాధికి దెబ్బతగలకుండా అంతా భౌతిక దూరం పాటించేలా, విధిగా మాస్క్‌ ధరించేలా చర్యలు తీసుకోవచ్చని,  ప్రజలు పెద్దసంఖ్యలో గుమికూడకుండా నిరోధించాలని సూచిస్తున్నారు. కానీ.. ఇలాంటి వాటి గురించేమీ సర్కారు ప్రకటించలేదు. మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్‌ వంటి చోట్ల ప్రభుత్వాలు పాక్షిక లాక్‌డౌన్‌ విధించాయి. ఏపీలో కనీసం 144 సెక్షన్‌ కూడా విధించలేదు. ఏటేటా 20 శాతం మద్యం షాపులు తగ్గిస్తామని జగన్‌ సర్కారు గొప్పగా చెప్పింది. ఇప్పుడు కరోనా నియంత్రణలో భాగంగా కనీసం మద్యం దుకాణాల విషయంలో ఆంక్షలు విధించడం లేదు. మద్యం దుకాణాల వద్ద ఇప్పటికీ భారీ క్యూలు కనిపిస్తున్నాయి. భౌతిక దూరం, మాస్క్‌ ధారణ ఎవరూ పట్టించుకోవడం లేదు. బార్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ల్లో కరోనా నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేయాలి. వీటిపైనా సర్కారు ఇప్పటిదాకా ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. 


రిస్క్‌లో ఉద్యోగుల ప్రాణాలు

తొలి దశ కరోనాలో ఉద్యోగులు పెద్ద సంఖ్యలోనే కొవిడ్‌-19 బారిన పడ్డారు. కానీ అప్పట్లో ముందస్తు జాగ్రత్తలు, ఆరోగ్యం పట్ల తీసుకున్న శ్రద్ధతో ప్రాణనష్టం చాలా తక్కువ. ఈ సారి కరోనా విజృంభిస్తోంది. సచివాలయం, శాఖాధిపతుల ఆఫీసుల్లో కరోనా కేసులు విపరీంగా పెరిగిపోతున్నాయి. మూడు రోజుల వ్యవధిలో నలుగురు ఉద్యోగులు మరణించారు. హైకోర్టు పరిధిలో ఇద్దరు ఉద్యోగులు కరోనాతో చనిపోయారు. శాఖాధిపతుల విభాగాల్లో ముగ్గురికిపైగా మరణించినట్లు ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వర్క్‌ఫ్రమ్‌హోమ్‌కు అవకాశం కల్పించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. విపత్కర పరిస్థితుల్లో కనీసం షిప్ట్‌ విధానం అయినా అమలు చేయాలి. ఈ డిమాండ్‌పై ఇప్పటివరకు ముఖ్యమంత్రి స్పందించలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితో ఉద్యోగుల ప్రాణాలు మరింత రిస్క్‌లో పడుతాయని వెంటనే సీఎం జోక్యం చేసుకొని తగిన నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.

Updated Date - 2021-04-20T08:29:48+05:30 IST