జ్ఞానుల స్పందన

ABN , First Publish Date - 2021-08-13T05:30:00+05:30 IST

జెన్‌ సాహిత్యం చిత్రమైన ప్రశ్నలతో, విచిత్రమైన జవాబులతో, వింత ఆచారాలతో, విడ్డూరమైన చర్యలతో నిండి ఉంటుంది. జెన్‌ కథలను చదవగా, చదవగా క్రమంగా వాటి ఆంతర్యం...

జ్ఞానుల స్పందన

జెన్‌ సాహిత్యం చిత్రమైన ప్రశ్నలతో, విచిత్రమైన జవాబులతో, వింత ఆచారాలతో, విడ్డూరమైన చర్యలతో నిండి ఉంటుంది. జెన్‌ కథలను చదవగా, చదవగా క్రమంగా వాటి ఆంతర్యం అంతో ఇంతో బోధపడుతుంది. 

దేశాటనలో ఉన్న జెన్‌ సాధువు ఒకరు ఒక ఊరులోని మఠానికి చేరుకున్నాడు. ఆ రాత్రి అక్కడ బస చెయ్యాలనుకొని, తలుపు తట్టాడు. అక్కడ ఆచారం ప్రకారం, ఏ సాధువైనా... ఏ మఠంలోనైనా ఒకటి రెండు రోజులు ఉండాలనుకుంటే... ఆ మఠాధిపతి వేసే ప్రశ్నల్లో కనీసం ఒకదానికైనా సరైన జవాబు చెప్పాలి. అప్పుడే ఆ సాధువుకు వసతి కల్పిస్తారు. సమాధానం ఇవ్వకపోతే మరో చోటుకు వెళ్ళాల్సిందే.

ఆ రోజు ఆ సాధువు తలుపు తట్టి నిరీక్షిస్తున్నాడు. కొద్ది సేపటికి ఆ మఠాధిపతి తలుపు తీశాడు. ‘‘నేను యాత్ర చేస్తున్న సాధువును. ఈ రోజు మీ మఠంలో ఉండాలనుకుంటున్నాను. అనుమతించండి’’ అని కోరాడు.

అప్పుడు మఠాధిపతి ‘‘సరే! కానీ, ముందు ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పు. నీ తల్లి, తండ్రి పుట్టక ముందు నీకున్న ముఖం ఏది? నీ అసలైన ముఖం ఏది? నీ తల్లితండ్రుల నుంచి ఈ శరీరాన్నీ, ఈ ముఖాన్నీ పొందావు. కానీ నీ అసలు రూపం, నీ అసలు ముఖం ఏది? చెప్పు’’ అన్నాడు.

ఆతిథ్యాన్ని కోరుతున్న ఆ సాధువు తన పాదరక్షల్లో ఒకటి తీశాడు. క్షణం ఆలస్యం చెయ్యకుండా... తనను ప్రశ్నించిన మఠాధిపతి ముఖం మీద కొట్టాడు.

ప్రశ్నించిన ఆ మఠాధిపతి పక్కకు తొలగి, నమస్కరిస్తూ ‘‘మీకు స్వాగతం’’ అన్నాడు. అతిథి లోపలకు ప్రవేశించాడు.

ఆ రోజు రాత్రి భోజనం ముగించిన మఠాధిపతి, ఆ సాధువు మండుతున్న మంట దగ్గర చలి కాచుకుంటూ సంభాషించడం మొదలుపెట్టారు.

‘‘నేను ‘మీ అసలు ముఖం ఏది?’ అని అడిగిన ప్రశ్నకు ఎంత చక్కటి సమాధానం ఇచ్చారు!’’ అన్నాడు మఠాధిపతి ప్రశంసాపూర్వకంగా.

‘పాదరక్షతో కొట్టడం సరైన సమాధానమా? చక్కటి, అద్భుతమైన సమాధానమా? దానికి సంతోషించి, మఠంలో బస చెయ్యడానికి మఠాధిపతి అంగీకరించడమా?’ అనే ప్రశ్నలు మఠంలోని వారికి కలిగాయి. ఆ సందేహాన్ని వారి ముందు వ్యక్తపరిచారు. 

దానికి  మఠాధిపతి బదులిస్తూ‘‘తల్లి తండ్రుల నుంచి వచ్చిన ఈ శరీరం, ఈ ముఖం మన అసలు స్వరూపం కానీ, అసలు ముఖం కానీ కావు. ఏ క్షణంలోనైనా ప్రకృతి కొట్టే చెప్పు దెబ్బకు చితికిపోయేవే! అసలు ముఖం, అసలు రూపం అనేవి మాటల్లో చెప్పలేనివి. మాటలకూ, ఆలోచనలకూ అతీతమైనవి. ఇది గ్రహించిన వాడు నిస్సంకోచంగా స్పందిస్తాడు. లోకుల నిందాస్తుతులకు జంకడు. తన చర్యలకు ఎలాంటి ఫలితం ఉంటుందోనని సందేహించకుండా స్పందిస్తాడు. ఆ స్పందనలోనే సమాధానం కనబడేలా చేస్తాడు. ఇక్కడ జరిగింది కూడా అదే!’’ అన్నాడు.

‘‘మన స్వరూపం ఏ నిమిషంలోనైనా, ఏ చిన్న ప్రమాదంలోనైనా నశించేది కాదు. నిర్గుణ, నిరాకార, సచ్చిదానంత స్వరూపమే మన అసలు రూపం. భౌతిక రూపం ఒక భ్రాంతి’’ అని చెబుతుంది వేదాంతం. దాన్ని ధ్యానం (జెన్‌) ద్వారా మాత్రమే గ్రహించగలం. స్వానుభవం మాత్రమే ఆ జ్ఞానాన్ని అందించగలదు. అలాంటి జ్ఞాని మాత్రమే ‘శివోహం’ అని, ‘అహం బ్రహ్మస్మి’ అని ప్రకటించగలడు. అలాంటి జ్ఞాని ఎలాంటి పరిస్థితిలో ఎలా స్పందిస్తాడో ఎవరూ ఊహించలేరు. విగ్రహారాధనకు విముఖుడైన ఆళ్వార్‌ రాజుకు కనువిప్పు కలిగించడానికి... ఆ రాజు చిత్తరువు మీద ఉమ్మి వేయాల్సిందిగా రాజసేవకులకు చెప్పాడు వివేకానందస్వామి. పూజా సమయంలో లౌకిక విషయాలను ఆలోచిస్తున్న రాణీ రాసమణి చెంప ఛెళ్ళు మనిపించారు రామకృష్ణ పరమహంస. జ్ఞానుల స్పందన ఈ తీరుగా ఉంటుంది.

- రాచమడుగు శ్రీనివాసులు

Updated Date - 2021-08-13T05:30:00+05:30 IST