మళ్లీ సీఎంగానే సభకొస్తా!

ABN , First Publish Date - 2021-11-20T07:54:40+05:30 IST

శాసనసభలో సాగుపై మొదలైన చర్చ... ఎక్కడికో వెళ్లిపోయింది. వ్యక్తిగత దూషణలతోపాటు... విపక్షనేత చంద్రబాబు కుటుంబ సభ్యులనూ అవమానించే స్థాయికి చేరుకుంది. శుక్రవారం అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచే విపక్షంపై..

మళ్లీ సీఎంగానే  సభకొస్తా!

  • ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ
  • భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేల 
  • అసెంబ్లీలో చంద్రబాబు ప్రతిజ్ఞ
  • సతీమణిపై ఎమ్మెల్యేల అసభ్య
  • వ్యాఖ్యలతో తీవ్ర ఆక్రోశం, ఆవేదన
  • మీడియా భేటీలో కన్నీటి పర్యంతం
  • సభారంభం నుంచే బాబుపై మాటల దాడి
  • పరస్పర వ్యాఖ్యలు, ప్రతి వ్యాఖ్యలతో ఉద్రిక్తత
  • అంబటి రాంబాబు ప్రసంగ సమయంలో
  • పక్క నుంచి వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలు
  • తీవ్రంగా స్పందించిన విపక్ష సభ్యులు
  • సభ వాయిదా... ఆపై కొడాలి నాని వంతు
  • చంద్రబాబు మాట్లాడుతుండగానే మైక్‌ కట్‌
  • తీవ్రంగా స్పందించిన విపక్ష నేత
  • ‘మీకు నమస్కారం’ అంటూ బహిష్కరణ
  • మరీ ఇంత దారుణమా?
  • అసహ్యమైన మాటలతో వ్యక్తిత్వ హననం
  • ఆమె ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదు
  • ఆమె త్యాగం, శ్రమ ఎంతో ఉంది
  • అధికారం కోల్పోయినప్పుడూ 
  • నేను ఇంత బాధపడలేదు
  • ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటా... 
  • ఆ తర్వాతే అసెంబ్లీకి
  • ధర్మం వైపో... అధర్మం వైపో ప్రజలు నిర్ణయించుకోవాలి: బాబు


అసభ్య వ్యాఖ్యలుభరించలేక బాబు కన్నీరు

‘‘నేను పరువు కోసమే బతుకుతున్నాను. ఇప్పుడు... నా కుటుంబాన్ని, నా భార్యను కూడా ఈ హౌస్‌లోకి తీసుకువచ్చారు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి కౌరవ సభ.లో ఒక్క క్షణం కూడా నేను ఉండను. మీకు నమస్కారం. మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాతేఈ సభలో అడుగు పెడతాను. లేకుంటే నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. మీ అందరికీ మరోసారి 

నమస్కారం!’’

చంద్రబాబు



చర్చలు జరగాల్సిన శాసనసభ రచ్చకు వేదికగా మారింది. దూషణలు, వ్యంగ్య వ్యాఖ్యానాలతో దద్దరిల్లింది. చివరికి... వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు కుటుంబ సభ్యులను అసభ్యంగా, అవమానించేలా మాట్లాడారు. సామాన్యులు సైతం పడటానికి ఇష్టపడని, ఎవరైనా అంటే సహించలేని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సతీమణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడారు. దీనిపై స్పందించేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో... చంద్రబాబు రగిలిపోయారు. ‘ఇది గౌరవ సభ కాదు... కౌరవ సభ. మళ్లీ సీఎంగానే నేను సభకు వస్తా’ అంటూ ప్రతిజ్ఞ చేశారు. ఆయనతోపాటు టీడీపీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు.


అమరావతి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): శాసనసభలో సాగుపై మొదలైన చర్చ... ఎక్కడికో వెళ్లిపోయింది. వ్యక్తిగత దూషణలతోపాటు... విపక్షనేత చంద్రబాబు కుటుంబ సభ్యులనూ అవమానించే స్థాయికి చేరుకుంది. శుక్రవారం అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచే విపక్షంపై అధికారపక్ష నేతల దాడి మొదలైంది. తొలుత నిర్ణయించిన అజెండా ప్రకారం సభలో వ్యవసాయ సంబంధిత అంశాలపై స్వల్పకాలిక చర్చ మొదలైంది. అదికాస్తా... కాసేపటికే చంద్రబాబుపై మాటల దాడిగా మారిపోయింది. చర్చలో భాగంగా అధికారపార్టీ సభ్యులు చంద్రబాబు వ్యవసాయాన్ని పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు. ఆయన కుటుంబం నిర్వహిస్తున్న హెరిటేజ్‌ కంపెనీపైనా ఆరోపణలు చేశారు. దీనిపై టీడీపీ సభ్యులు ప్రతివ్యాఖ్యలు చేస్తూ, నిరసనకు దిగారు. ఈ వివాదం జరుగుతున్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సుదీర్ఘంగా మాట్లాడుతూ చంద్రబాబుపైనా, టీడీపీ సభ్యులపైనా విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. దీంతో... టీడీపీ సభ్యులు ‘గంటా... అరగంటా’ అంటూ అంబటి రాంబాబును ఎద్దేవా చేశారు.


దీంతో రెచ్చిపోయిన అంబటి రాంబాబు... ‘నువ్వు వస్తానంటే గంట కావాలి’ అని అన్నారు. అదే సమయంలో... ‘మాధవ రెడ్డి సంగతేమిటి?’ అని అనుచిత ప్రస్తావన చేశారు. ఆ సమయంలో... ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి, కొడాలి నాని, మధుసూదన్‌ రెడ్డి తదితరులు చంద్రబాబు కుటుంబ సభ్యులను అవమానించేలా పలు వ్యాఖ్యలు చేశారు. ‘లోకేశ్‌ గాడు...’ అంటూ చంద్రబాబు సతీమణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అరిచారు. మైక్‌ ఆఫ్‌లో ఉన్నప్పటికీ... ఆ వ్యాఖ్యలన్నీ చంద్రబాబుకు, టీడీపీ సభ్యులకు వినిపించాయి. ఒక దశలో స్పీకర్‌ ‘చంద్రశేఖర్‌ రెడ్డి... ప్లీజ్‌’ అని వారించారు. అయినా అధికారపక్ష సభ్యులు తగ్గకుండా చంద్రబాబు కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలను కొనసాగించారు. దీనిపై స్పందించేందుకు అవకాశమివ్వాలని చంద్రబాబు కోరినా మైక్‌ దక్కలేదు. దీంతో టీడీపీ సభ్యులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. సభలో నిరసనకు దిగారు. పోడియం ముందుకు వచ్చారు. అధికార పక్షనేతలు కూడా అంతే స్థాయిలో నినాదాలతో రెచ్చిపోయారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకున్నారు. ఒకదశలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్పీకర్‌ కూడా నియంత్రించలేని పరిస్థితి వచ్చింది. దీంతో... స్పీకర్‌ తమ్మినేని సీతారాం సభను వాయిదా వేశారు.


ఆ తర్వాత అదే రచ్చ...

సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితి మారడలేదు.  వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ... టీడీపీపై విమర్శలు గుప్పించారు. దీంతో... ‘ఎన్ని పార్టీలు మారతావ్‌’ అంటూ ప్రజారాజ్యంలో ఉండగా ఆయన జగన్‌పై చేసిన విమర్శలను గుర్తు చేశారు. ‘ఈ విషయంపై కొడాలి నాని అయితే బాగా మాట్లాడతారు’ అంటూ కన్నబాబు కూర్చుండిపోయారు. ఆ తర్వాత మైక్‌ అందుకున్న మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో చంద్రబాబుపై అసభ్యపదజాలంతో దాడికి దిగారు. ‘‘మీ నాయకుడు లుచ్చా పనులు చేస్తుంటే ఎందుకు ప్రశ్నించరు? కన్నబాబు గతంలో ప్రజారాజ్యం పార్టీలో గెలిచినప్పుడు జగన్‌ను విమర్శించారని అంటున్నారు. ఇప్పుడున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీలో మంత్రిగా ఉండి, ఎన్టీఆర్‌పై పోటీచేస్తానని సవాల్‌ చేశారు. మళ్లీ ఈరోజు ఎన్టీఆర్‌ ఫొటోలు, విగ్రహాలకు దండాలు పెడుతున్నారు. మేం వెన్నుపోటుపై చర్చకు సిద్ధంగా ఉన్నాం’’ అన్నారు. 


చంద్రబాబు మనస్తాపం...

అంతకుముందు ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి, కొడాలి నాని తదితరులు చేసిన అనుచిత వ్యాఖ్యలతోనే చంద్రబాబు మనస్తాపానికి గురయ్యారు. ‘‘నేను ఎనిమిదోసారి ఎమ్మెల్యేగా సభలోకి అడుగు పెట్టాను. కానీ... ఎప్పుడూ ఇలాంటి అనుభవాలు చూడలేదు. ఇన్నేళ్లుగా చూడని అవమానాలు భరిస్తున్నాం. నిన్నకూడా ముఖ్యమంత్రి జగన్‌ కుప్పం ఫలితం వచ్చిన తర్వాత... నా ముఖం చూడాలని ఉందన్నారు. ఈ హౌస్‌లో పడరాని అవమానాలు పడ్డాను. నాపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేశారు. పార్టీపరంగా అవమానించారు. కానీ... ఏ పరువు కోసమైతే ఇన్నేళ్లు నేను పనిచేశానో.. ఇన్నేళ్లు బతికానో.. చివరికి నా కుటుంబాన్ని, నా భార్యను కూడా ఈ హౌస్‌లోకి తీసుకువచ్చారు. ఇది సభా సంప్రదాయమా? నన్ను విమర్శించినప్పుడు... ప్రజలకు ఈ సభ ద్వారా సమాధానం చెప్పుకొనే అవకాశం ఇవ్వాలి. అన్ని అంశాలపై చర్చిద్దాం.


బాబాయ్‌ గొడ్డలి వేటు దగ్గర నుంచి తల్లికి, చెల్లికి చేసిన ద్రోహం వరకూ మొత్తం చర్చిద్దాం’’ అని అంటుండగానే చంద్రబాబుకు మైక్‌ కట్‌ చేశారు. దీంతో చంద్రబాబు మరింత ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను స్టేట్‌మెంట్‌ ఇవ్వాలన్నా ఇవ్వకుండా చేశారు. మళ్లీ సీఎం అయిన తర్వాతనేఈ సభలో అడుగు పెడతాను. లేకుం టే నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి కౌరవ సభ.లో ఒక్క క్షణం కూడా ఉండను. మీకు నమస్కారం. నాకు జరిగిన అవమానాన్ని అర్థం చేసుకోవాలని ప్రజలందరినీ కోరుతున్నాను. మీ అందరికీ మరోసారి నమస్కారం’’ అంటూ చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి సభ నుంచి వెళ్లిపోయారు. ‘ఈ రోజు నుంచే మీ పతనం ప్రారంభమవుతుంది’ అంటూ అచ్చెన్నాయుడు అధికార పార్టీపై మండిపడుతూ నిష్క్రమించారు.


ప్రజలకోసమే పని చేశాను

నాకు కొత్తగా రావాల్సిన పదవులు లేవు. కొత్తగా నెలకొల్పాల్సిన రికార్డులు లేవు. ముఖ్యమంత్రిగా నా రికార్డును అందుకోవాలంటే ఎవరికైనా చాలాకాలం పడుతుంది. సమాజంలో ఒక గౌరవం కోసం... పరువు కోసం నలభై ఏళ్లుగా పనిచేస్తున్నాను. ప్రతిరోజూ శ్రమిస్తూనే ఉన్నాను. ప్రజలు నాకు అవకాశం ఇచ్చిన ప్రతిసారీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి... ప్రజలు మరింత మెరుగైన జీవనం గడపటానికి చేయాల్సినంత కృషి చేశాను. ఇలాంటి మాటలు పడటానికేనా ఇంత చాకిరీ చేస్తోందని ఇప్పుడు అనిపిస్తోంది. ఈ దుర్మార్గాలపై ప్రజా క్షేత్రంలోనే తేల్చుకొంటా. ఆ తర్వాతే అసెంబ్లీకి వెళ్తా. ధర్మం వైపో...  అధర్మం వైపో ప్రజలే నిర్ణయించుకోవాలి.

Updated Date - 2021-11-20T07:54:40+05:30 IST