చతుర్భుజ శ్రీరాముడు!

ABN , First Publish Date - 2021-05-07T05:30:00+05:30 IST

శ్రీరాముణ్ణి స్మరించగానే చెరొక చేతిలో ధనుర్బాణాలు ధరించిన స్వామి రూపం కళ్ళముందు కదులుతుంది. ఆయన సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు అవతారమని స్ఫురింపజేసేలా నాలుగు చేతులతో దర్శనమిచ్చే...

చతుర్భుజ శ్రీరాముడు!

శ్రీరాముణ్ణి స్మరించగానే చెరొక చేతిలో ధనుర్బాణాలు ధరించిన స్వామి రూపం కళ్ళముందు కదులుతుంది. ఆయన సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు అవతారమని స్ఫురింపజేసేలా నాలుగు చేతులతో దర్శనమిచ్చే ఆలయాలు అతి తక్కువ. తెలుగునాట భద్రాచలంలో శంఖ, చక్ర, ధనుర్బాణాలతో శ్రీరామచంద్రమూర్తి కనిపిస్తాడు. అలాంటి అరుదైన మరో క్షేత్రం పొన్‌పదార్‌ కుండ్రం గ్రామంలోని చతుర్భుజ కోదండరాముని ఆలయం. ఇది తమిళనాడు రాజధాని చెన్నైకి సుమారు 70 కి.మీ., చెంగల్పట్టుకు సుమారు 15 కి.మీ. దూరంలో ఉంది. 



స్థలపురాణం ప్రకారం, ఈ ప్రాంతంలో దేవరాజు అనే మహర్షి ఉండేవాడు. ఆయన శ్రీరాముణ్ణి మనసులో నిలుపుకొని తపస్సు చేశాడు. మహా విష్ణువు ప్రసన్నుడై, చతుర్భుజాలతో... శ్రీరాముడి రూపంలో ఆయనకు దర్శనమిచ్చాడు. మహర్షి  కోరిక మేరకు నాలుగు చేతులున్న శ్రీరాముడిగా... ఒక చేతిలో శంఖం, మరో చేతిలో చక్రం, ఇరు చేతుల్లో ధనుర్బాణాలతో వెలిశాడు. చతుర్భుజ రామర్‌ (రాముడు)గా ఖ్యాతి పొందాడు. ఎంతో పురాతనమైనదిగా స్థానికులు భావించే ఈ ఆలయంలో శ్రీరాముడితో పాటు సీత, లక్ష్మణుడు, హనుమంతుడు కొలువుతీరారు. రాముడి విగ్రహానికి గోళ్ళు పదునుగా ఉండడం, చేతిలో రేఖలు, మోకాళ్ళ భాగాలూ, కాలిపై నరాలూ ప్రస్ఫుటంగా కనిపించడం, చేతుల్లో వేళ్ళు విడివిడిగా ఉండడం, స్వామి వేలికి ఉంగరం... ఇలా ఎన్నో ప్రత్యేకతలను ఈ ఆలయంలో చూడవచ్చు. అదే విధంగా విష్ణురూపంలో శ్రీరాముడు ఉన్న క్షేత్రం కాబట్టి స్వామి వక్షస్థలం మీద లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఈ ఆలయంలోని హనుమంతుణ్ణి ‘భవ్యాంజనేయర్‌’ అంటారు. ఆయన వినయంగా, అరచేతిని నోటి దగ్గర పెట్టుకొని దర్శనమిస్తాడు. గర్భాలయంలోని విగ్రహాలతో పాటు ఉత్సవ విగ్రహాలు కూడా ఎంతో మనోహరంగా ఉంటాయి. శ్రీరాముని ఉత్సవమూర్తి కుడి కాలు కన్నా ఎడమ కాలు కొంచెం ముందుకు ఉంటుంది. ఎడమకాలు మీద బాణం ఉంచి... యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు కనిపిస్తుంది. దేవరాజ మహర్షి పేరిట ఈ ఆలయంలోని కొలనును దేవరాజ పుష్కరణి అని పిలుస్తారు. ఈ చతుర్భుజ రాముడిని దర్శించి, దేవరాజ పుష్కరణిలో స్నానం చేసిన వారు రోగ విముక్తులవుతారనీ, ఆరోగ్యం చేకూరుతుందనీ భక్తుల విశ్వాసం.





Updated Date - 2021-05-07T05:30:00+05:30 IST