దళితుని భూమిలో దౌర్జన్యం

ABN , First Publish Date - 2020-07-10T08:20:25+05:30 IST

పేదల ఇళ్ల స్థలాల కోసం తన భూమిని అధికారులు సేకరించడానికి ప్రయత్నించగా... నెల్లూరు జిల్లాలో ఓ దళిత రైతు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం

దళితుని భూమిలో దౌర్జన్యం

  • మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం
  • ‘ఇళ్లస్థలాల’సేకరణపై హైకోర్టుకు
  • కోర్టు సూచనతో తన స్థలంలో కంచె
  • అడ్డుకొని కొట్టిన రెవెన్యూ సిబ్బంది!
  • కంచె పీకేసి బలవంతపు స్వాధీనం

నెల్లూరు, జూలై 9(ఆంధ్రజ్యోతి): పేదల ఇళ్ల స్థలాల కోసం తన భూమిని అధికారులు సేకరించడానికి ప్రయత్నించగా... నెల్లూరు జిల్లాలో ఓ దళిత రైతు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వివరాల్లోకి వెళితే..శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం వెంకన్నపాళెం గ్రామం సర్వే నం.131లో 5.88 ఎకరాల భూమిని కొన్నేళ్లక్రితం అదే గ్రామ దళితులకు పట్టాలు చేసి ఇచ్చారు. ఆ భూములను వారు దేవుడి మాన్యంగా భావించి.. ఏటా లీజుకు ఇస్తున్నారు. ఆ వచ్చే డబ్బులతో దేవుడికి తిరునాళ్ల నిర్వహిస్తున్నారు. అయితే, ఇళ్ల స్థలాల పథకం కోసం రెవెన్యూ అధికారులు ఇటీవల ఈ భూమిని ఎంపిక చేశారు. మార్చిలో లే అవుట్లు వేయడానికి ప్రయత్నించగా, దళితులు తిరగబడ్డారు. ఆ భూమిలో ఉన్న పైరును తొలగించడానికి పోలీసుల సాయంతో శతథా ప్రయత్నించారు. దళితులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని కలెక్టర్‌కు మొరపెట్టుకోవడంతో తాత్కాలికంగా ఆ ప్రయత్నాలు ఆగిపోయాయి.


అప్పటికి వెనక్కితగ్గిన అధికారులు.. పంటల కోతల తరువాత ఇటీవల మరోసారి భూమి స్వాధీనానికి ప్రయత్నించారు. ఈసారి దళితులు ప్రాధేయపడినా అధికారులు లెక్కచేయలేదు. ఈ క్రమంలో దళితవాడకు చెందిన వాదనాల వెంకటయ్య అనే వ్యక్తి హై కోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు తనకు చెందిన 20 సెంట్ల భూమి చుట్టూ కంచె వేసుకోవడానికి ప్రయత్నించగా, పోలీసుల సాయంతో రెవెన్యూ అధికారులు అడ్డుకొన్నారు. ఆయన వేసిన కంచె తొలగించడంతోపాటు వెంకటయ్యతో అవమానకరంగా ప్రవర్తించినట్లు సమాచారం. దీంతో కలత చెందిన వెంకటయ్య పొలంలోనే పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ గూడూరు ఆస్పత్రిలో బాధితుడిని పరామర్శించారు.



కోర్టుకు వెళ్లారన్న కక్షతోనే దాడి : బాబు

జగన్‌ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందనడానికి నెల్లూరు జిల్లాలో దళిత రైతులపై అధికారుల దౌర్జన్యమే నిదర్శనమని టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్‌ వేదికగా ధ్వజమెత్తారు. ‘‘ప్రభుత్వ దురుసు చర్యలను ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించాలి. తన హక్కుకోసం కోర్టుకు వెళ్లిన దళిత రైతు వెంకటయ్యపై పోలీసులు దాడి చేశారు. ఆ అవమానంతో ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించారు. దీన్నిబట్టి..న్యాయం కోసం కోర్టుకు వెళ్లిన ప్రజలపై అధికారులు కక్షకట్టి మరీ దాడులు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమే కాకుండా మానవ హక్కులను సైతం అధికారులు హరిస్తున్నారు. వెంకటయ్యపై దౌర్జన్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి’’ అని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-07-10T08:20:25+05:30 IST