ఎగబడుతున్నారు..!

ABN , First Publish Date - 2020-07-13T11:05:21+05:30 IST

తెలుగు రాష్ట్రాల సరిహద్దులోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో మద్యం బెల్టు వ్యాపారం జోరుగా సాగుతోంది.

ఎగబడుతున్నారు..!

తెలంగాణ మద్యంపై ఆంధ్రాబాబుల మోజు

తెలుగురాష్ట్రాల సరిహద్దులో ‘బెల్టు’ జోరు

ఎర్రుపాలెం మండలంలో యథేచ్ఛగా వ్యాపారం

ఒక్క కొత్తపాలెంలోనే 15 దుకాణాలు


ఎర్రుపాలెం, జూలై 12: తెలుగు రాష్ట్రాల సరిహద్దులోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో   మద్యం బెల్టు వ్యాపారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా కొత్తపాలెం గ్రామంలోని బెల్టుషాపులకు ఏపీ నుంచి మద్యం ప్రియులు వస్తుండటంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఆ గ్రామంలో 15బెల్టుషాపులు ఉండగా.. ఏపీలో మద్యం రేట్లు అధికంగా ఉండటం, అక్కడ సరైన బ్రాండ్లు దొరకకపోవడంతో మందుబాబులు సరిహద్దువైపు ఎగబడుతున్నారు. కొత్తపాలేనికి పొరుగున ఉన్న కృష్ణాజిల్లాలోని జి.కొండూరు మండలంలోని పలు గ్రామాల నుంచి మద్యం ప్రియులు ఇక్కడికి వచ్చి అధిక రేట్లు వెచ్చించి మరీమద్యం కొనుగోలు చేస్తున్నారు.  అయితే కృష్ణాజిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండగా, అక్కడి నుంచి మద్యం ప్రియులు రాకపోకలు సాగిస్తుండటంతో కొత్తపాలెం వాసులు ఆందోళన చెందుతున్నారు.


అయితే ఏపీలో అక్కడి ప్రభుత్వం బెల్టు షాపులను ఎత్తేయడంతో గతంలో ఐదారు బెల్టుషాపులు ఉన్న సరిహద్దున ఉన్న ఎర్రుపాలెం మండలంలోని కొత్తపాలెంలో ఇప్పుడు ఏకంగా 15బెల్టుషాపులు వెలిశాయి. ఇప్పటికైనా ఎక్సైజ్‌శాఖ అధికారులు స్పందించి తమ గ్రామంలోని బెల్టుషాపులను ఎత్తివేయాలని ప్రజలు కోరుతున్నారు. కృష్ణా జిల్లా నుంచి మందుబాబుల రాకపోకలను నియంత్రించాలని డిమాండ్‌ చేస్తున్నారు.


బెల్టుషాపులను ఎత్తివేయాలి.. ఆర్‌.నాగేశ్వరరావు, కొత్తపాలెం

మా గ్రామంలో గతంలో ఐదు బెల్టుషాపులుండేవి. ఆంధ్రా ప్రభావం పుణ్యమా అని ప్రస్తుతం 15షాపుల వరకు నడుస్తున్నాయు. అక్కడ రేటు ఎక్కువ కావడం, బ్రాండ్లు దొరకక పోవడంతో ఆ జిల్లా నుంచి మద్యం ప్రియులు మా గ్రామానికి వచ్చి కొనుగోలు చేసి తీసుకువెళ్తున్నారు. కొంతమంది ఇక్కడే తాగి వెళుతున్నారు. అసలే కృష్ణాజిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా వస్తుండటంతో మాకు భయంగా ఉంది. ఇక మహిళల ఇబ్బందులైతే చెప్పలేని పరిస్థితి. అధికారులు స్పందించి బెల్టుషాపులు ఎత్తివేయాలి.


ఆంధ్రా నుంచి వచ్చేవారిని నియంత్రించాలి ..వీరయ్య, కొత్తపాలెం

ఆంధ్రాలో బెల్టుషాపులు ఎత్తివేయటంతో మద్యం ప్రియులు మా గ్రామానికి వస్తున్నారు. ఇప్పటికే కరోనాతో భయపడుతున్నాం. ఇక కృష్ణాజిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా వస్తున్నాయని వింటున్నాం. ఈ సమయంలో ఆ జిల్లా నుంచి మా గ్రామానికి జనం వచ్చిపోతుండటంతో భయంగా ఉంది. అటు నుంచి మా గ్రామానికి వచ్చే వారిని నియంత్రించాలి. 

Updated Date - 2020-07-13T11:05:21+05:30 IST