Abn logo
Apr 28 2021 @ 00:17AM

కరిగిపోతున్న మోదీ విశ్వరూపం

పదహారవ లోక్ సభ ఎన్నికల (2014) ప్రచారానికి ముందు ఒక రోజు ఢిల్లీ మెట్రోలో ఆఫీసుకు వెళుతుంటే కొందరు యువతీ యువకుల మధ్య జాతీయ రాజకీయాల్లో నరేంద్రమోదీ ఆవిర్భావం గురించి చర్చ జరుగుతుంటే ఆసక్తిగా విన్నాను. మోదీ అధికారంలోకి వస్తే దేశంలో అవినీతి అంతం అవుతుందని, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వారిలో కొందరు అభిప్రాయపడ్డారు. మరి గుజరాత్ లో జరిగిన అల్లర్లు, ఊచకోత గురించి ఒకరు ప్రస్తావించినప్పుడు సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఒక యువతి ఆవేశంతో ఊగిపోయింది. ‘మరెవరికి ఓటు వేయమంటారు దేశాన్ని అడ్డంగా దోచుకుంటున్న కాంగ్రెస్ ఓటు వేయమంటారా?’ అని ప్రశ్నించింది. చుట్టూ ఉన్న వారిలో మెజారిటీ ఆమెకు మద్దతు పలికారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్లుగా అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ తనపై జనం అభిమానాన్ని నిలుపుకునేందుకు విశ్వయత్నాలు చేస్తూనే వస్తున్నారని చెప్పక తప్పదు. పెద్ద నోట్ల రద్దు తో పాటు కొన్ని నిర్ణయాలు ప్రజలను ఎన్ని కష్టాల పాలు చేసినా ఆయన ప్రజా వ్యతిరేకత తనను అంటకుండా చూసుకోగలిగారు. గత ఏడాది కరోనా మహమ్మారి ప్రవేశించినప్పుడు ఆయన ఇచ్చిన పిలుపులను జనం సీరియస్ గా తీసుకున్నారు. రకరకాల తాళ ధ్వనులను చేశారు. దీపాలు వెలిగించారు. ఆఖరుకు ఒక కమ్యూనిస్టు నాయకుడు కూడా దీపాలు వెలిగించారు.


2014కు ముందు మోదీ పట్ల ప్రజలు విశ్వాసం చూపడానికి, 2020లో మోదీ పిలుపును జనం పాటించడానికీ వాతావరణంలో తేడా లేదని చెప్పలేం. 2014లో కాంగ్రెస్ పదేళ్ల పాలన పట్ల ప్రజలు విసిగిపోయి అభివృద్ధి, సుపరిపాలన గురించి మోదీ చేసిన వాగ్దానాలను విశ్వసించారు. 2020లో ప్రజల మనసుల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నప్పటికీ ప్రతిపక్షాల్లో తాము అనుసరించదగిన, విశ్వసనీయత గల నేతలు లేకపోవడం,మోదీని మించిన నాయకుడు కనపడకపోవడం వల్ల వారు ఆయననే నమ్ముకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.


కాని కాలం ఎంత విచిత్రమైనది? సరిగ్గా ఒక్క ఏడాదిలోనే దేశ ప్రజల మనోభావాల్లో కరోనా, మోదీ విధానాలు అనేక మార్పులు తెచ్చినట్లు కనపడుతోంది. ప్రతిపక్షాల సమర్థత,ఒక బలమైన ప్రత్యామ్నాయ నాయకుడు ఆవిర్భవించకపోవడం పై సందేహాలు అదే విధంగా ఉన్పప్పటికీ మోదీ పట్ల వ్యతిరేకత ప్రతిపక్షాలపై అపనమ్మకాన్ని మించిపోయినట్లు కనపడుతోంది. ఇవాళ గూగుల్ లో నరేంద్రమోదీ అని టైప్ చేస్తే చాలు ఆయన పట్ల విమర్శలు, వ్యతిరేక వ్యాఖ్యలు ఎక్కువ కనపడుతున్నాయి. ఆయన ఏమి మాట్లాడినా, ఏ హావభావాలు ప్రదర్శించినా జనం విమర్శిస్తున్నారు. ఆయన ప్రసంగాలకు కొద్ది నెలల క్రితం వరకు ఉర్రూతలూగిన వారు ‘ఇప్పుడు మీరు ఊకదంపుడు ఉపన్యాసాలు చేయడం మినహా ఇంకేం చేయగలరు? మీ వాగాడంబరాన్ని కట్టి పెట్టండి..’ అని వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన అనేక దేశాల్లో పర్యటించినప్పుడు ఎన్నో సానుకూల వ్యాఖ్యలు చేసిన విదేశీ మీడియా ఇప్పుడు ఆయనను ఒక అసమర్థుడుగా చిత్రిస్తున్నది. సినీతారలు,సాధువుల ద్వారా సానుకూల ప్రచారం కల్పించుకునే పరిస్థితులు ఇప్పుడు కనపడడం లేదు. ‘ఒకవైపు వైద్య సిబ్బంది ప్రజలకు నిరంతరం సేవ చేస్తున్నా , దేశంలో కరోనా విపరీతంగా వ్యాపించేందుకు మోదీయే కారణమయ్యారు’ అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డా. నవజోత్ దహియా తాజాగా వ్యాఖ్యానించారు. ఒకప్పుడు మోదీని ఆకాశానికి ఎత్తేందుకు, ఆయనను మించిన దేశ భక్తుడు మరెవరు లేరని చిత్రించేందుకు సోషల్ మీడియా ఉధృతంగా ఉపయోగపడింది. ఇప్పుడు అదే సోషల్ మీడియా లో వ్యతిరేక ప్రచారం జరగకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి వస్తోంది. ఇంకా ఆశ్చర్యం కలిగిస్తున్న పరిణామం ఏమిటంటే నిన్నటివరకూ మోదీని సమర్థించిన అభిమాన గణం కూడా ఇప్పుడు ఆయనపై విమర్శలకు జవాబిచ్చేందుకు, ఆయనను భుజానికి ఎత్తుకునేందుకు ముందుకు రావడం లేదు. వారిలో కూడా అనుమానాలు మొదలైన దాఖలాలు కనపడుతున్నాయి. గత ఏడాదిగా మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, దేశంలో జరుగుతున్న పరిణామాలు ఇందుకు కారణమయ్యాయా? ఆయన ఆత్మనిర్భర్ దేశానికి దుర్భరంగా మారిందా? కరోనా విజృంభణ, శ్మశానాల్లో శవాలకు కూడా స్థానం లభించకపోవడం, ఆత్మీయులు, సన్నిహితులు, సహచరులు, హితులు ఒక్కొక్కరూ నేలరాలిపోతుండడం వ్యవస్థలపై, ప్రభుత్వంపై నమ్మకం చెరిగిపోవడానికి కారణమవుతోందా?


చరిత్రపుటల్లో కి వెళితే గతంలో రాజీవ్ గాంధీ అధికారంలోకి వచ్చిన పరిస్థితులకూ, మోదీ అధికారంలోకి వచ్చిన పరిస్థితులకూ తేడా ఉన్నది కాని తొలిరోజుల్లో రాజీవ్ కలిగించిన ఆశలే మోదీ కూడా కలిగించారని చెప్పక తప్పదు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ‘మిస్టర్ క్లీన్’ గా గుర్తింపు పొందారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న పార్టీ ఫిరాయింపులకు ఆయన అడ్డుకట్ట వేసేందుకు చట్టం చేశారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆయన ప్రవేశపెట్టిన ఫిరాయింపు నిరోధక బిల్లును ఏ ఒక్కరూ వ్యతిరేకించలేదు. ‘ఆయారాం గయారాం’ సంస్కృతిని అరికట్టి నైతిక విలువలు లేని రాజకీయాలకు అడ్డుకట్ట వేస్తానని రాజీవ్ గాంధీ చేసిన ప్రకటనతో ఆయన ప్రతిష్ఠ తార స్థాయికి చేరుకుంది. 1985లో ఒడిషాలో కరువు పీడిత కలహంది జిల్లాకు వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు చూసి ప్రభుత్వం ఖర్చుపెట్టే ఒక్క రూపాయిలో కేవలం 15 పైసలే జనానికి చేరుతున్నాయని ప్రకటించి సంచలనం సృష్టించారు. దేశమంతా కమ్యూనికేషన్ అనుసంధానాన్ని పెంచి మధ్యతరగతి ప్రశంసలు అందుకున్నారు. 1985లో అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ రాజీవ్ కు ఘన స్వాగతం తెలిపిన తీరు ఆయన ప్రతిష్ఠను పెంచింది. అకాలీనేత సంత్ లాంగోవాల్ తో ఒప్పందం, అస్సాంలో అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా ఉద్యమించిన నేతలతో సంధి కుదుర్చుకుని చరిత్రపుటల్లో కెక్కారు. 1985లో భారత జాతీయ కాంగ్రెస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా రాజీవ్ గాంధీ ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీని దళారులు, పైరవీకారులు చెదల్లా పట్టారని, రాజకీయ పార్టీలకు, స్వార్థపరులకూ మధ్య కుమ్మక్కును భగ్నం చేస్తానని అన్నప్పుడు హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. కాని ప్రశ్నార్థకమైన అనేక నిర్ణయాల మూలంగా, మాటలకు తగ్గట్లు గా చేతలు లేకపోవడం, మధ్యదళారీలకు, కుంభకోణాలకు ఆస్కారం ఇవ్వడం, వ్యవస్థలను నీరుగార్చడంతో రాజీవ్ గాంధీ పాలన ప్రజలకు నిరాశనే మిగిల్చింది.


నరేంద్రమోదీ పాలన అంతకంటే ఎక్కువ నిరాశనే మిగిల్చినట్లు స్పష్టమవుతోంది. అవినీతి నిర్మూలనపై ఆయన రాజీవ్ కంటే ఎక్కువ ఆశలు రగిల్చారు. పలు విదేశీయానాలు చేసి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కౌగలించుకుని దేశానికి ఏదో మేలు జరుగబోతున్నట్లుగా సీన్ సృష్టించారు. కాని మోదీ ఏడేళ్ల పాలనను సమీక్షిస్తే గతంలో కంటే పరిస్థితులు మరింత దిగజారాయా అన్న అనుమానాలకు ఆస్కారం కలుగుతుంది. రాజీవ్ గాంధీ చేసిన ఫిరాయింపుల చట్టాన్ని నీరుకార్చేందుకు నరేంద్రమోదీ సారథ్యంలో బిజెపి మరో మార్గాన్ని ఎన్నుకుని ఏకంగా ప్రజాప్రతినిధులకు ప్రలోభాలను చూపి ప్రభుత్వాలను పడగొట్టడం, పార్టీలను బలహీనపరచడం చేసింది. వ్యవస్థలు మరింత బలహీనంగా మారాయి. రాజీవ్ గాంధీ విమర్శించిన మధ్య దళారీలు ఇప్పుడూ వ్యవస్థల్లో కొనసాగుతున్నారు. అనేక కాంట్రాక్టులు, రేవులు, విమానాశ్రయాలు వారికే దక్కుతున్నాయి. ఎన్నికల బాండ్లు కొనుగోలు చేస్తున్న అస్మదీయుల గురించి ఎవరికీ తెలియదు. రూపాయిలో 15 పైసలు కూడా పేద ప్రజలకు దక్కడం లేదని నాడు రాజీవ్ గాంధీ వాపోయారు కాని ఇవాళ రూపాయిలో 85 పైసలు కార్పోరేట్లకు, బడా వ్యాపారులకు దక్కేందుకు ప్రభుత్వ విధానాలు తోడ్పడుతున్నాయని విమర్శలు రేకెత్తుతున్నాయి. 


రాజకీయాల్లో ఒక వ్యక్తి తనను తాను మేరునగధీరుడుగా చిత్రించుకుని, తనను మించిన దేశ భక్తుడు లేదని ప్రచారం చేసుకుని, వ్యవస్థలకు అతీతంగా తనను తాను మార్చుకుని, మంత్రివర్గ సభ్యులను, ఇతర నేతలను అంగుష్ఠమాత్రులుగా మార్చి, టక్కుటమార గజకర్ణ, గోకర్ణ విద్యలతో, సకల రూపాలను తానే ప్రదర్శించినప్పుడు ప్రజలకు కూడా ఆయనపై ఆమేరకు నమ్మకాలు, ఆశలు పెరిగిపోతాయి. మోదీ అలాంటి అభిప్రాయాలను, ఆకాంక్షలను ఎగద్రోసినందువల్లే జనం గంటలు కొట్టడానికీ, పళ్లాలను మోగించడానికి సిద్ధ పడ్డారు. కాని ఇప్పుడు అదే జనం కళ్లలో నిండుతున్న నీళ్ల మధ్య మోదీ అనే విశ్వరూపం కరిగిపోతున్న దృశ్యం కనపడుతోంది. ప్రజాస్వామ్యంలో వ్యక్తి కేంద్రీకృత అధికారం మోతాదుకు మించిపోతే ఎటువంటి దుష్పరిణామాలు జరుగుతాయో ఇప్పుడు స్పష్టమవుతోంది. రాజీవ్ గాంధీ విఫలమైనప్పుడు ప్రతిపక్షాలకు కనీసం 125 సీట్లు లేకపోయినా పరిస్థితులు ప్రత్యామ్నాయానికి వీలు కల్పించాయి. ఇప్పుడవే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఎ. కృష్ణారావు

ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి