Abn logo
Apr 7 2020 @ 03:07AM

కరోనా పోరులో ఉద్యోగ పర్వం

కరోనా కట్టడిలో ప్రభుత్వోద్యోగులను సంపూర్ణంగా నిమగ్నం చేయాలి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో మొత్తం రెండు కోట్ల మంది ఉద్యోగులు వున్నారు. వీరిలో ఒక కోటి మందిని కరోనా వైరస్ నిరోధక విధుల్లో నియమించాలి. మన దేశంలో మొత్తం  30 కోట్ల కుటుంబాలు వున్నాయి. అంటే ఒక్కో ప్రభుత్వోద్యోగి సగటున 30 కుటుంబాలను కరోనా బారినుంచి కాపాడే బాధ్యతలను నిర్వహించవలసివుంటుంది. ఇందుకు వారు ప్రతిరోజూ  ఆ 30 కుటుంబాల వారిని సందర్శించాలి. ఇది వారికేమీ కష్టం కాబోదు. 


చైనాలో కరోనా కల్లోలం ఎలా నెమ్మదించింది? ఆ దేశంలో గత కొద్ది రోజులుగా సబ్‌వే రైళ్ళలో ప్రయాణిస్తున్నవారి సంఖ్య 21 శాతం పెరుగగా, దేశీయ విమాన సర్వీసులలో రాకపోకలు సాగిస్తున్న వారి సంఖ్య 3 శాతం పెరిగింది. ఆటోమోబైల్ ఫ్యాక్టరీలలో ఉత్పత్తి కార్యకలాపాలు మళ్ళీ ప్రారంభమయ్యాయి. దేశ దేశాలకు అవసరమైన వైద్య పరికరాలను చైనాయే పెద్ద ఎత్తున సరఫరా చేస్తోంది. మరి ముంచుకొస్తోన్న ప్రపంచ ఆర్థిక మాంద్యం నుంచి చైనా తప్పించుకోగలుగుతుందని యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవెలప్‌మెంట్ (అంక్టాడ్) పేర్కొనడంలో ఆశ్చర్యమేముంది? భారత్ కూడా, చైనా వలే మాంద్యం బారిన పడబోదని ఆ సంస్థ గట్టిగా అభిప్రాయపడింది. అంక్టాడ్ అంచనాకు ప్రాతిపదికలేమిటి? చైనా, భారత్‌లకు ప్రత్యేక ప్రాధాన్యమెందుకిచ్చింది? దురదృష్టవశాత్తు ఆ సంస్థ ఎటువంటి కారణాలను వెల్లడించలేదు. చైనా మాంద్యం ముప్పును తప్పించుకోగలగడానికి కారణాలలో ఒకటి కరోనా సంక్షోభం నుంచి శీఘ్రగతిన కోలుకొంటుండడమేనని కూడా అంక్టాడ్ పేర్కొంది. అయినప్పుడు అందుకు దోహదం చేసిన చర్యలేమిటి? 


కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు చైనా చేపట్టిన చర్యలలో మొదటిది వ్యాధి నిర్ధారణ పరీక్షలను నిర్వహించేందుకు అవసరమైన కిట్‌లను సమకూర్చడం. కేవలం మూడు వారాల వ్యవధిలో వాటిని తగు సంఖ్యలో అందుబాటులో ఉంచగలిగింది. దీనివల్ల వైరస్ సోకిన వ్యక్తులను గుర్తించడం, వారికి ఎవరి నుంచి వ్యాపించిందో తెలుసుకోవడం సుసాధ్యమయింది. రెండో చర్య- మాస్క్‌లు, శానిటైజర్లు మొదలైన వ్యాధి రక్షణ సామగ్రిని భారీ స్థాయిలో లభించేలా చూడడం. మూడో చర్య- వైరస్ ప్రబలని రాష్ట్రాలలో లాక్‌డౌన్ అమలుపరచడం. దీనివల్ల ఉహాన్ నుంచి కరోనా వ్యాప్తిని నిరోధించడం సాధ్యమయింది. నాలుగో చర్య- నిర్దిష్ట వ్యాపార సంస్థల పునః ప్రారంభానికి అనుమతించడం. అయితే ఈ సంస్థలలో పనిచేసే ఉద్యోగి లేదా కార్మికునికి ఒక క్యుఆర్ కోడ్ ఇచ్చారు. దీని ప్రకారం ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ తన ఆరోగ్య పరిస్థితులను నివేదించవలసివుంటుంది. లాక్‌డౌన్ కాలంలో స్వేచ్ఛాయుత కదలికలకు అనుమతి లభించిన వారు ఎక్కడెక్కడకు వెళ్ళింది తెలుసుకోవడాన్ని ఇది సాధ్యం చేసింది. ఈ చర్యల వల్ల కరోనా విస్తరించే అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. వాటిని కచ్చితంగా పాటించిన పారిశ్రామిక సంస్థలు తమ ఉత్పత్తి కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించేందుకు అనుమతించారు. మరో ముఖ్యమైన చర్య- ప్రభుత్వం కరోనాకు సంబంధించిన సమాచారాన్ని నిరంతరం ప్రజలకు తెలియజేయడం. దీనివల్ల ప్రజలు పూర్తిగా సహకరించసాగారు.  కరోనా వ్యాధి గురించిన పుకార్ల వ్యాప్తిని కూడా చైనా ప్రభుత్వం కట్టుదిట్టంగా అదుపు చేసింది.


మన దేశంలోనూ ఇటువంటి చర్యలను అమలుపరచాలి. కరోనా టెస్టింగ్ కిట్స్, వ్యాధి రక్షణ సామగ్రిని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి ఆరోగ్య భద్రతా కార్యకర్తలకు అందుబాటులో ఉంచాలి. అవసరమైన ఇతర దేశాలకు సైతం వాటిని ఎగుమతి చేయాలి. రెండో చర్య ప్రతి రాష్ట్రం చుట్టూ కత్రిమ సరిహద్దులను సృష్టించడం. ఏప్రిల్ 15 (21 రోజుల లాక్‌డౌన్ ముగిసిన మరుసటి రోజు)న ప్రభుత్వం ఒక సందిగ్ధ పరిస్థితి నెదుర్కోవలసిరావడం ఖాయం. ఎందుకని? లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తే వైరస్ మరింతగా వ్యాప్తి చెందే అవకాశమున్నది. లాక్‌డౌన్‌ను కొనసాగిస్తే అసం ఖ్యాక ప్రజలు ఆకలిదప్పులతో మలమలమాడిపోతారు. మార్గాం తరమేమిటి? ప్రతి రాష్ట్రంలోనూ కరోనా వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో ఖచ్చితంగా అంచనా వేయాలి. వైరస్ బాధితుల గుర్తింపు మెరుగ్గా ఉండి, అంటువ్యాధి సంక్రమించిన వారి సంఖ్య తక్కువగా ఉన్న రాష్ట్రాలలో లాక్‌డౌన్‌ ఎత్తివేతకు అనుమతివ్వడం. మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలలో లాక్‌డౌన్‌ను తప్పక కొనసాగించాలి ప్రజలు వీధుల్లో విచ్చలవిడిగా తిరగడాన్ని అరికట్టడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమయింది. అటువంటి రాష్ట్రాలలో ప్రవేశాన్ని లేదా వాటి నుంచి నిష్క్రమణను కఠినమైన పరీక్షల అనంతరం మాత్రమే అనుమతించి తీరాలి. ఇలా చేయడం వల్ల కొన్ని రాష్ట్రాలలోనైనా ఆర్థిక కార్యకలాపాలు పూర్వపు స్థాయికి పుంజుకోవడం సాధ్యమవుతుంది. 


కరోనా కట్టడిలో ప్రభుత్వోద్యోగులను సంపూర్ణంగా నిమగ్నం చేయాలి. అత్యవసర సేవలకు సంబంధించని విద్య, ప్రజాపనులు,  న్యాయ వ్యవస్థ ఇత్యాది శాఖల ఉద్యోగులందరూ వెన్వెంటనే తమకు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధి నిర్వహణకు రిపోర్ట్ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించి తీరాలి. ఈ ప్రభుత్వోద్యోగులు ఒక్కొక్కరికీ పట్టణాలు, గ్రామాలలోని నిర్దిష్ట వీధులలోని ప్రజల ఆరోగ్య రక్షణ బాధ్యతలను అప్పగించాలి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో మొత్తం రెండు కోట్ల మంది ఉద్యోగులు వున్నారు. వీరిలో ఒక కోటి మందిని కరోనా వైరస్ నిరోధక విధుల్లో నియమించాలి. మన దేశంలో మొత్తం 30 కోట్ల కుటుంబాలు వున్నాయి. అంటే ఒక్కో ప్రభుత్వోద్యోగి సగటున 30 కుటుంబాలను కరోనా బారినుంచి కాపాడే బాధ్యతలను నిర్వహించవలసివుంటుంది. ఇందుకు వారు ప్రతిరోజూ ఆ 30 కుటుంబాల వారిని సందర్శించవలసి వుంటుంది. ఇది వారికేమీ కష్టం కాబోదు. 


కేంద్ర ప్రభుత్వం ప్రతి సాయంత్రమూ దేశంలో కరోనా సంక్షోభ తాజా పరిస్థితి గురించి ప్రజలకు సమాచారమివ్వాలి. రాష్ట్రాల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విధిని నిత్యం నిర్వర్తించాలి. కాయకష్టం మీద బతికే నిరుపేదలు, ఇతర దుర్భల వర్గాల వారికి ప్రభుత్వం ప్రతి రోజూ ఆహారం సమకూర్చాలి. నిధులు చాలినంతగా లేనిపక్షంలో ప్రభుత్వోద్యోగుల వేతనాలు, పెన్షన్లలో 50 శాతం కోత విధించైనా సరై ఈ విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలి. సామాన్య ప్రజలు ఆకలి దప్పులతో నకనకలాడుతుండగా ప్రభుత్వోద్యోగులు పూర్తిస్థాయి వేతన భత్యాలతో ఇంటి వద్దనే సంతోషంగా గడపడం సబబు కాదు కదా. కనుక కరోనా కాలంలో ఆర్థిక మాంద్యం నెలకొనకుండా ఉండాలంటే పైన ప్రస్తావించిన చర్యలన్నిటినీ చేపట్టేందుకు ప్రభుత్వం తక్షణమే పూనుకోవాలి.

భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేమరిన్ని...