కూలిపోయిన ‘శిఖరాగ్రాలు’

ABN , First Publish Date - 2020-07-11T05:44:02+05:30 IST

ఆర్థిక వ్యవస్థ పరిస్థితి అంతకంతకూ దిగజారిపోతున్న దృష్ట్యా భారత్ బలహీనపడిందనేది చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అంచనా. ఆయన ఉద్దేశాలను అర్థం చేసుకోవడంలో నరేంద్ర మోదీ పూర్తిగా విఫలమయ్యారు.

కూలిపోయిన ‘శిఖరాగ్రాలు’

ఆర్థిక వ్యవస్థ పరిస్థితి అంతకంతకూ దిగజారిపోతున్న దృష్ట్యా భారత్ బలహీనపడిందనేది చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అంచనా. ఆయన ఉద్దేశాలను అర్థం చేసుకోవడంలో నరేంద్ర మోదీ పూర్తిగా విఫలమయ్యారు. 2018 ఊహాన్, 2019 మహాబలిపురం శిఖరాగ్ర సమావేశాలలో భారత్, చైనా అధినేతల సంయుక్త సంకల్పాలు ఆచరణకు రాకముందే సమసిపోయాయి.


మనహిమాలయాల పొలిమేరలో చైనా దురాక్రమణలకు ఆరు దశాబ్దాల చరిత్ర ఉన్నది. 1959 ఆగస్టులో చైనా సైనిక దళాలు (భారత్-చైనా సరిహద్దు తూర్పు రంగంలోన) లాంగ్జు వద్ద మన సైనిక శిబిరంపై దాడి చేశాయి. ప్రమాద ఘంటికలు స్పష్టంగా మోగాయి. 1962 సెప్టెంబర్ 8న చైనీస్ సైనికులు భారత భూభాగాల్లోకి చొచ్చుకు వచ్చారు; అక్టోబర్ 20న చైనా దురాక్రమణకు పాల్పడింది. అక్టోబర్ 24న పూర్తిగా స్వప్రయోజనకరమైన మూడంశాల ప్రతిపాదన ఒకటి చేసింది. భారత్ తిరస్కరించింది. 1962 నవంబర్ 14న చైనా సైన్యం పెద్ద ఎత్తున దురాక్రమణకు ఉపక్రమించింది. భారత్ భూభాగంలో 100 మైళ్ళ లోపలకు దూసుకువచ్చింది. నవంబర్ 21న చైనా ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించి , తన సైనిక దళాలను ఉపసంహరించుకున్నది. ‘తూర్పు రంగంలో తమ ప్రస్తుత స్థానాల నుంచి వాస్తవ నియంత్రణ రేఖ ఉత్తర ప్రాంతానికి, అంటే న్యాయవిరుద్ధ మెక్ మహాన్ రేఖ ఉత్తరం వైపుగా, ఆ రేఖ నుంచి 20 కిలో మీటర్ల వెనుకప్రాంతానికి ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని’ చైనా పేర్కొంది. 1962లో చైనా ఏకపక్షంగా ఏ స్థానాలకు ఉపసంహరించకున్నదో, అప్పటి నుంచి ఆ స్థానాలలోనే ఉండిపోయింది. అలా 1962 శీతాకాలంలో తూర్పురంగంలో చొరబడిన ప్రదేశాలను చాలావరకు ఖాళీ చేసింది. 


1962 యుద్ధంలో భారత్ ఓడిపోయింది. అయితే సరిహద్దుల విషయంలో చైనాతో రాజీపడేందుకు దృఢ వైఖరితో తిరస్కరిస్తోంది. ఒక నియంత్రణ రేఖను చైనా ప్రతిపాదిస్తున్నది. అయితే ఆ రేఖ పై రెండు దేశాల దృక్కోణాలు భిన్నంగా ఉన్నాయి. ఆ నియంత్రణరేఖ వాస్తవంగా ఏమైనప్పటికీ దాన్ని వాస్తవాధీన రేఖ (ఎల్ ఏ సీ)గా మార్చుకునేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. అయితే ఎల్ ఏ సీపై కూడా భారత్, చైనాల అవగాహనలు భిన్నంగా ఉన్నాయి. 1975 నుంచి భారత్- చైనా సరిహద్దులో కాల్పులు జరగలేదు. ఇరువైపులా ఒక్క సైనికుడు కూడా చనిపోవడం సంభవించలేదు. ఇదొక అసాధారణ విజయం. 4506 కిలో మీటర్ల పొడవైన సరిహద్దు వెంబడి 45 సంవత్సరాల పాటు శాంతియుత వాతావరణాన్ని సుస్థిరంగా కొనసాగించగలగడం అసాధారణం కాదూ? ఆ శాంతియుత పరిస్థితులకు చైనా భంగం కలిగించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కావలిలో 20 మంది భారతీయ సైనికులు మరణించారు. ఆ నాలుగున్నర దశాబ్దాల పాటు (దృక్కోణాలు భిన్నమైనప్పటికీ) ఎల్ ఏ సీ ని చైనా అంగీకరిస్తూ వచ్చింది. అయితే లద్దాఖ్ లోని గల్వాన్‌లోయ తమదే అని ఏనాడూ అనలేదు. ఎలాంటి హక్కు ను ప్రకటించుకోలేదు. 1963 జనవరి 1న చౌ ఎన్ లై (అప్పటి చైనా ప్రధానమంత్రి) జవహర్ లాల్ నెహ్రూ రాసిన లేఖ క్షేత్ర స్థాయిలోని పరిస్థితిని స్పష్టంగా పేర్కొంది: ‘గత ఏడెనిమిది సంవత్సరాలుగా నేను వేర్వేరు సందర్భాలలో స్వయంగా లద్దాఖ్‌లోని పలు ప్రాంతాలను ప్రాంతాలను సందర్శించాను. ఏ ఒక్క పర్యటనలోనూ ఆ ప్రాంతంలో చైనీస్ సైనిక దళాలు ఉన్న విషయం నా దృష్టికి రాలేదు. లద్దాఖ్‌లోకి చైనా సైనిక దళాలు వస్తున్నట్టు మా సైనికాధికారులు కూడా ఎన్నడూ మాకు తెలుపలేదు. అయితే ఇటీవల చైనా సైనిక దళాలు లద్దాఖ్‌లోని వివిధ ప్రదేశాలలోకి వచ్చినట్టు మాకు నివేదికలు అందుతున్నాయి.... భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం 1962 సెప్టెంబర్ 8కి పూర్వం చైనా సైనిక దళాలు ఎప్పుడూ తూర్పు రంగంలోని లాంగ్జు వద్ద మినహా మరే ప్రదేశంలోనూ భారత్ భూభాగాల్లోకిరాలేదు...’. చైనా ప్రధానమంత్రికి రాసిన లేఖల్లో వాస్తవాలను నెహ్రూ సూటిగా చెప్పారు. చైనాను ‘దురాక్రమణదారు’అని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. యుద్ధంలో భారత్ ఓడిపోయిన తరువాత, చైనా విజేత న్యాయాన్ని మనపై విధించడానికి తాపత్రయ పడుతున్న సమయంలో నెహ్రూ వైఖరి అది. 


2020 మార్చి-ఏప్రిల్‌లో చైనా సైనిక దళాలు గల్వాన్ లోయ (ఈ ప్రాంతంపై తనకు సార్వభౌమిక హక్కు ఉన్నట్టు ఇంతకుముందెన్నడూ చైనా ప్రకటించలేదు)లోని పాంగ్యాంగ్ సరస్సు, హాట్ స్ప్రింగ్స్ ప్రదేశాలలోకి చొరబడ్డాయి. చైనా చొరబాట్లను మే 5న భారత్ గుర్తించి, వెనక్కి వెళ్ళిపోవాలని ఆ దేశ సైనికదళాలకు స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన జూన్ 15, 16 తేదీల్లో తీవ్ర ఘర్షణలకు దారితీసింది. ఇది కూడా నరేంద్ర మోదీ పహరాలోనే జరిగింది. అయినప్పటికీ, కారణమేమిటో గానీ చైనాను దురా క్రమణదారు అని ప్రధాని మోదీ అనలేదు. ఇంతకు ముందెన్నడూ లేని ఈ అస్పష్ట వైఖరి పట్ల మన విదేశీ వ్యవహారాల మం త్రిత్వ శాఖ సంతోషంగా ఉన్నదా? ప్రధానమంత్రి ఉద్దేశపూర్వక మౌనాన్ని ఆర్మీ జనరల్స్, సరిహద్దులను కాపాడే సైనికులు అంగీకరిస్తున్నారా? ప్రధాని వైఖరితో సంతృప్తి పడుతున్నారా?


భారత్, చైనాల మధ్య సంబంధాలు కొద్ది నెలల్లోనే నాటకీయంగా మారిపోయాయి. 2018 ఏప్రిల్ 28న ఊహాన్‌లో భారత ప్రధాని, చైనా అధ్యక్షుని శిఖరాగ్ర సమావేశంలో విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో సరిహద్దు సమస్య గురించి ఒకే ఒక్క పేరా వున్నది. వాడుకైన మాటలే అందులో ఉన్నాయి. ‘సరిహద్దుల్లో శాంతి యుత పరిస్థితులను కాపాడాలని’, ‘పరస్పర విశ్వాసాన్ని పెంపొందించుకునే చర్యలను చేపట్టాలని’... ఇత్యాది మాటలవి. 2019 అక్టోబర్ 12న సరిహద్దు సమస్యకు సంబంధించిన ప్రస్తావనలను 17 పేరాల సంయుక్త ప్రకటనలో 16 వ పేరాలో ప్రస్తావించారు ‘2020 సంవత్సరాన్ని భారత్-చైనా సాంస్కృతిక సంబంధాల సంవత్సరంగా, ఉభయ దేశాల మధ్య ప్రజల స్థాయిలో సంబంధాలను పటిష్ఠం చేసుకొనే సంవత్సరంగా పాటించాలని భారత్ ప్రధాని, చైనా అధ్యక్షుడు నిర్ణయించారని’ ఆ సంయుక్త ప్రకటన పేర్కొంది. 2019 డిసెంబర్ 21 న భారత్, చైనా ప్రత్యేక ప్రతినిధుల సమావేశమనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటన కూడా సాధారణ పదబంధాలతోనే నిండివున్నది. మూడునెలల అనంతరం గల్వాన్ లోయలో చొరబడేందుకు చైనా సైన్యం చాలా ముందుగానే సంసిద్ధమై వున్నదని ఇప్పుడు స్పష్టమవుతున్నది.


ఆర్థిక వ్యవస్థ పరిస్థితి అంతకంతకూ దిగజారిపోతున్న దృష్ట్యా భారత్ బలహీనపడిందని చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ సరిగా అంచనా వేశారు. జిన్ పింగ్ ఉద్దేశాలను అర్థం చేసుకోవడంలో నరేంద్ర మోదీ పూర్తిగా విఫలమయ్యారు. చైనాతో సంబంధాలు ఇలా బెడిసికొట్టడం భారత్‌కు ఒక దౌత్య విపత్తు, ఒక సైనిక పరాజయం (కనీసం తాత్కాలికంగా). ఎల్ ఏ సీపై అంగీకారంతో 1993 నుంచి సమకూరిన ప్రయోజనాలన్నీ సంపూర్ణంగా తుడిచి పెట్టుకు పోయాయి. భారత్‌కు ఇదొక భారీ నష్టం. 

ఈ సంఘటనలు చెబుతున్న పాఠమేమిటి? దౌత్యాన్ని దౌత్యవేత్తలకు వదిలివేయమన్నదే ఆ పాఠం. దౌత్యవేత్తలు ఆలోచనా పూర్వకంగా వ్యవహరిస్తారు. నెమ్మదిగా ఒక నిర్ణయానికి వస్తారు. అయితే భవిష్య సూచనలను వారు ఖచ్చితంగా అవగతం చేసుకుంటారు. దౌత్య వ్యవహారాలలో అనుభవం లేనివారు అటువంటి విషయాల్లో తప్పక విఫలమవుతారు. జూలై 5న భారత్, చైనాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశ మనంతరం గల్వాన్ లోయలో వివాదాస్పద ప్రదేశాల నుంచి ఇరుదేశాల సైనిక దళాలను ఉపసంహరించుకొంటున్నట్టు, ఉద్రిక్త పరిస్థితులను నివారించే చర్యలు చేపడుతున్నట్టు ఉభయ దేశాలు ప్రకటించాయి. ఈ పరిణామాన్ని నేను స్వాగతిస్తున్నాను. అయితే 2020 మే 5న నాటి యథాపూర్వస్థితి పునరుద్ధరణ లక్ష్యాన్ని సాధించేందుకు మోదీ ప్రభుత్వం మరింత దూరం వెళ్ళవలసివున్నది. గల్వాన్ లోయలో యథాపూర్వస్థితి పునరుద్ధరణ ప్రక్రియను దేశ ప్రజలు వేయికళ్ళతో గమనిస్తారు. ఆ లక్ష్య పరిపూర్తిలో శీఘ్ర పురోగతిని వారు గట్టిగా కోరుకొంటున్నారు. మోదీ సర్కార్ ఆ లక్ష్య సాధనకు జవాబుదారీ కావాలని వారు భావిస్తున్నారు. ఇదిలా వుండగా ‘2020 సంవత్సరాన్ని భారత్-చైనా సాంస్కృతిక సంబంధాల సంవత్సరంగా పాటించాలన్న....’ సంకల్పం ఆచరణలోకి రాకముందే చాలా అగౌరవపూర్వకంగా, అవమానకరంగా ముగిసిపోయింది.





పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2020-07-11T05:44:02+05:30 IST