Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆపదలో అండ... ఈ ఆక్సిజన్‌ ఆటో

ఏప్రిల్‌ ముప్ఫైవ తేదీ... చెన్నై... కొవిడ్‌ సోకిన సీతా దేవి తల్లికి ఊపిరి అందడంలేదు. ఆమెను తీసుకొని ఆసుపత్రికి పరుగెత్తారు సీతాదేవి. పన్నెండు గంటలు వేచివున్నా ఆక్సిజన్‌ దొరకలేదు. అక్కడి నుంచి మరో ఆసుపత్రికి వెళ్లారు. అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయుయింది. అమ్మ ఊపిరి ఆగిపోయింది. ఈ ఘటన సీతాదేవిని కదిలించింది. తన తల్లిలా మరొకరు బలి కాకూడదని... ‘ఆక్సిజన్‌ ఆటో’ ఒకటి ప్రారంభించి ఎందరికో ప్రాణ వాయువయ్యారు.  


‘‘ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. దేశంలో ఎక్కడికెళ్లినా ఆక్సిజన్‌ కొరత. చూస్తూ చూస్తూ ఉండగానే ఊపిరి ఆగిపోతోంది. కరోనా రెండో దశ తీవ్రతకు మా అమ్మ కూడా బలైంది. ఆ రోజు రాత్రి ఎనిమిది గంటల సమయంలో కరోనా సోకిన అమ్మకు ఉన్నట్టుండి ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోతున్నాయి. ఆసుపత్రికి తీసుకువెళితే అదిగో ఇదిగో అంటూ తెల్లారే దాకా అడ్మిషన్‌ కోసం నిరీక్షింపజేశారు. ఇక లాభం లేదని మరొక ఆసుపత్రికి వెళితే... తీరా బెడ్డు దొరికేసరికి అమ్మ ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఒక అంబులెన్స్‌లో నుంచి మరో అంబులెన్స్‌లోకి మార్చుకొంటూ... అరకొర ఆక్సిజన్‌తో ఆమెను బతికించుకోవడానికి తెల్లార్లూ ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ ఫలితం దక్కలేదు. కళ్ల ముందే శ్వాస అందక ఆమె కొట్టుమిట్టాడుతుంటే ఏమీ చేయలేకపోయాను. అదీ చెన్నైలాంటి మహానగరంలో! నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? నా కోపం ఎవరిపై చూపించాలి? ఏంచేసినా అమ్మ తిరిగిరాదన్నది నిజం.  


నాకు నేనే ధైర్యం చెప్పుకున్నా... 

మా అమ్మ లేదన్న కఠోర వాస్తవాన్ని జీర్ణించుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. ఇది జీవితం. ఒడిదొడుకులు ఎన్ని ఎదురైనా ముందుకు సాగాలి. పయనం ఆగిపోతే మనల్ని నమ్ముకున్నవారి జీవితాలు ఏమైపోతాయి? నాకు నేనే ధైర్యం చెప్పుకున్నా. మా అమ్మలా మరొక కొవిడ్‌ పేషెంట్‌ ఆక్సిజన్‌ అందక బలి కాకూడదనుకున్నా. అందుకు ఏంచేయలగలను? ఆపదలో ఉన్నవారికి ఆక్సిజన్‌ ఇవ్వాలనే స్పష్టత ఉంది. కానీ ఎలా? దాని కోసం ఆలోచిస్తుంటేనే ‘ఆక్సిజన్‌ ఆటో’ తట్టింది. ఆటోనే ఎందుకంటే... నిర్వహణ ఖర్చు తక్కువ. ఎక్కడికి కావాలంటే అక్కడికి సులువుగా వెళ్లవచ్చు. 


అందరికీ అందుబాటులో... 

ఇప్పుడే కాదు... మొదటి నుంచి నేను సామాజిక సేవ చేస్తూనే ఉన్నాను. అనాథల కోసం ‘స్ట్రీట్‌ విజన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌’ ఒకటి నెలకొల్పాను. నాకు ఉన్నంతలో కొంత నా చుట్టూ ఉన్నవారి అభ్యున్నతికి ఖర్చు పెట్టాలన్నది ప్రధాన ఉద్దేశం. ఇక ఈ కరోనా సమయంలో ఆసుపత్రులు, శ్మశానాల ముందు అంబులెన్స్‌లు బారులు తీరి కనిపిస్తు న్నాయి. అత్యవసరంలో ఆసుపత్రికి పోవాలంటే అంబులెన్స్‌లు దొరకడంలేదు. అక్కడికి వెళ్లినా బెడ్లు ఖాళీ ఉండడంలేదు. ఊపిరి ఆగిపోతుంటే ప్రాణ వాయువు అందడంలేదు. నిత్యం ఈ దృశ్యాలు గుండెల్ని పిండేస్తున్నాయి. సమయానికి ఆక్సిజన్‌ దొరికుంటే ఇవాళ మా అమ్మ బతికుండేది. సొంతవారిని కోల్పోతే ఆ బాధ ఎంతలా కోత పెడుతుందో నాకు తెలుసు. అందుకే నా వంతుగా కరోనా రోగులను కొంతైనా ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే మా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆక్సిజన్‌ ఆటో ఏర్పాటు చేశాను. అందులో ఆక్సిజన్‌ సిలిండర్‌, ఫ్లో మీటర్‌ అమర్చాం.  


రోజుకు ఇవరై మంది... 

ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు ఈ ఆటో ఆర్‌జీజీజీహెచ్‌ ముందు పార్క్‌ చేసి ఉంటుంది. ఆక్సిజన్‌ కావల్సిన పేషెంట్లు ఆటో వద్దకు వస్తే, అక్కడ వైద్య సిబ్బంది వారికి సహకరిస్తారు. ఎప్పుడూ నాతోపాటు 

మరో ఇద్దరు వాలంటీర్లు ఆటో వెంటే ఉంటారు. రోజుకు కనీసం 20 మంది దీన్ని ఉపయోగించుకొంటున్నారు. ఇందుకు రోజుకు ఆరు వేల రూపాయల పైనే ఖర్చవుతుంది. అదికాకుండా ప్రతి పేషెంట్‌కూ ఆక్సిజన్‌ మాస్క్‌ మార్చాలి. ఈ మాస్క్‌ ఒక్కొక్కటీ 250 రూపాయలు. ఎవరి నుంచీ నిధులు సేకరించడంలేదు. నా సొంత డబ్బుతోనే ఈ ఏర్పాట్లు చేస్తున్నా. చెన్నైలో కొవిడ్‌ చల్లబడేవరకు ఇది కొనసాగుతుంది. నా సేవకు మెచ్చి ‘గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌’ వారు ‘కొవిడ్‌ బ్రిగేడ్‌’ ఆర్మ్‌బ్యాండ్‌ ప్రదానం చేశారు. ఏదిఏమైనా నా వల్ల ఒక్క ప్రాణం నిలబడినా చాలు... అదే నాకు సంతృప్తి... అమ్మకు నేనిచ్చే నివాళి.  


Advertisement
Advertisement