Abn logo
Mar 27 2020 @ 02:26AM

మత్స్యావతారం అంతరార్థం

  • కుఱుగఱులు వలుఁద మీసలు
  • చిఱుదోకయుఁ బసిఁడి యొడలు సిరిగల పొడలున్‌
  • నెఱి మొగము నొక్క కొమ్మును
  • మిఱుచూపులుఁ గలిగి యొక్క మీనంబయ్యెన్‌


శ్రీమహావిష్ణువు మత్స్యావతారంలో ప్రాదుర్భవించిన ఘట్టాన్ని వర్ణిస్తూ పోతనామాత్యులు రాసిన పద్యమిది! చిన్నచిన్న రెక్కలు, పెద్దపెద్ద మీసాలు, పొట్టి తోక, బంగారపు రంగు శరీరం, అందమైన పొలుసులు, చక్కటి ముఖం, తలపై కొమ్ము, మిరుమిట్లుగొలిపే చూపులతో ఆ మహా మత్స్య రూపం అద్భుతంగా ఉందట. పూర్వం సోమకుడనే రాక్షసుడు.. బ్రహ్మదేవుడి నుంచి వేదాలను దొంగిలించి సముద్రంలో దాక్కున్నాడు. బ్రహ్మ ప్రార్థన మేరకు విష్ణువు ఇలా మత్స్యరూపంలో అవతరించి, సోమకుని సంహరించి, వేదాలను బ్రహ్మకు అప్పగించాడు. అలా విష్ణువు మత్స్యావతారాన్ని గ్రహించిన చైత్రశుద్ధ తదియను మత్స్య జయంతిగా జరుపుకొంటాము. ఆ క్రమంలోనే మహాప్రళయంలో లయమయ్యే జీవచైతన్యాన్ని కాపాడే బాధ్యతను సత్యవ్రతుడు అనే రాజుకు అప్పగించి అతడిని మనువుగా నియమిస్తాడు. అతడే వైవస్వత మనువు. ఇక్కడ సోముడు లేదా చంద్రుడు మనసుకు ప్రతీక. సత్యవ్రతుడు అంటే సత్యమే వ్రతముగా కలవాడు. సత్యము బుద్ధికి, విచక్షణకు ప్రతీక. ‘విత్‌’ అనే ధాతువు నుండి వచ్చినది వేదం. అంటే తెలుసుకోవడం అని అర్థం. తెలుసుకోవడం ‘సాక్షర’మైతే జ్ఞానం వస్తుంది. దానిలో విచక్షణ లోపిస్తే అదే విలోమమై ‘రాక్షస’మవుతుంది. మనస్సు విచక్షణను కోల్పోయిన సమయంలో బుద్ధిని ప్రకాశింపజేసి, రాక్షసత్వాన్ని నిర్మూలించిన రోజు మత్స్యజయంతి. మనస్సు అశ్రద్ధను, అజాగ్రత్తను ఆదరించడం వల్ల జ్ఞానానికి దూరమయింది. బుద్ధి ప్రచోదన వల్ల అజ్ఞానం మాయమై వేదవిద్యను తిరిగి పొందింది. మీన రూపంలో విష్ణువు నీటిలో అవతరించడం నీటి ప్రాముఖ్యతను, దానిని సంరక్షించవలసిన బాధ్యతను సూచిస్తుంది. సత్యవ్రతుడు నదీ తీరాన అర్ఘ్యప్రదానం చేస్తున్న సమయంలో.. రక్షించమంటూ తన చేతిలో చేరిన చేప పిల్లను కమండలంలో విడిస్తే అది కమండలాన్ని, చెరువులో వేస్తే చెరువును, సముద్రంలో వేస్తే సముద్రాన్ని ఆక్రమించింది. పొంగిన సముద్రం భూమిని ముంచే పరిస్థితి వచ్చింది. అప్పుడా రాజు ఎదుట విష్ణువు ప్రత్యక్షమై.. రాజా! ప్రళయకాలం సమీపించింది, జీవకోటి నశిస్తుంది. ఆ జీవమూలాలను కాపాడే బాధ్యతను నీకు అప్పగిస్తున్నానని చెపుతూ ఒక నావను బహూకరిస్తాడు. రాజు ఆ నావలో జీవమూలాలను భద్రపరచే సమయంలో నావ మునిగిపోకుండా మీనాకారంలో కాపాడుతాడు. బలహీనులను ఆదుకోవలసిన బాధ్యత బలవంతులకు ఉన్నది. అలా జరగని సమయంలో అది ప్రళయానికి దారితీస్తుంది. అన్వేషణ వల్ల ఆవిష్కరణ జరుగుతుంది. అది త్యాగ భావనతో కలిస్తే సౌభాగ్యం, భోగ భావనతో కలిస్తే స్వార్థం వెలుగు చూస్తాయి. స్వార్థంతో ప్రళయాన్ని ఆహ్వానిద్దామా, సమన్వయంతో స్వర్గాన్ని నిర్మిద్దామా నిర్ణయం మనదే. ఇదే మత్స్య జయంతి అంతరార్థం.

- పాలకుర్తి రామమూర్తి, 9441666943

Advertisement
Advertisement
Advertisement