స్మృతి విత్తనం..!

ABN , First Publish Date - 2021-01-07T06:13:33+05:30 IST

శ్రుతిలయలకు సెలవంటూ హృదయం ఎక్కడుందో వెతుక్కుంటూ ఏమంత...

స్మృతి విత్తనం..!

శ్రుతిలయలకు సెలవంటూ

హృదయం ఎక్కడుందో వెతుక్కుంటూ

ఏమంత తొందర ముంచుకొచ్చిందని

అప్పుడే వెళ్ళిపోయావు మిత్రమా..!

చిరునవ్వుల వరం కోసం

నాలుగు దశాబ్దాల నీ అక్షర తపస్సు

ఫలించకముందే అలా ఎలా 

వెళ్ళిపోయావు..?

నువ్వు పలకరించిన చిరునవ్వు పూలు

మనసువాడలో వాడనేలేదింకా

నా కవితల తొలి సంతకానికి

నీ ప్రశంసల తొలిపలుకులు

నా షష్టి జయంతికి నీవిచ్చిన పాట బహుమతి

ఇంకా పరిమళిస్తూనే వున్నాయి

నాగభైరవ భువనవిజయంలో 

నీ సద్యోకవి పాత్ర

ప్రాణవీణ గానాన్ని పాడుతూనే ఉంది

నెల్లూరు పురమందిర వేదిక మీద

నాటకరంగస్థలం మీద

నీ ఉపన్యాస శ్వాస ఆడుతూనే ఉంది

ప్రపంచం కోల్పోయిన హృదయం

ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళిపోయిన నేస్తమా..!

ఇదిగో నా మదిలో 

నీ స్మృతివిత్తనం నేడు 

నాటుకుంటున్నా..!!


డాక్టర్ పెరుగు రామకృష్ణ

(ఆత్మీయ కవి మిత్రుడు సినీగీత రచయిత 

వెన్నెలకంటికి నివాళి)

Updated Date - 2021-01-07T06:13:33+05:30 IST