‘పరపతి’ పాయె!

ABN , First Publish Date - 2021-07-07T08:06:58+05:30 IST

అప్పుల మీద అప్పులు చేసి... ఎక్కడ దొరికితే అక్కడ అప్పు చేసి... కొత్త కొత్త పద్ధతుల్లో అప్పు చేసే వాళ్లు... మళ్లీ అప్పు చేయాలంటే? ‘వడ్డీ ఎక్కువ ఇస్తాం! అప్పు ఇవ్వండి ప్లీజ్‌’...

‘పరపతి’ పాయె!

దేశంలోనే అత్యధిక వడ్డీరేటు చెల్లిస్తున్న రాష్ట్రం

సెక్యూరిటీల వేలంలో కొత్తగా 2 వేల కోట్ల రుణం

7.15 శాతంతో వెయ్యి కోట్లు.. 7.19తో మరో వెయ్యి కోట్లు తెచ్చుకున్న సర్కారు

ఈశాన్య రాష్ట్రాలకంటే ఎక్కువ వడ్డీ ఆఫర్‌

రికవరీపై నమ్మకం సన్నగిల్లడం వల్లే అధిక రేటు

కేవలం 13 వారాల్లో రూ.18,100 కోట్ల అప్పు

గత నెలలో తెచ్చిన తాకట్టు అప్పు 4,100 కోట్లు

అయినా.. జీతాలు, పెన్షన్లకు సొమ్ముల్లేవ్‌


  • జూన్‌లో భూములు, ఆస్తులు తాకట్టు పెట్టి రూ.4,100 కోట్లు అప్పు తెచ్చారు. అదంతా ‘చేయూత’కు ఖర్చు చేశారు. మళ్లీ అప్పు చేస్తే తప్ప జీతాలు, పెన్షన్లు చెల్లించలేని పరిస్థితి! అందుకే... అధిక వడ్డీతో రూ.2వేల కోట్ల కొత్త రుణం.
  • మంగళవారం 12 రాష్ట్రాలు తమ సెక్యూరిటీల వేలం ద్వారా రూ.14,900 కోట్ల రుణం తెచ్చుకున్నాయి. అసోం అత్యల్పంగా 6.33 శాతం వడ్డీకి రూ.500 కోట్లు రుణం తీసుకుంది. అందరికంటే ఎక్కువగా ఏపీ 7.15, 7.19 శాతం వడ్డీ ఆఫర్‌ చేయాల్సి వచ్చింది.
  • అసోం ప్రభుత్వం ఐదేళ్లలోనే తిరిగి అప్పు చెల్లిస్తామని చెప్పింది. కానీ... ఏపీ సర్కారు 16, 17 సంవత్సరాల్లో చెల్లిస్తామని పేర్కొంది. 
  • ఈశాన్య రాష్ట్రమైన మిజోరం (7.12)కంటే ఏపీయే ఎక్కువ వడ్డీ ఆఫర్‌ చేయాల్సి వచ్చింది.


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

అప్పుల మీద అప్పులు చేసి... ఎక్కడ దొరికితే అక్కడ అప్పు చేసి... కొత్త కొత్త పద్ధతుల్లో అప్పు చేసే వాళ్లు... మళ్లీ అప్పు చేయాలంటే? ‘వడ్డీ ఎక్కువ ఇస్తాం! అప్పు ఇవ్వండి ప్లీజ్‌’... అని అడగాలి! పరపతి పోయిన వాళ్లకు ఇదే పరిస్థితి! ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌దీ ఇదే దుస్థితి! రాష్ట్రంపై బహిరంగ మార్కెట్లో నమ్మకం సన్నగిల్లింది. ఇచ్చిన అప్పు సులభంగా చెల్లించగలదన్న భరోసా లేకుండా పోయింది. మధ్యవర్తిగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఉన్నప్పటికీ ఏపీకి చెందిన సెక్యూరిటీ బాండ్లపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించలేదు. చివరికి... దేశంలో ఏ రాష్ట్రమూ చెల్లించనంత వడ్డీ ‘ఆఫర్‌’ చేసి, సెక్యూరిటీలు వేలం వేసి మంగళవారం రూ.2,000 కోట్ల అప్పు తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇందులో రూ.1000కోట్లు 7.15శాతానికి, మరో రూ.1000 కోట్లు 7.19 శాతం వడ్డీకి తెచ్చారు. వేలంలో పాల్గొన్న ఈశాన్య రాష్ట్రాలకు కూడా ఏపీకంటే తక్కువ వడ్డీరేటుకే అప్పు పుట్టింది. మంగళవారం జరిగిన సెక్యూరిటీల వేలంలో 12 రాష్ట్రాలు పాల్గొన్నాయి. బిహార్‌, మిజోరం, అసోం లాంటి రాష్ట్రాలకు కూడా ఏపీకంటే తక్కువ వడ్డీరేటుకే అప్పు దొరికింది. అసోం 6.33 శాతం, బిహార్‌కి 6.75 శాతం, మిజోరం 7.12 శాతం వడ్డీ ఆఫర్‌ చేసి అప్పు తెచ్చుకోగలిగాయి. ఏపీ రూ.2,000 కోట్లు అప్పు తెచ్చుకోగా... ఇందులో వెయ్యి కోట్ల రుణం చెల్లింపు కాలపరిమితి 17 ఏళ్లు. మరో రూ.1000 కోట్ల రుణం కాలపరిమితి 16 ఏళ్లు. వేలంలో పాల్గొన్న ఇతర రాష్ట్రాలేవీ ఇంత భారీ స్థాయి కాల పరిమితి పెట్టుకోలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 13 వారాలు పూర్తయింది. ఈ 13వారాల్లో రాష్ట్రం చేసిన అప్పు రూ.18,100కోట్లు. అంటే... సగటున వారానికి రూ.1392కోట్లు, నెలకు రూ.5,570 కోట్లు అప్పు చేశారు. ఆర్థిక శాఖ చేస్తున్న అప్పులు, ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్స్‌కు కలిపి సగటున నెలకు రూ.2916 కోట్లు అసలు, వడ్డీ రూపంలో తిరిగి చెల్లిస్తున్నారు. అంటే... సంవత్సరానికి రూ.35,000కోట్లు! వచ్చే రెండేళ్లలో ఈ మొత్తం రూ.54వేల కోట్లకు చేరుతుందని ఆర్థికశాఖ గతంలో అంచనా వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుల చెల్లింపు కాలాన్ని కూడా పెంచుకోవాల్సి వస్తోంది. వ్యవధి పెరిగే కొద్దీ వడ్డీ రేటు కూడా పెరుగుతుంది. 


ఏపీ విషయంలో ఇదే  జరుగుతోంది. తలకుమించిన అప్పుల భారం ఉండడంతో ఏపీ సెక్యూరిటీలు కొనుగోలు చేయడానికి ఇన్వెస్టర్లు పెద్దగా ముందుకు రావడం లేదు. దీంతో వడ్డీరేటు ఎక్కువ ఆఫర్‌ చేయక తప్పడంలేదు. కాగా, విశాఖలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 213ఎకరాలు రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌కు బదలాయించి... అక్కడ నుంచి వాటిని బ్యాంకులకు తాకట్టు పెట్టి జూన్‌లో రూ.3,000కోట్లు అప్పు తెచ్చారు. అలాగే, రాష్ట్ర రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్‌ ద్వారా రాష్ట్రంలోని రోడ్లు భవనాల శాఖ ఆస్తులు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రూ.1100కోట్లు అప్పు తీసుకొచ్చారు. మొత్తం రూ.4100కోట్లను జూన్‌లో ‘జగనన్న చేయూత’ పథకం కోసం వాడారు. దీంతో ప్రభుత్వోద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం డబ్బులు లేకుండా పోయాయి. 


జీతాలు, పెన్షన్ల కోసమే మళ్లీ అప్పు

జూలై 6వ తేదీ వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వోద్యోగులకు, రిటైర్డ్‌ ఉద్యోగులకు పూర్తిస్థాయిలో వేతనాలు, పెన్షన్లు ఇవ్వలేకపోయింది. గత నెలలో చేసిన అప్పంతా ‘చేయూత’ పథకం కింద ఖర్చయిపోవడంతో... కొత్త అప్పు చేసే అవకాశం కోసం ఎదురుచూసి, మంగళవారం సెక్యూరిటీలు వేలం వేసి రూ.2,000కోట్లు అప్పు తీసుకొచ్చారు. వీటితో బుధవారం నుంచి వేతనాలు, పెన్షన్లు చెల్లించనున్నారు.

Updated Date - 2021-07-07T08:06:58+05:30 IST