మానవుడి పరమార్థం!

ABN , First Publish Date - 2020-06-19T05:30:00+05:30 IST

చాలామంది ఆధునికులు ఈ ప్రపంచం ఒక ‘యాదృచ్ఛికమైన సంఘటన’ అంటారు. ఒకవేళ ప్రపంచం యాదృచ్ఛికంగా ఏర్పడినా, అది జన్మించిన తరువాత దాని గమనంలో ఒక పద్ధతి ఉంది. కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి...

మానవుడి పరమార్థం!


‘‘ఈ ప్రపంచమనేది ఏదో యాదృచ్ఛిక ఘటన కాదు. దీన్ని చెక్కిన శిల్పి అంధుడైన ఒక దేవుడు కాదు. ఒక సచేతన శక్తి దీని ప్రణాళికను రచించింది. ప్రతి రేఖలో, ప్రతి ఒంపులో దీనికి ఒక అర్థం ఉంది. ఈ జగత్‌ శిల్పం చాలా ఉన్నతమైనది, ఘనమైనది. అనేకమంది అజ్ఞాత శిల్పులు, శిల్పాచార్యులు దీన్ని మలిచారు. వారందరూ పరమాత్మ ఆజ్ఞానువర్తులే!’’

- శ్రీ అరవిందులు (‘సావిత్రి’ గ్రంథం నుంచి)



చాలామంది ఆధునికులు ఈ ప్రపంచం ఒక ‘యాదృచ్ఛికమైన సంఘటన’ అంటారు. ఒకవేళ ప్రపంచం యాదృచ్ఛికంగా ఏర్పడినా, అది జన్మించిన తరువాత దాని గమనంలో ఒక పద్ధతి ఉంది. కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని నియమాల ప్రకారం ప్రపంచం సాగిపోతున్నదంటే, దాని పుట్టుకలో ఆ నియమ నిబంధనలు సూక్ష్మరూపంలో, బీజ రూపంలో ఉన్నాయనే అర్థం. అక్కడ లేని క్రమం ఇక్కడ ఉండే వీలు లేదు.


ఈ సృష్టంతా పరిణామశీలి అనీ, ఏకకణ జీవి నుంచి ప్రారంభమయిన పరిణామం ఈనాటి మానవుడి వరకూ వచ్చి ఆగిందనీ డార్విన్‌ చెప్పాడు. అయితే ఈ సృష్టి పరిణామానికి కారణం భౌతికపరమైనది కాదనీ, అది చేతనాపరమైనదనీ అంటారు శ్రీఅరవిందులు. ఆ చేతనే ప్రారంభంలో... పరచేతనలో బీజరూపంలో ఉన్న సంకల్పం. అదే జడపదార్థంగా మారింది. పదార్థం నుంచే ప్రాణిక చేతన, దానిలోంచీ మానసిక చేతనా వచ్చాయి. అందుకే సకలకోటి జీవరాశి ఏర్పడింది.  ఈ జీవకోటిలో మానవుడు ఇప్పటికి ఉన్నతుడు... చివరివాడు. అయితే ఈ పరిణామం మానవుడితో ఆగిపోదనీ, అది ఇంకా ముందుకు సాగి, అతను దివ్యమానవుడుగా రూపాంతరం చెందుతాడనీ శ్రీ అరవిందులు చెప్పారు.  ఇలా ఒక ఎరుకతో పరిణామక్రమానికి ఊతం ఇచ్చే ప్రక్రియనే ‘యోగం’ అంటారు. మానవుడు ఎక్కడి నుంచి బయలుదేరాడో అక్కడికి ఈ యోగం ద్వారా చేరుకోవడమే జీవితానికి ఏకైక పరమార్థమని మన సాంప్రదాయిక యోగాలన్నీ నొక్కి చెబుతున్నాయి. దానినే వారు ‘ముక్తి’ అన్నారు. అయితే సృష్టిగా మారిన ఆ మూల వస్తువు... అంటే ‘బ్రహ్మపదార్థం’ ... అలా ఎందుకు మారిందో తెలుసుకొని, దాని లక్ష్యం నెరవేర్చాల్సిన అవసరం మానవుడికి ఉంది. కనుక వచ్చిన చోటుకు వెళ్ళడంతో పని అయిపోలేదనీ, ఆ దైవం తాలూకు సంకల్పాన్ని నెరవేర్చడమే మానవుడి పరమార్థమనీ శ్రీఅరవిందులు ప్రకటించారు. పరిణామక్రమంలో ఆ మానవ వికాసం మరొక మెట్టు పైకి ఎక్కి, మానవుడు దివ్యమానవుడిగా వికసించినప్పుడే ఆ పరమార్థం నెరవేరుతుందని ఆయన చెప్పారు. అనంతుడైన ఆ భగవంతుడిలో అనంతకోటి సంపద ఉంది. అది ఏ కోణంలో ఎవరి ద్వారా ప్రకటితం అవుతుందో ఆ పరమాత్మకే ఎరుక! అందుకోసం మనల్ని మనం సంసిద్ధం చేసుకోవాలి. ఆ సంసిద్ధి కోసం చేసే ప్రయాణంలో మనలో స్వార్థం, దోపిడీ, హింస, అహంకారం, అవినీతి, ఆధిపత్యపోరు లాంటి రుగ్మతలన్నీ పండుటాకుల్లా రాలిపోతాయి.

-కొంగర భాస్కరరావు


Updated Date - 2020-06-19T05:30:00+05:30 IST