వ్యాక్సిన్‌ వచ్చేసింది

ABN , First Publish Date - 2021-01-13T07:40:29+05:30 IST

కరోనాతో కకావికలమైన జనానికి ఊరటనిచ్చేలా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ వచ్చేసింది. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ పంపిణీలో భాగంగా కేంద్రం తొలివిడతలో రాష్ట్రానికి 4,96,680 డోసులు అందించింది.

వ్యాక్సిన్‌ వచ్చేసింది

  • రాష్ట్రానికి 4,96,680 డోసులు
  • సీరం నుంచి 4.76 లక్షల టీకాలు
  • భారత్‌ బయోటెక్‌ నుంచి 20 వేలు
  • ప్రత్యేక విమానంలో గన్నవరానికి
  • నేడు రీజినల్‌ సెంటర్లకు తరలింపు
  • తొలి విడతలో 3.77లక్షల మందికి 

అమరావతి, విజయవాడ, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): కరోనాతో కకావికలమైన జనానికి ఊరటనిచ్చేలా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ వచ్చేసింది. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ పంపిణీలో భాగంగా కేంద్రం తొలివిడతలో రాష్ట్రానికి 4,96,680 డోసులు అందించింది. వాటిలో సీరం ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన ‘కొవిషీల్డ్‌’ 4,76,680 డోసులు కాగా.. భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన ‘కొవాగ్జిన్‌’ 20వేల టీకాలున్నాయి. ఈ వ్యాక్సిన్లు మంగళవారం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీహరి, కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌, జేసీ శివశంకర్‌ వాటిని కట్టుదిట్టమైన భద్రత నడుమ గన్నవరంలోని రాష్ట్రస్థాయి వ్యాక్సిన్‌ స్టోరేజ్‌ సెంటర్‌కు తరలించారు. బుధవారం ఉదయం వాటిని ప్రత్యేక ఐస్‌ వ్యాన్ల ద్వారా జిల్లాలకు తరలిస్తారు. అయితే ఏ జిల్లాకు ఎన్ని టీకాలు పంపించాలో కేంద్రం నుంచి ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం కొవిడ్‌ యాప్‌లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం అర్ధరాత్రి ఈ ప్రక్రియ ముగియనుంది. ఆ తర్వాతే ఏ జిల్లాకు ఎన్ని అవసరమో స్పష్టత వస్తుంది. కేంద్రం నుంచి సమాచారం రాగానే బుధవారం రాష్ట్రంలోని నాలుగు రీజినల్‌ వ్యాక్సిన్‌ సెంటర్లకు తరలిస్తారు. విశాఖ రీజినల్‌ వ్యాక్సిన్‌ సెంటర్‌ నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలకు వ్యాక్సిన్‌ సరఫరా అవుతుంది. గుంటూరు రీజినల్‌ సెంటర్‌ నుంచి పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలకు తరలిస్తారు. కర్నూలు సెంటర్‌ నుంచి చిత్తూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాలకు.. కడప సెంటర్‌ నుంచి కడప, అనంతపురం జిల్లాలకు సరఫరా చేస్తారు. మొత్తంగా తొలివిడతలో 3.77 లక్షల మంది హెల్త్‌కేర్‌ వర్కర్లకు ఆరోగ్యశాఖ కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించనుంది. మరోవైపు యానాంకు అవసరమైన వ్యాక్సిన్‌ కూడా ఏపీ నుంచే పంపిణీ చేస్తున్నారు. యానాంలో 320 మంది హెల్త్‌కేర్‌ వర్కర్లున్నారు. వారికోసం 320 డోసులు గన్నవరం నుంచే యానాంకు పంపిస్తున్నారు.


10 మందికి ఒక బాటిల్‌..

వ్యాక్సిన్‌ ప్రత్యేకంగా సీజ్‌ చేసిన బాటిల్స్‌లో ఉంటుంది. ఒక్కో బాటిల్‌లో 10 డోస్‌లు ఉంటాయి. బాటిల్‌ ఓపెన్‌ చేసిన వెంటనే ఒక్కొక్కరికి 0.5 ఎంఎల్‌ చొప్పున 10 మందికి వ్యాక్సిన్‌ అందిస్తారు. వ్యాక్సిన్‌ బాటిల్‌ ఓపెన్‌ చేసే వరకూ 2-4 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వచేస్తారు. మరోవైపు జిల్లాలకు వ్యాక్సిన్‌ తరలించేందుకు 26 ప్రత్యేక వాహనాలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రస్థాయి వ్యాక్సిన్‌ స్టోరేజ్‌ సెంటర్‌లో 2 ఐస్‌వ్యాన్లతో పాటు శ్రీకాకుళం, విజయనగరం మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో రెండేసి వ్యాన్లు ఉన్నాయి. వీటి ద్వారా రీజనల్‌ సెంటర్లు, జిల్లాలకు సరఫరా చేస్తారు. మరోవైపు ప్రైవేటు వాహనాలను కూడా అద్దెకు తీసుకునేందుకు ఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది. కానీ ప్రైవేటు సంస్థలు ముందుకు రాకపోవడంతో టెండర్‌ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. వ్యాక్సిన్‌ సరఫరా కోసం ప్రస్తుతం ఉన్న వాటితోపాటు మరో 20 క్యారియర్లను కొనుగోలు చేసేందుకు ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తుంది.


వ్యాక్సినేషన్‌ను విజయవంతం చేయాలి: సీఎస్‌

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 16న ప్రారంభంకానున్న కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్‌ దాస్‌ ఆదేశించారు. మంగళవారం విజయవాడలోని సీఎస్‌ క్యాంప్‌ కార్యాలయంలో జిల్లా కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లతో వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లపై ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. తొలి విడతలో 3.80 లక్షల మంది ఆరోగ్యశాఖ సిబ్బందికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు.

Updated Date - 2021-01-13T07:40:29+05:30 IST