Abn logo
Sep 25 2020 @ 00:45AM

ఉద్యమాల ఉక్కు మహిళ

Kaakateeya

పైలా చంద్రమ్మ మరణంతో శ్రీకాకుళం జిల్లా విప్లవోద్యమానికి నాయకత్వం వహించిన త్యాగాల తరం వెళ్ళిపోయినట్లయింది. ఆ విప్లవమూర్తుల త్యాగం, వారు ప్రదర్శించిన పట్టుదల, చూపిన అంకిత భావాన్ని నేటితరం పుణికి పుచ్చుకోవడమే చంద్రమ్మకు ఇచ్చే నిజమైన నివాళి.

నివాళి : (పైలా చంద్రమ్మ) 1948–2020


శ్రీకాకుళ గిరిజన సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, సి.పి.ఐ(ఎం.ఎల్‌)న్యూ డెమోక్రసీ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి పైలా చంద్రమ్మ 2020 సెప్టెంబర్ 23 సాయంత్రం విశాఖ కెజిహెచ్‌ ఆసుపత్రిలో మృతి చెందారు. ఆమె మరణం పార్టీనే కాకుండా విప్లవోద్యమ శ్రేణుల్నీ ఎంతగానో దిగ్భ్రాంతి పరిచింది. పోరాటమే ప్రాణంగా, ఉద్యమమే ఊపిరిగా బతికిన ఉద్యమగళం మూగబోయింది. భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన శ్రీకాకుళ విప్లవోద్యమంలో ఆఖరి శ్వాస వరకు పోరాడిన ధీరురాలు పైలా చంద్రమ్మ. ఏజన్సీలో ఎన్ని కష్టాలు పడినా, పోలీసుల చేతిలో చిత్రహింసలు అనుభవించినా, జైలు జీవితం గడిపినా విప్లవం తప్ప ఇంకో ఆలోచనే లేదని గుండెధైర్యంతో చెప్పడమే కాకుండా అంకిత భావంతో పని చేసిన ఉక్కు మహిళ చంద్రమ్మ. అంతిమశ్వాస వరకు ఆదివాసీల విముక్తే లక్ష్యంగా, సమాజంలో సమూల మార్పుల కోసం చంద్రమ్మ పోరాడారు. మరణించేనాటికి ఆమె వయస్సు 72 సంవత్సరాలు.


శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం రాజాంలో పైలా చంద్రమ్మ 1948లో చిన్నయ్య, కావమ్మ దంపతులకు జన్మించారు. 11 ఏళ్ళ వయస్సులో తన గ్రామంలో అమెరికా ప్రెసిడింట్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేసినపుడు మొదటగా కమ్యూనిస్టులతో ఆమెకు పరిచయం ఏర్పడింది. కమ్యూనిస్టులు ఆనాడు సారా కుండలను పగులగొట్టడం, పలు ప్రజాసమస్యల పరిష్కారం కోసం కృషి చేయడంతో కమ్యూనిస్టు పార్టీ పట్ల చంద్రమ్మకు అభిమానం పెరిగింది. 1966లో జరిగిన ఆకలియాత్రలో స్త్రీలు పెద్దఎత్తున పాల్గొన్నారు. చంకల్లో బిడ్డలనెత్తుకొని, నెత్తిమీద అన్నం మూటలు పెట్టుకొని 100 కిలోమీటర్లు పైగా నడిచి శ్రీకాకుళంలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు. ఇవన్నీ పైలా చంద్రమ్మ మీద బలంగా ముద్రవేశాయి. 


1968 నవంబరులో ఒక భూస్వామి పొలంలో పంటలు కోసుకున్న కేసులో చంద్రమ్మతోపాటు 67 మంది స్త్రీలు అరెస్టయి చాలా కాలం జైలులో ఉన్నారు. అప్పటికి చంద్రమ్మ వయస్సు 17 సంవత్సరాలు. ఆ తర్వాత ఆమె దళంలో చేరారు. దళ జీవితంలో అనేక కష్టాలను అనుభవించారు. శ్రీకాకుళ ఉద్యమంపై నిర్బంధం కొనసాగే కాలంలోనే పైలా వాసుదేవరావును వివాహం చేసుకున్నారు. దళంలో పని చేసేటప్పుడు దళం ఉనికికి ప్రమాదం అనే దృష్టితో వారికి కలిగిన సంతానం అరుణను పెంపకానికి వేరేవాళ్ళకు ఇచ్చేశారు. ఆ పాపే నేడు అత్తలూరి అరుణగా అందరికీ సుపరిచితురాలు. 


1975లో కొండలోగోంకు ఏరియాలో జరిగిన రహస్య సమావేశంపై పోలీసులు దాడి జరిపినప్పుడు పైలా వాసుదేవరావు తప్పించుకోగలిగారు కానీ కంచల్లో చిక్కుకుపోయిన చంద్రమ్మ అరెస్టుయ్యారు. పెరోల్‌పై విడుదలైన తర్వాత పార్టీ సెక్రటేరియట్‌ సభ్యుడు విక్రంతో కలిసి ఆయుధాలను మరమ్మతు చేయించడానికి కారులో తీసుకువెళుతూ నల్గొండలో తిరిగి అరెస్టయ్యారు. మరికొంత కాలం ఆమె జైలుజీవితం గడపక తప్పలేదు. ఎన్నో కేసుల్ని, మరెన్నో పోలీసుదాడుల్ని ఎదుర్కొన్న ఆమె మొత్తంగా 10 సంవత్సరాలకు పైగా రహస్య జీవితం, 15 సంవత్సరాలకుపైగా జైలు జీవితం గడిపారు. 


శ్రీకాకుళ సాయుధ పోరాటంపై ప్రభుత్వం తీవ్రమైన నిర్బంధాన్ని అమలు చేసింది. 1973నాటికి ఒక్క దళం కూడా లేని స్థితిలో, చెల్లాచెదురైన పార్టీ సహచరులను కూడగట్టడంలో, ఉద్యమాన్ని ప్రజాపంథా గాడిలో పెట్టడానికి పైలా వాసుదేవరావు తీవ్రమైన కృషి చేశారు. దళసభ్యులతో కలిసి భవిష్యత్‌ కర్తవ్యాన్ని రూపొందించుకున్నారు. చీలికలు, పేలికలైన ఉద్యమాన్ని, విప్లవ కారుల ఐక్యత ఆవశ్యకతను గుర్తించి చండ్ర పుల్లారెడ్డితో చర్చించి ఆయన నేతృత్వంలోని పార్టీలో విలీనమయ్యారు.


మరణించేనాటికి పైలా చంద్రమ్మ అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. త్యాగాల పునాదుల మీదనే ప్రతిఘటనా పోరాటాన్ని నిర్మించగలమని ఆమె ఎంతగానో నమ్మారు. శ్రీకాకుళం జిల్లాలో జీడిపిక్కల రైతాంగ సమస్యల మీద, ఆదివాసీ భూమి సమస్యల మీద, రైతాంగ గిట్టుబాటు ధరల సమస్యమీద నిరంతరం జరిగిన ఆందోళనలో ఆమె భాగస్వామి అయ్యారు. బోదకాలు, భారీ శరీరంతో అనేక వ్యాధులు ఊపిరి సలపనీయకుండా చేసినా తన బాధ్యతలను మరువలేదు. 


 పైలా వాసుదేవరావు 2010లో కేన్సర్‌ వ్యాధితో మరణించినా, అధైర్యపడకుండా ఎంతో అంకిత భావంతో విప్లవోద్యమ నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఎన్ని అవాంతరాలు, అననుకూల పరిస్థిలు ఎదురైనా చివరి శ్వాస వరకు పార్టీ కార్యక్రమాలలో లీలమై ప్రజాసమస్యలపై పోరాడి ఆదర్శంగా నిలిచారు చంద్రమ్మ. రెండు రోజుల క్రితం కరోనా పరీక్ష చేయించగా పాజిటివ్‌ రావడంతో ఈ నెల 22న ఆమె కెజిహెచ్‌ ఆసుపత్రిలో చేరారు. ఆ మరుసటిరోజే ఆమె మరణించడం బాధాకరం. చంద్రమ్మ మరణంతో శ్రీకాకుళం జిల్లా విప్లవోద్యమానికి నాయకత్వం వహించిన త్యాగాల తరం వెళ్ళిపోయినట్లయింది. ఆ విప్లవమూర్తుల త్యాగం, వారు ప్రదర్శించిన పట్టుదల, చూపిన అంకితభావాన్ని నేటి తరం పుణికి పుచ్చుకోవడమే చంద్రమ్మకు నిజమైన నివాళి. 

చిట్టిపాటి వెంకటేశ్వర్లు

సి.పి.ఐ(ఎం.ఎల్‌)న్యూడెమోక్రసీ 

రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు


Advertisement
Advertisement
Advertisement