‘దసరా’కు బస్సులు లేనట్టే!

ABN , First Publish Date - 2020-10-13T08:21:50+05:30 IST

రెండు తెలుగు రాష్ర్టాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు నడిపే విషయంలో ‘ఇంటర్‌ స్టేట్‌’ వివాదం మరింత ముదురుతోంది.

‘దసరా’కు బస్సులు లేనట్టే!

ఏపీ, తెలంగాణ ఆర్టీసీల మధ్య కొలిక్కిరాని వివాదం

‘ట్రిప్‌ స్లాట్స్‌’ను తెరమీదికి తెచ్చిన టీఎస్‌ ఆర్టీసీ

ఏపీ లక్ష కిలోమీటర్లు తగ్గిస్తామన్నా.. వీడని పట్టు

తమ ప్రతిపాదనకు ఏపీ ఓకే చెప్పాలన్న టీ మంత్రి

ఆంధ్రా అధికారులు ద్వంద్వ వైఖరి అని విమర్శ

మరింత ముదురుతున్న ‘ఇంటర్‌ స్టేట్‌’ వివాదం


(విజయవాడ-ఆంధ్రజ్యోతి): రెండు తెలుగు రాష్ర్టాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు నడిపే విషయంలో ‘ఇంటర్‌ స్టేట్‌’ వివాదం మరింత ముదురుతోంది. దసరా పండుగ నాటికి కూడా రెండు రాష్ర్టాల మధ్య బస్సు సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. రెండు రాష్ర్టాల మధ్య నెలకొన్న వివాదంపండగ ముందైనా పరిష్కారమవుతుందని ఇప్పటి వరకు భావించినా.. ఇప్పుడు మరో చిక్కు ఏర్పడింది. అధికార యంత్రాంగం స్థాయిలో పలు దఫాలు చర్చలు జరిగిన దరిమిలా లక్ష కిలోమీటర్లు తగ్గించుకోవాలన్న ఆలోచనలో ఏపీఎ్‌సఆర్‌టీసీ ఉంది. అయితే, టీఎ్‌సఆర్‌టీసీ కొత్తగా ‘ట్రిప్‌ స్లాట్స్‌’ను తెరమీదికి తెచ్చినట్టు సమాచారం. ‘ట్రిప్‌ స్లాట్స్‌’ అంటే రెండు రాష్ర్టాల మధ్య నడిచే బస్సుల సమయాలను కూడా పరస్పరం నిర్దేశించుకోవడం! తెలంగాణ డిమాండ్‌ మేరకు లక్ష కిలోమీటర్లును తగ్గించుకునేందుకు ఏపీఎ్‌సఆర్‌టీసీ సిద్ధపడినా.. ట్రిప్‌ స్లాట్స్‌ అంశాన్ని తెలంగాణ లేవదీయడం ఏపీ అధికారులకు చికాకుగా మారింది.


ఇంతకు ముందు తెలంగాణ ప్రతిపాదించిన లక్ష కిలోమీటర్ల తగ్గింపు ప్రతిపాదనపై 50 వేల కిలోమీటర్లను ఏపీ తగ్గించుకుంటుందని, 50 వేల కిలోమీటర్లను తెలంగాణ పెంచుకోవచ్చని ఏపీఎ్‌సఆర్‌టీసీ అధికారులు ప్రతిపాదించారు. అయినప్పటికీ టీఎ్‌సఆర్‌టీసీ బెట్టువీడలేదు. కీలకమైన విజయవాడ-హైదరాబాద్‌ రూట్‌ విషయంలో తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారులు  పట్టుబడుతుండడం విమర్శలకు దారి తీసింది. ఈ దశలో రెండు దఫాలు ఉన ్నతాధికారుల స్థాయిలో చర్చలు జరిగాయి. ఏపీ నుంచి ఆర్టీసీ ఎండీ, రవాణా శాఖ ఉన్నతాధికారులు తెలంగాణకు వెళ్లారు. అదేసమయంలో తెలంగాణ ఆర్టీసీ నుంచి కూడా ఉన్నతాధికారులు ఏపీకి వచ్చి చర్చించి పర్కిరించుకునేలా ఏపీఎ్‌సఆర్‌టీసీ ఉన్నతాధికారులు ఆహ్వానించారు. అయితే, ఇప్పటి వరకు తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారుల నుంచి  స్పష్టత రాలేదు. 


మా ప్రతిపాదనకే అంగీకరించాలి:టీ మంత్రి పువ్వాడ

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఓ టీవీ చానెల్‌తో మాట్లాడిన సందర్భంలో ఏపీ అధికారులు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని, మీడియాకు లీకులిస్తూ గందరగోళాలకు గురిచేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రతిపాదనకు అంగీకరిస్తేనే బస్సులు తిరుగుతాయని మంత్రి  చెప్పారు. దీంతో   ‘ఇంటర్‌ స్టేట్‌ అగ్రిమెంట్‌’ అనేది ఏపీ సమస్య తప్ప, తమ సమస్య కాదన్నట్టుగా తెలంగాణ మంత్రి వాదన ఉందని ఆర్టీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 


మంత్రుల స్థాయి చర్చలతో..

ఏపీ, తెలంగాణల ఆర్టీసీ, రవాణా శాఖల ఉన్నతాధికారుల స్థాయిలో చర్చలు జరిగాయి. అయితే, ఎలాంటి పరిష్కారం లభించలేదు. ఈ నేపథ్యంలో రెండు రాష్ర్టాల మంత్రుల స్థాయిలో చర్చలు జరిగితే సమస్యకు ఓ పరిష్కారం దొరికే అవకాశం ఉంటుందని ఆర్టీసీ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, ఆర్టీసీ వివాదంపై అవసరమైతే.. తెలంగాణ ప్రభుత్వంతో చర్చించడానికి రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, మునిసిపల్‌ మంత్రి బొత్స సత్యనారాయణలను ప్రభుత్వం నిర్దేశించినట్టు తెలుస్తోంది. అయితే, ఈ కమిటీ ఇప్పటి వరకు తెలంగాణ మంత్రిని కలిసి చర్చించిన దాఖలాలు లేవు. ఇక, తెలంగాణ మంత్రి తమతో చర్చించడానికి ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదని, వాస్తవానికి డబుల్‌ స్టాండ్‌తో ఉన్నది ఆయనేనని ఏపీఎ్‌సఆర్‌టీసీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో దసరా నాటికి కూడా ఇరు రాష్ట్రాల మధ్య బస్సులు తిరిగే అంశం కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదని ఆర్టీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

Updated Date - 2020-10-13T08:21:50+05:30 IST