వేల కోట్లకు ఆడిట్‌ లేదు..ఇది ఆర్థిక క్రమశిక్షణ లోపమే

ABN , First Publish Date - 2022-07-11T08:40:28+05:30 IST

వేల కోట్లకు ఆడిట్‌ లేదు..ఇది ఆర్థిక క్రమశిక్షణ లోపమే

వేల కోట్లకు ఆడిట్‌ లేదు..ఇది ఆర్థిక క్రమశిక్షణ లోపమే

ఆర్థిక క్రమశిక్షణ లోపించింది

లెక్కలేనితనంగా ఖర్చు చేస్తున్నారు

20 మంది ఐఏఏస్‌లు ఒకే మాటపై కఠినంగా ఉంటే వ్యవస్థ మారడం తథ్యం

ఈ ప్రభుత్వంలో ఎవరికీ రక్షణ లేదు

రాజధాని అమరావతిపై దుష్ప్రచారం

టెంపరరీ అనడం వల్లే ఎక్కువ ఇబ్బంది

హైదరాబాద్‌ అభివృద్ధి సంతోషంగా ఉంది

పెద్దకొడుకు పెద్దవాడవుతున్నట్లే ఉంది

కానీ చిన్న కొడుకు ఎదగడం లేదని బాధ

నేను రిటైరైనప్పుడు కొంత మంది పట్టించుకోలేదు

మీరే నన్ను నడిపించాలని జగన్‌ అన్నారు

నా కింద పనిచేయాల్సిన అధికారే నన్ను దాటిపోయారు

‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో మాజీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం


ప్రభుత్వంలో లెక్కలేనితనంగా ఖర్చులు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం అన్నారు. వేల కోట్లకు ఆడిట్‌ జరగడం లేదని.. ఇది ఆర్థిక క్రమశిక్షణరాహిత్యం కిందకు వస్తుందని చెప్పారు. తాను రిటైరయ్యాక కొందరు అధికారులు కలిసేందుకు కూడా రాలేదని.. ఇది తనను బాధించిందని తెలిపారు. ‘రాజధాని అమరావతిపై ఎందుకు.. ఎలా.. వచ్చిందో ఒక దుష్ప్రచారం తెరమీదికి వచ్చింది. టెంపరరీ అనే మాట వాడడంతో ఇక్కడ పెడుతున్న ఖర్చు వృథా అనే చర్చ ప్రారంభమైంది’ అని ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో పేర్కొన్నారు. ఆయన వెల్లడించిన కీలక విషయాలివీ..


ఆర్కే: నమస్తే ఎల్వీ సుబ్రహ్మణ్యంగారూ.. ఎలా ఉన్నారు? పదవీ విరమణ తర్వాత జీవితం ఎలా సాగుతోంది? చివరి రోజుల్లో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ప్రశాంతంగా ఉందా?  

ఎల్వీ సుబ్రహ్మణ్యం: బాగున్నానండీ. చాలా ప్రశాంతంగా ఉంది. పుస్తకాలు చదువుతున్నాను.


సీఎస్‌, డీజీపీ అనేవి టాప్‌ పొజిషన్స్‌. ఇవి చేసి రిటైరయ్యాక ఆ అకేషన్‌ కూడా మెమొరబుల్‌గా ఉంటుంది. కానీ మీ దగ్గరకు వచ్చేసరికి.. మీ దురదృష్టమా.. మీపై కక్షసాధింపో.. ఏదైనా కానీ.. అత్యం త దారుణంగా పంపించినట్లయింది. దానికి మీకు బాధనిపించలేదా?  

15, 20 రోజులు బాధనిపించింది. తర్వాత అలవాటుపడిపోయాను. చాలా మంది ఫోన్‌ చేసి పలకరించారు. సందేశాలూ పంపించారు. కొందరు ఇక్కడ(హైదరాబాద్‌)కు వచ్చారు. నేను ముప్పై ఏడున్నర సంవత్సరాలు ప్రభుత్వంలో పనిచేశాను. ఐఏఎస్‌ సంఘంలో యాక్టివ్‌ ఆఫీస్‌ బేరర్‌గా ఉన్నాను. చాలా మందికి పరిచయం ఉన్నవాడినే. కానీ కొందరు రాలేదు. ధైర్యం అనే గుణాన్ని పక్కనపెట్టేశారు. 


మీరుండే ప్రశాసన్‌ నగర్‌లో చాలా మంది వేరే మార్గాల్లో చాలా సంపాయించుకున్నారు కదా! మీ కుటుంబ సభ్యులు కానీ, మీ భార్య కానీ, అలాంటి వాళ్లను చూసినప్పుడు.. ఏంటిదీ అని అనలేదా?

లేదండీ! కుటుంబ నేపథ్యం అలాంటిది. బాగా సంపాయించేయాలి.. వంటి ఆలోచన ఎప్పుడూ లేదు. దాదాపు పదేళ్ల కిందటి వరకూ నా భార్య ఆటోలోనే ప్రయాణించేది. మా పిల్లలూ బస్సుల్లో వెళ్లేవాళ్లు.  


ఇప్పుడు ఏ ఆఫీసరైనా రెండు మూడు కార్లు పిలిపించుకుంటున్నారుగా?!

అందరిలోనూ అలవాట్లు మారాయండీ. పార్వతీపురం ఐటీడీఏలో నేను పనిచేస్తున్న కాలంలో ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి. ఆయన ఆ సమయంలో విజయనగరం వచ్చారు. ఒక ప్రత్యేక విషయాన్ని ఆయనకు వివరిస్తే.. వెంటనే కోటి రూపాయలు కేటాయించారు.


ఇప్పుడు సంపాదన విషయంలో అధికారులు రాజకీయ నేతలతో పోటీ పడుతున్నారు.

ఎవరైతే ధనం వెంట, అధికారం వెంట పరిగెడుతున్నారో.. రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతున్నారో.. అలాంటి వాళ్లంతా చింతిస్తారు. మేమంతా శంకరన్‌ గారితో శిక్షణ తీసుకున్నవాళ్లం. ఆయన మమ్మల్ని ఎంపిక చేసి, ఐటీడీఏల్లో మాకందరికీ అవకాశం ఇచ్చారు. ఇక్కడ పోస్టింగ్‌ వస్తే.. స్పెషల్‌ ఇంక్రిమెంట్‌ వచ్చిందని భావించేవాళ్లం. పోటీతత్వంతో పనిచేసేవాళ్లం.


రిటైరైన వాళ్లు సలహాదారులుగానో.. ఏదో పోస్టునో ఆశిస్తున్నారు. సలహాదారుగా తీసుకున్నా.. వీళ్లిచ్చే సలహాలు వాళ్లు తీసుకునేదీ లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అయితే.. ఏ సలహాదారూ వెళ్లి ముఖ్యమంత్రి జగన్‌కు సలహా ఇస్తారని నేననుకోను.

ప్రతి వ్యక్తికీ పర్సనల్‌ ఫిలాసఫీ ఒకటి ఉండాలి. ఇప్పుడు సీనియర్లు ఆదర్శప్రాయంగా ఉండడం లేదు. సీనియర్లను చూసి జూనియర్లు నేర్చుకునేది ఏమీ ఉండక.. వాళ్లు వేరే మార్గంలో వెళ్తున్నారు. ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డిగారు ఒకసారి ఫోన్‌ చేసి ఆ అధికారికి చెప్పండి.. నా మాట వినడం లేదని చీఫ్‌ సెక్రటరీకి చెప్పారండీ. దీంతో సీఎస్‌ కలెక్టర్‌కు ఫోన్‌ చేసి అడిగితే.. రిటెన్‌గా పంపించాలని ఆయన కోరారు. ఒక సందర్భంలో ఎస్వీ ప్రసాద్‌గారు సీఎంతో ఏకీభవించలేదు. 


ఇప్పుడు ఏపీలో ఉన్న వికృత వాతావరణంలో తప్పు చేసిన వారే మీసాలు తిప్పుకొని తిరుగుతున్నారు. ఆఫీసర్లు తప్పు చేశారో లేదో తెలియాలంటే.. నోట్‌ ఫైల్‌ ఒక్కటేనా మార్గం?

అవును! నోట్‌ ఫైల్‌లో పైఅధికారి ఏం రాశారు? ఏం కోరారు? ఏం చేయాలి? ..ఇలా అన్ని విషయాలూ  పరిశీలన చేయాలి. 


మీరు సీఎస్ గా చేశారు కదా.. ఫైల్స్‌ ఇలా రావడం చూశారా?

లేదండీ. చూడలేదు. కేబినెట్‌కు తీసుకెళ్తున్న ప్రతిపాదనల్లోనూ పరిపక్వత ఉండడం లేదు. సీరియస్‌ విషయాలపైనా పరిశీలన ఉండడం లేదు. ముఖ్యమంత్రిపై భారం వేస్తున్నాం.  


భారం వేయట్లా.. సీఎం చెప్పింది చేస్తున్నారు.

ఫైల్లో ముఖ్యమంత్రి చెప్పారని రాయాలి. అలా రాయరు. కానీ మంత్రిమండలి ముందు పెడతారు. సదరు మంత్రి కూడా దానిని పరిశీలించడం లేదు. కేబినెట్‌ ప్రపోజల్స్‌ వాస్తవానికి కేబినెట్‌ భేటీకి ఐదారు గంటల ముందు సిద్ధమవుతున్నాయి. దీంతో చదవడానికి టైం ఉండదు. కొన్ని కొన్ని సార్లు సీఎం డిజైర్స్‌ అని జీవోలో పేర్కొంటున్నారు. అలా చేయడం తప్పు. కేబినెట్‌ తొలి భేటీ సమయంలో నేను ఓ ప్రతిపాదన చేశా. ఫైల్స్‌ ఎలా రాయాలి.. ఎలా పంపించాలి.. ఎలా ఆమోదించాలో ఓ చిన్న క్లాస్‌ మాదిరిగా వివరించాలని సీఎంను కోరా. అయితే ఆయన వద్దని, వాళ్లంతా సీనియర్లని అన్నారు. 


బిల్డింగులకు పార్టీ రంగులు వేశారు కదా.. మీరైతే ఏంచేస్తారు?

అధికారి అభిమతాన్ని బట్టి ఉంటుందండీ. నెల్లూరు మెడికల్‌ కాలేజీ ప్రారంభోత్సవానికి అప్పటి కేంద్ర మంత్రి హోదాలో వెంకయ్యనాయుడు వచ్చారు. అయితే.. మెడికల్‌ కాలేజీకి అప్పటి ప్రభుత్వ పార్టీ జెం డాలు కట్టా రు. దీనిని గమనించిన వెంకయ్యనాయుడుగా రు అందరినీ చెడామడా తిట్టేశారు. విచక్షణ ఆ స్థాయిలో ఉన్నవారు చూపిస్తే.. అధికారులకు ఇబ్బందులు ఉండవు.


నా దృష్టిలో మెయిన్‌ కల్ర్పిట్స్‌ అధికారులే. బిజినెస్‌ రూల్స్‌ ప్రకారం మీకు రక్షణ ఉంది. మంత్రి అడిగినా నిబంధనలు అనుమతించకపోతే.. చేయనని చెప్పొచ్చు కదా!

మంత్రితో ఇలాంటి సమస్యలు రావండీ. ముఖ్యమంత్రితోనే వస్తాయి. 


మీ సర్వీసులో తొలి 20 ఏళ్లలో ముఖ్యమంత్రులు ఇంత అసాధారణ అధికారాలు కలిగి లేరు. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే.. ఆయన రాజో.. చక్రవర్తో.. ఏంటో అర్ధం కావడం లేదు. అలవోకగా ఐదు కోట్లు ఇచ్చేస్తున్నారు. ఎలా ఇచ్చేస్తారు..? నిబంధనలు లేవా?

ఉన్నాయి. ప్రతి విషయానికీ నిర్దిష్ట ఆదేశాలు ఉన్నాయి. అగ్ని ప్రమాదం జరిగింది.. బాధితులకు ఎంత ఇవ్వాలి.. ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది.. ఎంతివ్వాలనేది స్పష్టంగా ఉంది. దీనికన్నా ఎక్కువ ఇస్తే ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాలి. దీనిలో ఎక్స్‌గ్రేషియా ఎందుకు పెంచారో రాయాలి. అది ప్రభుత్వ డబ్బు కదా! ఒక అధికారి తెలిసో తెలియకో.. రాంగ్‌ టీఏ బిల్లు క్లెయిమ్‌ చేసినందుకు చీఫ్‌ సెక్రటరీ ప్రమోషన్‌ రాలేదు. అలా ఆచరించిన రాష్ట్రమిది. ఇప్పుడు లెక్కలేనితనంగా ఖర్చు చేయడం.. దీనికి ఆడిట్‌ జరగకపోవడం.. వేల కోట్ల రూపాయలు ఆడిట్‌ కాకుండా ఉండిపోయాయని ఇటీవలే నేను పేపర్లో చదివాను. ఇది చాలా చాలా ఆర్థిక క్రమశిక్షణరాహిత్యం కిందకే వస్తుంది. 


క్రమశిక్షణరాహిత్యం చిన్నపదం.. ఆర్థిక అరాచకత్వం. ముఖ్యమంత్రులు తమను తాము తానీషాల్లా ఊహించుకుని.. మూడ్‌ వచ్చినప్పుడు కోట్లు ఇచ్చేస్తున్నారు.

చంద్రబాబుగారు ఓ సమయంలో ఇలాంటి విషయం పై గంటపాటు చర్చించారు. ఒలింపిక్‌కు సంబంధించి ప్రోత్సాహకం ఇవ్వాల్సి వచ్చినప్పుడు.. గతంలో ఇంతే ఇచ్చామని అధికారులు చెప్పారు. ఇంతకుమించి ఇవ్వాలంటే ప్రత్యేక ఆర్డర్‌ ఇవ్వాల్సి ఉంటుందని అనడంతో అలానే ప్రత్యేక ఆర్డర్‌ ఇచ్చి.. నగదు బహుమతి ఇచ్చారు.


ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే అమరావతికి 100 ఎకరాలు చాలదా.. 200 ఎకరాలు చాలదా కేపిటిల్‌కు అని ఎట్లా అనగలిగారు?

అంటే.. మనందరికీ ద్వంద్వ వైఖరి ఉంది కదా..! అమరావతికి ఇంత విస్తీర్ణం ఎందుకు అవసరమైందో విస్తృతంగా చర్చల్లోకి తీసుకెళ్లలేకపోయాం. తీసుకెళ్లి ఉంటే ఇంతగా అనవసరపు చర్చ జరిగేది కాదు.


అమరావతికి 30 వేల ఎకరాలు తీసుకున్నారని అనుకుం దాం. మౌలిక సదుపాయాలకు, ఇతరత్రా పోతే నికరంగా 20 వేల ఎకరాలు కూడా మిగలదు. దీనికితోడు ప్రాజెక్టులకు కేటాయింపులు.. కంపెనీలకు కేటాయింపులు ఉంటాయి కదా! ఒక్కసారి కేపిటల్‌ అయిన తర్వాత మళ్లీ భూసేకరణ చేయలేరు. 

మనం తీసుకున్న నిర్ణయాల వెనకాల ఉన్న హేతుబద్ధతను ప్రచారం చేయడంలో ఎక్కడో కొంత వెలితి కనిపిస్తోంది. దీనికితోడు తీసుకున్న భూమిని తక్షణం వినియోగించుకోలేకపోయామని అనిపించింది. మేమంతా వెళ్లి అక్కడ పనిచేశాం. దానిని ఎప్పుడైతే తాత్కాలిక (టెంపరరీ) రాజధాని అన్నారో.. చాలా మంది ఏమనుకున్నారంటే.. అదేదో కూలిపోయే భవనం అనుకున్నారు. 


కాస్టేముంది..? డెవలప్‌ అంటే ఈ ల్యాండే అమ్మి కదా చేసేది! 10 వేల కోట్లు ఖర్చు పెడితే.. రోడ్లు, ఇతర సదుపాయాలు వచ్చేస్తాయి. దీంతో ల్యాండ్‌ వాల్యూ పెరిగిపోతుంది కదా! 

ఒక ప్రైవేటు డెవలపర్‌ చేయడం వేరు.. ప్రభుత్వం చేయడం వేరు.


ఆ ప్రాంతంలో పుట్టినవాడిగా ఇప్పుడు హైదరాబాద్‌లో అభివృద్ధిని చూస్తుంటే ఎలా ఉంది?

2014 వరకు ఇక్కడే ఉన్నాం. ఈ అభివృద్ధిలో మా పాత్ర కూడా ఎంతో కొంత ఉంది. ఈ అభివృద్ధిని చూస్తుంటే సంతోషంగా ఉంది. పెద్దకొడుకు పెద్దవాడు అవుతున్నట్లే ఉంది. చిన్న కొడుకు పెద్దవాడు కావడం లేదు. వాడు పెరగడం లేదన్న బాధ ఉంది.


37 ఏళ్ల సర్వీసులో చంద్రుడికి మచ్చలాగా ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కేసు వచ్చింది కదా.. ఇబ్బందిపడ్డారా?

సమాజంలో అందరూ అనుమానాస్పదంగా చూడడం వల్ల ఇబ్బంది అనిపించింది. అందులో నా పాత్ర లేదని తేలిపోయాక తేలిక అనిపించింది. 


వ్యవస్థలో మార్పు తేవడానికి అవకాశం ఉందా? 

కచ్చితంగా మార్చొచ్చు. 200 మంది అక్కర్లేదు.. ఒక 20 మంది ఈ పని ఇలాగే చేయాలని గట్టిగా ఉంటే వ్యవస్థ మారిపోతుంది. 



కొత్తగా వచ్చిన సీఎం జగన్‌ మిమ్మల్ని నన్ను వేలుపట్టి నడిపించు ఎల్వీ అన్నా అని అన్నారు కదా! ఎక్కడొచ్చింది మీ ఇద్దరికీ?

ఎగ్జాక్ట్‌గా కారణం నాకూ తెలియదు. సీఎం ప్రమాణ స్వీకారం అయిన తర్వాత రెండు మూడు సందర్భాల్లో మీరు నన్ను నడిపించాలని క్లియర్‌గా చెప్పారు. ఒక ముఖ్యమంత్రి చెప్పినప్పుడు దానిని బాధ్యతగా భావించాను. నా మీద వేరే అభిప్రాయం ఏర్పడుతుందనే దృష్టి నాకు ఎప్పుడూ రాలేదు.


పరిధి దాటిపోతున్నప్పుడు ఎవరో ఒకరు బాధ్యతగా ఉండాలి కదా!

మీరు చెబుతున్నది ఎంత వాస్తవమైనా.. ఎవరికీ రక్షణ లేదు కదండీ! అన్నింటికీ తెగించి.. ఇంటికి పొమ్మంటే పోతానని నాలాగా ఉండేవాళ్లను వేళ్లమీద లెక్కబెట్టుకోవచ్చు. 


తెలంగాణలో ప్రభుత్వ భూములు వేలం వేస్తున్నారు.. ప్రభుత్వానికి డబ్బులు వస్తున్నాయి కదా!

ప్రతి వేలానికీ కోర్టులో మొట్టికాయలు పడుతున్నాయి కదా! ప్రభుత్వంలో అధికారులు ఎప్పుడూ పూర్తిగా బాధ్య త తీసుకోలేరు. మంత్రులు చెప్పాల్సి న విషయాలు అధికారులతో చెప్పిద్దామనుకుంటే కు దరదు. అధికారులు ప్రభుత్వానికి ప్రతినిధులు కాదు. 


అసలు ఎందుకొచ్చింది? ప్రవీణ్‌ ప్రకాశ్‌ ప్రేరేపణ లేకుంటే మరెవరైనా..?

తెలియదండీ. విన్నది ఏమంటే.. నేనొకసారి సీఎం కార్యాలయంలో ఉన్న అధికారికి షోకాజ్‌ నోటీసు ఇచ్చా ను. ఆ అధికారి సీఎస్‌ కింద పని చేసే కేడర్‌. నన్ను దాటి వెళ్లిపోతున్నాడు. సీఎంను తప్పుదారి పట్టిస్తున్నాడు. మూడు సార్లు మందలించాను. చెప్పినా అతను కొన్ని సందర్భాల్లో.. ‘మీకు అర్థం కావడం లేదు.. పరిస్థితులు మారిపోతున్నా యి. మనం ప్రెసిడెన్షియల్‌ వ్యవస్థలోకి వెళ్లిపోతు న్నాం. ముఖ్యమంత్రే మనకు అల్టిమేట్‌’ అని నాకు క్లాస్‌ చెప్పేవాడు. సీఎం ముఖ్యమే.. కానీ ప్రొసీజర్‌ ఫాలో కావాల్సిందేనని గట్టిగా చెప్పాను. ఆ తర్వాత ఇతర విభాగాల అధికారులపై ఆయన ఒత్తిడి ఎక్కువైపోయింది. వాళ్లు ఫిర్యాదులు చేశారు. 


టెంపరరీ అంటే గుడారం అనుకున్నారు. కానీ అవి పక్కా బిల్డింగులు.

అవునండీ. చాలా మంది తెలంగాణకు చెందిన అధికారులు కూడా చూశారు. బహుత్‌ అచ్ఛాహై అన్నారు కూడా. హైదరాబాద్‌ సెక్రటేరియెట్‌ కన్నా చాలా బాగుంది. ఫంక్షనల్‌గా చాలా ఉపయోగంగా ఉండేది. అందరం ఒకే చోట ఉండేవాళ్లం. అసెంబ్లీకి వెళ్లాలంటే హాయిగా నడిచి వెళ్లేవాళ్లం. చాలా సౌకర్యవంతంగా ఉండేది. టెంపరరీ అన్న పదం వాడేటప్పటికి.. అదంతా పనికిరాదు.. ఆ ఖర్చంతా వృథా అనే అర్థం ప్రజల్లోకి వెళ్లిపోయింది. అలాగే ఒక అప్రోచ్‌ రోడ్డు మీద ప్రధానంగా దృష్టి పెట్టి, విశాలమైన రోడ్డు ఏర్పాటు చేసి ఉంటే.. కరకట్ట మీద నుంచి ఇబ్బందులు పడుతూ చేరకుండా ఉండుంటే ఇంప్రెషన్‌ అంతా మారిపోయేది. ఇక చాలా మంది కావాలనే కోర్టుకు వెళ్లారని కొందరు నాకు చెప్పారు. ఆ వివాదం లేకపోతే అద్భుతంగా ఉండేది.


అసలు సక్సెస్ ను అది పూర్తిగా మరుగుపరిచింది. రూపాయి ఖర్చులేకుండా 30 వేల ఎకరాలు రావడం ప్రపంచ చరిత్రలోనే తొలిసారి. 

అయితే.. అలా చేయడం కాస్ట్‌ ఎఫెక్టివ్‌.

Updated Date - 2022-07-11T08:40:28+05:30 IST