తాగించడంలో తగ్గేదే లేదు

ABN , First Publish Date - 2021-07-31T08:57:29+05:30 IST

అప్పుల ఊబిలో కూరుకుపోయి రూపాయి రూపాయి లెక్కలేసుకుంటున్న వైసీపీ ప్రభుత్వాన్ని మద్యం ఆదుకుంటోంది! నిషేధిస్తామని చెప్పిన మద్యమే ఇప్పుడు సర్కారుకు దిక్కయ్యింది

తాగించడంలో తగ్గేదే లేదు

ప్రతినెలా 2వేల కోట్ల మద్యం అమ్మకాలు

గతంలో నెల సగటు రూ.1600 కోట్లే

అమ్మకాలు పెంచేందుకు సర్కారు చర్యలు

ఇంకా పెంచాలనేదానిపై సమాలోచనలు

కొన్ని నెలలుగా రెట్టింపైన విక్రయాలు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

అప్పుల ఊబిలో కూరుకుపోయి రూపాయి రూపాయి లెక్కలేసుకుంటున్న వైసీపీ ప్రభుత్వాన్ని మద్యం ఆదుకుంటోంది! నిషేధిస్తామని చెప్పిన మద్యమే ఇప్పుడు సర్కారుకు దిక్కయ్యింది. మద్యం అమ్మకాలు క్రమంగా తగ్గిస్తామని చెప్పుకొచ్చిన ప్రభుత్వం ఇప్పుడు రివర్స్‌ గేర్‌ వేసి అమ్మకాలను క్రమంగా పెంచుకుంటూ పోతోంది. మందుబాబులతో మరింత తాగించి కాసిన్ని కాసులు దండుకోవాలని చూస్తోంది. ఇంకా అమ్మకాలు పెంచడానికి కొత్త ఆలోచనలు చెప్పాలంటూ ఇటీవల ఉన్నతాధికారులు మద్యం షాపుల్లో పనిచేసే సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్‌ సలహాలు కోరినట్లుగా ఎక్సైజ్‌లో ప్రచారం సాగుతోంది. గతంలో నెలకు సగటున రూ.1800కోట్లు అమ్మకాలుంటే, కొన్ని నెలలుగా సగటు అమ్మకాలు రూ.2వేల కోట్లపైనే ఉంటున్నాయి. గతేడాది ఆగస్టు వరకు రూ.1600 కోట్లకు అటూ ఇటూగా ఉన్న అమ్మకాలు సెప్టెంబరు నుంచి ఒక్కసారిగా పెరిగిపోయాయి. మద్యం డిపోల నుంచి మద్యం షాపులకు సరఫరా అవుతున్న లెక్కలే ఇందుకు నిదర్శనం. సెప్టెంబరులో రూ.1961 కోట్లు, అక్టోబరులో రూ.2005 కోట్లు, నవంబరులో రూ.1920 కోట్లు, డిసెంబరులో రూ.2293కోట్లు, జనవరిలో రూ.2404 కోట్లు, ఫిబ్రవరిలో రూ.2081కోట్లు, మార్చిలో రూ.2116కోట్లు, ఏప్రిల్‌లో రూ.2006కోట్లు, మేలో రూ.1734కోట్లు, జూన్‌లో రూ.2134కోట్లు, ఈ నెలలో 30వ తేదీ వరకు రూ.2068కోట్ల విలువైన మద్యాన్ని డిపోల నుంచి మద్యం షాపులకు ఎక్సైజ్‌ శాఖ పంపింది. అంటే షాపుల్లో అమ్మకాలు కూడా అటూఇటూగా ఇవే స్థాయిలో ఉంటాయి. గతేడాది ఆగస్టులో 12,64,332 కేసుల లిక్కర్‌, 2,59,781కేసుల బీరును రాష్ట్రంలో అమ్మితే.. ఈ జూన్‌లో 21,25,035 కేసుల లిక్కర్‌, 5,06,350 కేసుల బీరును ప్రభుత్వం విక్రయించింది. అంటే అటు లిక్కర్‌ అమ్మకాలు, ఇటు బీరు అమ్మకాలు దాదాపు రెట్టింపయ్యాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఆ లెక్కలు చెప్పకుండా మద్యం అమ్మకాలు భారీగా తగ్గిపోయాయనే చెబుతోంది. గత ప్రభుత్వం కంటే అమ్మకాలు తగ్గినప్పటికీ.. ఈ ప్రభుత్వంలో గతంలో తగ్గిన అమ్మకాలు ఇటీవల ఎందుకు పెరుగుతున్నాయనే దానిపై మాత్రం వివరణ ఇవ్వడంలేదు. పైగా అమ్మకాలు పెంచే మార్గాలపై దృష్టిపెట్టింది. ప్రభుత్వానికి ఆదాయం కావాలనే మాట నేరుగా చెప్పకుండా అమ్మకాలు పెరగాలి, అందుకోసం తగిన చర్యలు చేపట్టాలంటూ పదే పదే ఉన్నతాధికారులు కిందిస్థాయి యంత్రాంగానికి ఆదేశాలు జారీచేస్తున్నారు. ఓవైపు మద్యంపై వచ్చే ఆదాయం మాకు అవసరమే లేదంటూ సీఎం నుంచి మంత్రుల వరకూ ఊకదంపుడు ప్రసంగాలు చేస్తున్నా ఎక్సైజ్‌ శాఖ అవేం తమకు పట్టవంటూ అమ్మకాలు పెంచేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. గతంలో వివిధ రూపాల్లో ఆదాయం వచ్చే వీలుండటంతో మద్యాన్ని ఓ ఆదాయ వనరుగా చూసేవారు. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి మద్యమే కీలక ఆదాయ వనరుగా మారింది.


ఎంత వీలైతే అంత!

మద్యంపై గరిష్టస్థాయిలో ఆదాయం రాబట్టేందుకు ఎక్సైజ్‌ చర్యలు చేపట్టింది. ఖరీదైన మద్యం విక్రయాల కోసం వినియోగదారుల సౌకర్యార్థం వాక్‌ ఇన్‌ స్టోర్‌ పేరుతో మద్యం మాల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా పర్యాటక ప్రాంతాల్లోనూ మద్యం షాపుల ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. రాత్రి 8 గంటలకు ముగించాల్సిన మద్యం అమ్మకాలను రాత్రి 9 వరకు కచ్చితంగా కొనసాగించాలంటూ షాపుల్లో సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ప్రజలు ప్రభుత్వం అమ్మే మద్యమే కొనుగోలు చేయాలనే లక్ష్యంతో ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌పైనా, నాటుసారాపైనా కఠిన చర్యలు తీసుకుంటోంది. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి మూడు సీసాలు తెచ్చుకునే అవకాశం ఉండగా దాన్ని నేరంగా మార్పులు చేసింది. మొత్తంగా రాష్ట్రంలో ప్రభుత్వ మద్యమే కనిపించాలని, ఆదాయమంతా సర్కారుకే దక్కాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Updated Date - 2021-07-31T08:57:29+05:30 IST