‘గదిలో వివేకా రాసినట్లు లేఖ.. కానీ ఆయన తెలుగులో సంతకం చేయరు..’

ABN , First Publish Date - 2020-02-14T09:40:30+05:30 IST

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు గురై ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు ఈ కేసులో ఒక్క సాక్ష్యాన్ని కూడా పోలీసులు సంపాదించలేక పోయారని పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు.

‘గదిలో వివేకా రాసినట్లు లేఖ.. కానీ ఆయన తెలుగులో సంతకం చేయరు..’

రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదు

వివేకా హత్య కేసుపై హైకోర్టులో సీనియర్‌ న్యాయవాదుల వాదన


అమరావతి, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు గురై ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు ఈ కేసులో ఒక్క సాక్ష్యాన్ని కూడా పోలీసులు సంపాదించలేక పోయారని పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేనందున ఈ కేసును సీబీఐకి, లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సిట్‌కు అప్పగించినా, ఇప్పటి వరకు మూడుమార్లు సిట్‌ను ఏర్పాటు చేశారని...అందువల్ల, దర్యాప్తు సక్రమంగా సాగే అవకాశం లేదని పేర్కొన్నారు. వివేకా హత్య కేసును సీబీఐకి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినా ఫలితం లేకపోయిందన్నారు. పోలీసుల దర్యాప్తు సక్రమంగా జరగడం లేదని భావించిన పక్షంలో కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించవచ్చని గతంలో సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసిందని పేర్కొన్నారు. వివేకా హత్య కేసును సీబీఐకి గానీ, లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు గానీ ఇవ్వాలని కోరుతూ గతంలో వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, నాటి ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అదేవిధంగా వివేకా కుమార్తె డాక్టర్‌ ఎన్‌.సునీత, అల్లుడు ఎన్‌.రాజశేఖర్‌రెడ్డి కూడా ఇదే భావన వ్యక్తం చేస్తూ హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేశారు. వీటిపై గురువారం న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు ముందు విచారణ జరిగింది. సౌభాగ్యమ్మ, సునీతల తరఫున హైకోర్టు సీనియర్‌ న్యాయవాది వీరారెడ్డి, ఆదినారాయణరెడ్డి, బీటెక్‌ రవిల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు ఆర్‌.బసంత్‌, సల్మాన్‌ ఖుర్షీద్‌, జగన్‌ తరఫున వివేక్‌ వాదనలు వినిపించారు. విచారణ ప్రారంభంలోనే జగన్‌ తరఫు న్యాయవాది వాదిస్తూ.. వివేకా హత్యకేసులో గత ప్రభుత్వం సరైన దర్యాప్తు చేయించకపోవడంతో సీబీఐకి ఇవ్వాలని అప్పట్లో జగన్‌ పిటిషన్‌ వేశారని, అయితే, ప్రస్తుతం దర్యాప్తు సక్రమంగా సాగుతున్నందున తమ పిటిషన్‌పై ఎలాంటి ఆదేశాలు అవసరం లేదన్నారు. ఆ మేరకు మెమోను న్యాయమూర్తికి అందించారు. కాగా, వివేకా హత్య కేసును దర్యాప్తు చేసేందుకు తమకెలాంటి అభ్యంతరం లేదని సీబీఐ స్పష్టం చేసింది. 


 వారిపై కేసులు పెట్టలేదేం..?

సునీత తరఫు సీనియర్‌ న్యాయవాది వీరారెడ్డి వాదిస్తూ వివేకా హత్య కేసులో అనేక అనుమానాలున్నాయన్నారు. అప్పట్లో ప్రతిపక్షనేతగా ఉన్న జగన్‌ సీబీఐ విచారణ కోసం హైకోర్టులో పిటిషన్‌ వేశారని తెలిపారు. ఇప్పుడు అదే కేసును సీబీఐకి ఇవ్వాలని వివేకా కుమార్తె ఎన్నిమార్లు కోరినా పట్టించుకోవడం లేదన్నారు. వివేకా మృతదేహం బాత్రూంలో 8 అడుగుల మేర రక్తపు మడుగులో పడి ఉందని, కానీ మంచంపై ఎలాంటి రక్తపు మరకలు లేవన్నారు. అంటే ఎవరో ఆయన్ని బాత్రూంలోకి తీసుకెళ్లారని స్పష్టమవుతోందన్నారు. ఆ రోజు వివేకా మృతదేహం వద్దకు మొదటిగా చేరుకున్నది ఎంపీ వైఎస్‌ అవినా్‌షరెడ్డి ఒక్కరేనని, ఆయన తరువాతే ఒక్కొక్కరుగా బంధువులు వచ్చారని వివరించారు. అయితే ఎవ్వరూ హత్య జరిగిన ప్రదేశానికి రాకుండా తలుపులు మూసేశారని, ఆ సమయంలో అక్కడ ముగ్గురు వైద్యులు, పారా మెడికల్‌ స్టాఫ్‌, సీఐ, ఎస్సైతో పాటు మొత్తం 15 మంది ఉన్నారని తెలిపారు. వారంతా అక్కడున్న రక్తాన్ని శుభ్రం చేసి, గాయాలకు బ్యాండేజ్‌ కట్టి, మృతదేహాన్ని బెడ్‌షీట్లో చుట్టి తొలిగా బెడ్‌పైకి, ఆ తరువాత ఆసుపత్రికి చేర్చారని తెలిపారు. అది హత్యేనని అందరికీ తెలిసే రక్తం శుభ్రం చేయించారని కోర్టుకు తెలిపారు.


‘‘మరి ఈ విషయంలో అందరిపైనా కేసులు పెట్టకుండా కేవలం ముగ్గురిపైనే ఎందుకు కేసు పెట్టారు? మృతదేహం వద్ద నాలుగు లైన్లతో లేఖ దొరికింది. అందులో వివేకా సంతకంగా చెబుతున్నది తెలుగులో ఉంది. ఆయన తెలుగులో సంతకం చేయరు. వివేకా సహాయకుడు శ్రీనివా్‌సరెడ్డి పులివెందుల సమీపంలోని ఓ పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆత్మహత్య చేసుకునేటప్పుడు జగన్‌కు, అవినా్‌షరెడ్డి తండ్రికి లేఖలు రాసినట్లు చెబుతున్నారు. తన భార్యాపిల్లలకు డబ్బు సాయం చేయాలని ఆ లేఖల్లో ఉంది. అతను చనిపోవడానికి గల కారణాలను వీడియో తీసి పంపించాడు. ఆ వీడియోను ఏం చేశారు? ఆ లెటర్లు అతను రాసినవేనా? ఆయన నిజంగా డబ్బు సాయం కోరాడంటే ఈ హత్య కేసులో అతని పాత్ర ఏంటి? అతని ఊపిరితిత్తుల్లో, కడుపులో రక్తం చేరినట్లు పోస్టుమార్టం నివేదిక చెబుతోంది. పురుగుల మందు తాగితే రక్తం చేరదు. ఎవరో బలంగా కొట్టడం వల్లనే రక్తం చేరింది. శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య చేసుకున్నది నిజమే అయితే.. అందుకు కారణం వివేకాకేసు కారణంగానే కదా? మరి ఆ కేసును కూడా సిట్‌కే అప్పగించాలి. కానీ దర్యాప్తును స్థానిక పోలీసులకు ఎందుకు అప్పగించారు? ఇవన్నీ పలు అనుమానాలకు తావిస్తున్నాయి. అందువల్ల నిజం తేల్చేందుకు కేసును సీబీఐకి అప్పగించండి’’ అని న్యాయవాది వీరారెడ్డి అభ్యర్థించారు. 

కాగా, ఆదినారాయణరెడ్డి తరఫు న్యాయవాది ఆర్‌.బసంత్‌ వాదిస్తూ, ఈ కేసులో అమాయకుల్ని ఇరికించే అవకాశం ఉందని పేర్కొన్నారు. బీటెక్‌ రవి తరఫున సల్మాన్‌ ఖుర్షీద్‌ వాదనలు వినిపిస్తూ, ‘‘ఈ హత్య కేసులో బీటెక్‌ రవి కూడా సమన్లు పంపారు. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని రవికి రాజకీయ వైరంలో భాగంగానే ఈ సమన్లు పంపించారు’’ అని ఆరోపించారు. కాగా, ఏజీ వాదనలు వినేందుకు అనువుగా విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు. 

Updated Date - 2020-02-14T09:40:30+05:30 IST