Abn logo
Oct 20 2020 @ 09:37AM

రైల్లో ప్రయాణిస్తున్న దొంగను పట్టుకునేందుకు విమానంలో వెళ్లిన పోలీసులు

Kaakateeya

రూ.1.3కోట్ల బంగారం దోపిడీ 

బెంగళూరు (కర్ణాటక): బెంగళూరులోని ఓ ఇంట్లో రూ.1.3కోట్ల బంగారు ఆభరణాలు దోచుకొని రైల్లో ప్రయాణిస్తున్న దొంగను పట్టుకునేందుకు బెంగళూరు నుంచి కోల్‌కతాకు విమానంలో వెళ్లిన బెంగళూరు పోలీసుల ఉదంతం తాజాగా వెలుగుచూసింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని బుర్ద్వాన్ నగరానికి చెందిన నిందితుడు బెంగళూరులోని ఒక బిల్డరు ఇంట్లో పని చేసేవాడు. తన యజమాని కుటుంబసభ్యుల్లో ఒకరు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇదే అదనుగా తీసుకున్న పనివాడు ఇంట్లోని ఎలక్ట్రిక్ లాకరులో ఉన్న 1.3 కోట్ల రూపాయల బంగారు ఆభరణాలను దోచుకొని పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని హౌరాకు వెళ్లే రైలు ఎక్కాడు. బిల్డరు ఫిర్యాదు మేర కేసు నమోదు చేసుకున్న పోలీసులు యశ్వంత్ పూర్ రైల్వేస్టేషనులో సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా నిందితుడు హౌరా వెళ్లే రైలు ఎక్కాడని తేలింది. 

దొంగ 1.3కోట్ల విలువైన చోరీ సొత్తుతో రైలులో ప్రయాణిస్తుండగా బెంగళూరు పోలీసులు అతన్ని పట్టుకునేందుకు విమానంలో అతనికంటే ముందే కోల్ కతాకు చేరుకున్నారు. రైలు కోల్ కతా రైల్వేస్టేషనుకు రాగానే కాపు కాసిన బెంగళూరు పోలీసులు దొంగను పట్టుకున్నారు. విలువైన ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్టు చేశారు.  

Advertisement
Advertisement