‘సన్న’బడిన రైతాంగం!

ABN , First Publish Date - 2020-12-04T08:21:07+05:30 IST

సన్నరకాల వరిసాగు అన్నదాత కొంప ముంచింది. తక్కువలో తక్కువగా ఎకరానికి 10 క్వింటాళ్ల చొప్పున దిగుబడిలో కోత

‘సన్న’బడిన రైతాంగం!

సన్నాలసాగుతో రూ. 6,500 కోట్ల నష్టం..

ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి తగ్గుదల

నిరుడు ఎకరానికి 25 క్వింటాళ్లు,  ఈసారి 15 క్వింటాళ్లే!

ష్ట్రవ్యాప్తంగా 34.45 లక్షల  టన్నుల దిగుబడి కోత

హైదరాబాద్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): సన్నరకాల వరిసాగు అన్నదాత కొంప ముంచింది. తక్కువలో తక్కువగా ఎకరానికి 10 క్వింటాళ్ల చొప్పున దిగుబడిలో కోత పడింది. నిరుడు వానాకాలం సీజన్‌లో సన్న ధాన్యం ఎకరానికి 25 క్వింటాళ్ల దిగుబడి రాగా... ఇప్పుడు కేవలం 15 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తోంది. అధిక వర్షాలు, చీడపీడలు, మాయరోగాలతో సన్నరకం వరి పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలమేరకు సన్నరకాలు సాగుచేసిన రైతులు నష్టాలను మూటగట్టుకున్నారు. గరిష్ఠ మద్దతు ధర ప్రకారం లెక్కేసుకున్నా.. రైతులు ఎకరానికి రూ. 18,800 చొప్పున రైతులు నష్టపోతున్నారు. 



వానల్లో కొట్టుకుపోయిన రైతు ఆశలు

ఈ వానాకాలం సీజన్‌లో రైతులు 52.78 లక్షల ఎకరాల్లో సాగుచేశారు. వీటిలో దొడ్డురకాన్ని కేవలం 13.33 లక్షల ఎకరాల్లో సాగుచేశారు. గత ఏడాది వరకూ రాష్ట్రంలో దొడ్డురకాల వరి సాగు 60 శాతానికి పైగా ఉండగా.. సన్నాల సాగు మాత్రం 40 శాతానికి మించేది కాదు. కానీ ఈ ఏడాది ముఖ్యమంత్రి నియంత్రిత సాగు పిలుపునకు పెద్ద ఎత్తున స్పందించిన ప్రజలు, భారీగా సన్నాలను సాగు చేశారు. సన్నాలను సాగు చేయకపోతే రైతు బంధు కూడా ఇచ్చేది లేదని అధికారులు ఒత్తిడి చేయడంతో అన్యమనస్కంగా సన్నాలను సాగు చేసినవారూ ఉన్నారు.


మొత్తంగా.. రైతాంగం సన్నాలకు మళ్లడంతో ఈ రకం వరి సాగు ఒక్కసారిగా 34.45 లక్షల ఎకరాలకు చేరుకుంది. ఈ ఏడాది వర్షాకాల ఆరంభంలో నైరుతి రుతుపవనాలు సహకరించటం, వర్షాలు సకాలంలో పడటంతో అంతా బాగుంటుందని రైతులు ఆశించారు. కానీ ఆ ఆశలు ఎంతోకాలం నిలవలేదు. తుఫాన్లు, వాయుగుండాల ప్రభావంతో వర్షాలు రైతుల ఆనందాన్ని ముంచేశాయి. రికార్డు స్థాయిలో వానలు, వరదలు రావటంతో వ్యవసాయరంగం కుప్పకూలిపోయింది. సన్న రకం వరి పంటలపై ప్రభావం తీవ్రంగా పడింది.

వేలాది ఎకరాల్లో వరిచేలు నీట మునిగాయి. వానలు తగ్గీ తగ్గగానే చీడపీడలు, పంటరోగాలు దాడి చేశాయి. దొడ్డురకం వరి పంట సాధారణంగా చీడపీడలను తట్టుకొని నిలబడుతుంది. కానీ సన్నరకం అలా కాదు. సున్నితంగా ఉండే ఈ రకం పంట, చీడపీడలను తట్టుకుని బలంగా నిలవలేదు.


10 క్వింటాళ్లు తగ్గిన దిగుబడి

దొడ్డురకాలైతే ఎకరానికి సగటున 28 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. సన్నరకాలైతే 3 క్వింటాళ్లు తక్కువగా... 25 క్వింటాళ్ల వరకు వస్తుంది. ఈ వానాకాలంలో ప్రకృతి కన్నెర్ర కారణంగా 15 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. దీంతో ఎకరానికి 10 క్వింటాళ్ల మేర దిగుబడిని రైతులు నష్టపోవాల్సి వచ్చింది. దొడ్డు రకంతో పోలిస్తే.. సన్నాలకు పెట్టుబడి నాలుగైదు వేలు ఎక్కువగానే ఉంది. అక్కడా రైతుకు నష్టమే జరిగింది.

దొడ్డు రకాలకంటే సన్నరకాలు 15 రోజులు ఆలస్యంగా కోతలకు వస్తాయి. పక్షం రోజులు ఎక్కువగా పంటను సాకడం కూడా రైతులకు ఇబ్బందిగా మారింది. ఎకరానికి సగటున 10 క్వింటాళ్ల దిగుబడి తగ్గటంతో.. రాష్ట్రవ్యాప్తంగా 34.45 లక్షల ఎకరాలకు 34.45 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్న ధాన్యం దిగుబడి తగ్గిపోయింది. 


రైతాంగానికి రూ. 6,500 కోట్ల నష్టం

సన్నధాన్యం ఉత్పత్తి 34.45 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర తగ్గింది. కనీస మద్దతు ధర ప్రకారం... క్వింటాలుకు రూ. 1888 చొప్పున లెక్కేసినా సన్నరకాల వరిసాగు చేసిన రైతులు రూ. 6,500 కోట్లు నష్టపోతున్నారు. ఎకరానికి రూ. 30 వేల నుంచి రూ. 35 వేల పెట్టుబడి పెడితే... 15 క్వింటాళ్ల దిగుబడి చొప్పున రైతులకు రూ. 28,320 మాత్రమే ఆదాయం వస్తోంది. అంటే.. పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి వచ్చే పరిస్థితి లేదు.

సన్నాలకు క్వింటాలుకు రూ. 100 నుంచి రూ. 150 మేర ఎక్కువ ఇస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించి నెల రోజులు దాటింది. ఇంతవరకు ఆ హామీ కార్యరూపం దాల్చలేదు.


తెలంగాణ సోనాది అదే పరిస్థితి

రాష్ట్రవ్యాప్తంగా 34.45 లక్షల ఎకరాల సన్నరకాల్లో... 10 లక్షల ఎకరాల్లో ‘తెలంగాణ సోనా’(ఆర్‌ఎన్‌ఆర్‌- 15048) సాగుచేశారు. ఈ రకం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ప్రచారం చేశారు. అసెంబ్లీలో తెలంగాణ సోనా గొప్పతనాన్ని కొనియాడారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మంచి ఆహారమని చెప్పారు.

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులకు లక్ష్యాలు నిర్దేశించి మరీ తెలంగాణ సోనా రకాన్ని రైతులతో సాగుచేయించేలా చేశారు. ఇతర సన్నాలతో పాటు ఈ రకం కూడా ఈ ఏడాది దెబ్బతింది. దిగుబడి ఎకరానికి 15 క్వింటాళ్లకు మించి రాలేదు. ఎకరానికి 10 క్వింటాళ్ల చొప్పున దిగుబడిని, సుమారు రూ. 20 వేల ఆదాయాన్ని రైతులు కోల్పోయారు.




పెట్టుబడి రూ. 20 వేలు పెరిగింది

నాలుగు ఎకరాల్లో సన్న రకం వరి సాగుచేశాను. వర్షాలు బాగా దెబ్బతీశాయి. పంట కోలుకోవటానికి పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సి వచ్చింది. నిరుడు ఎకరానికి రూ. 25 వేల చొప్పున నాలుగెకరాలకు కలిపి రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టాను. ఈసారి రూ. 30 వేల చొప్పున రూ. 1.20 లక్షలు అయ్యింది. కేవలం 60 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. నిరుడు ఇదే పొలంలో 100 క్వింటాళ్ల వరి ధాన్యం దిగుబడి వచ్చింది. ఈ సీజన్లో 40 క్వింటాళ్ల నష్టం కలిగింది.

- పరిగి సుధాకర్‌రెడ్డి, రైతు, నారాయణపేట్‌ జిల్లా




ఎకరానికి 15 క్వింటాళ్లే దిగుబడి

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో నాకు 12 ఎకరాల పొలం ఉంది. ప్రభుత్వ సూచనతో 6 ఎకరాల్లో తెలంగాణ సోనా, మరో 6 ఎకరాల్లో ఇతర బీపీటీ రకాలు సాగుచేశా. రూ.3.60 లక్షలు పెట్టుబడి పెట్టినప్పటికీ వాతావరణం అనుకూలించలేదు. వర్షాలు, చీడపీడల దెబ్బకు దిగుబడి 12 ఎకరాల్లో కేవలం 180 క్వింటాళ్లకు పడిపోయింది. నిరుడు ఇదే పొలంలో 300 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది.

- నిట్టు రాజేశ్వర్‌రావు, రైతు, కామారెడ్డి జిల్లా


Updated Date - 2020-12-04T08:21:07+05:30 IST