ఇదీ ఉభయతారక జల విధానం

ABN , First Publish Date - 2021-09-03T06:29:04+05:30 IST

ఉభయ తెలుగురాష్ట్రాల మధ్య కృష్ణానదీ జలాల వినియోగంలో తల ఎత్తిన వివాదాలు ఇప్పటిదాకా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల నిర్వాకాలపై చర్చకు దారితీస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రానికి గతంలో కేటాయించిన...

ఇదీ ఉభయతారక జల విధానం

ఉభయ తెలుగురాష్ట్రాల మధ్య కృష్ణానదీ జలాల వినియోగంలో తల ఎత్తిన వివాదాలు ఇప్పటిదాకా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల నిర్వాకాలపై చర్చకు దారితీస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రానికి గతంలో కేటాయించిన 1005 టీఎంసీలను రెండు రాష్ట్రాల మధ్య పంచడానికి (గడువు పొడిగించబడిన) బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు ఏడేళ్ళ వ్యవధి కూడా సరిపోలేదు! ఉభయరాష్ట్రాలూ అవే నీళ్లను అపెక్స్ కౌన్సిల్ వేదికగానైనా తాత్కాలిక ప్రాతిపదికన పంచుకుని వాడుకోవాల్సి ఉండగా ఒక్క మొదటి సంవత్సరంలో మినహా అవి ఒక సయోధ్యకు ఎన్నడూ రాలేదు. ఓ లెక్కా పత్రం లేకుండా, మరో రాష్ట్రానికి తెలియకుండా అందినకాడికి నీళ్లను వినియోగించుకోవచ్చని ఎవరి ప్రయత్నంలో వారున్నారు. ఈ వ్యూహాన్ని ఆచరణలో పెట్టడంలో ఆంధ్రప్రదేశ్ దూకుడుతో ఉండగా, తెలంగాణ నత్తనడక నడిచింది. తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యంతో దక్షిణ తెలంగాణవైపు నిర్మాణాల వేగం మందగించింది గానీ అటువంటి అభ్యంతరకర విధానానికి ప్రభుత్వ వైఖరి సూత్రప్రాయంగా వ్యతిరేకమేమీ కాదు. దానివల్ల అనివార్యంగా తలెత్తగల వివాదం పరిధిని పెంచుకుని కేంద్రం అనే కొత్త పార్టీని రంగంలోకి దించింది. రెండు రాష్ట్రాలు పరస్పర ఆరోపణలతో తన దగ్గరికి రావడమే అదనుగా కేంద్రం మొత్తం కృష్ణా నదిపై అధికారం తనదే అన్నట్టు వ్యవహారాన్నంతా తన పరిధిలోకి తీసుకున్నది. ఈ మేరకు జూలై 15న ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్రం మొత్తం నదిని తన స్వాధీనంలోకి తీసుకోబోతున్నది. రెండు రాష్ట్రాల్లో కృష్ణానదిపై ఏ ప్రాజెక్టులు ఉండాలి, ఏ ప్రాజెక్టులు ఉండకూడదు, వాటికి ఎప్పుడు, ఎంత నీళ్ళు ఇవ్వాలనేది బోర్డుల (కృష్ణనదిపై ‘కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు’, గోదావరి నదిపై ‘గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు’) ద్వారా తానే నిర్ణయిస్తానని పేర్కొంది. ఆ బోర్డుల్లో ఈ రెండు రాష్ట్రాల నుంచి ఇంజనీరింగ్ అధికారులు గాని, పరిపాలన అధికారులు గానీ ఎవరూ ఉండరు. ఆ బోర్డు అనుమతిస్తే తప్ప కృష్ణానదిపై రెండు రాష్ట్రాలూ ఒక కొత్త ప్రాజెక్టు ఊహ కూడా చేయలేవు. అలాగే, అనుమతుల్లేకుండా రెండువైపులా నిర్మాణమైన, అవుతున్న ప్రాజెక్టులకు రాష్ట్రాలు ఆరునెలల్లో అనుమతులు తెచ్చుకోగలిగితేనే కృష్ణా బోర్డు కొనసాగింపునకు వాటి ఒప్పుకుంటుంది. లేదంటే అవన్నీ ఆ తర్వాత నిష్ఫలంగా మిగిలిపోతాయి. 


కొత్తబోర్డు నిబంధనల ప్రకారం అనుమతులు లేని ప్రాజెక్టులకు ఆరునెలల్లోగా అన్ని అనుమతులు తీసుకోవడం సాధ్యమయ్యే వ్యవహారం కాదు. అన్ని అనుమతుల్లోకెల్లా ప్రధానమైనది ఆయా ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఉన్నట్లు చూపించడం. అయితే ఆ కేటాయింపుల విషయంలో ఇంకా బ్రిజేష్ ట్రిబ్యునల్ విచారణే నడుస్తున్నది. నీటి వాటాలే తేలలేదు. తేలినా బ్రిజేష్ ట్రిబ్యునల్ విచారణ పద్ధతిపై సుప్రీంకోర్టులో కేసు ఉంది. అది ముగియకుండా ట్రిబ్యునల్ అవార్డు అమలు కాదు. ఒకవేళ అమలయినా అందులో పై ప్రాజెక్టుల్లో వేటికీ మరి కేటాయింపులు లేవు. నీటి కేటాయింపులే లేని వాటికి ఏం అనుమతులు వస్తాయి? నిర్మాణాలు పూర్తయి, ఆపరేషన్‌లో ఉండి కూడా అనుమతులు లేనివిగా చూపించబడిన తెలంగాణ వైపు కల్వకుర్తి, నెట్టెంపాడు; ఏపీ వైపు గాలేరు నగరి, హంద్రీనీవా, వెలిగొండ, తెలుగుగంగ ఆగిపోబోతున్నాయి. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేపే నీళ్లు వస్తాయన్నట్టు అట్టహాసంగా ప్రకటించి నిర్మాణాల్ని నత్తనడక నడిపిస్తున్న పాలమూరు-– రంగారెడ్డి, పాలమూరు–డిండి, ఎస్సెల్బీసీల భవిష్యత్తు ఆగమ్యగోచరం కాబోతోంది. తాతల నాటి నుంచి మొదలైన ప్రాజెక్టులకే నీళ్ళు దిక్కు లేదు కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం జోగులాంబ బ్యారేజ్, పులిచింతలకు, సుంకేసులకు ఎడమ కాల్వలు సాధిస్తామంటూ కొత్త ప్రాజెక్టులపై ఆశలు రేపుతున్నారు. వీటిలో కొన్ని అవసరమైనవే అయినా ఆచరణకు అంతగా సాధ్యమయ్యేవి కావు. అలాగే అవి ‘ప్రత్యర్థి’ని కంగారు పెట్టడానికే తప్ప తెలంగాణ ప్రభుత్వం చిత్తశద్ధితో చేసే ప్రతిపాదననలు కావు. ఒకవైపు బోర్డు పేరుతో కేంద్రం కృష్ణానదిని కబ్జా చేస్తూ రెండు రాష్ట్రాల ప్రజల కలల్ని, భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీమ ప్రాజెక్టులకు, సమాఖ్య స్పూర్తికి వ్యతిరేకంగా ఉన్న కొత్తబోర్డును దాదాపుగా ఆహ్వానిస్తూ వివాదాస్పద వైఖరి తీసుకున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం దక్షిణ తెలంగాణ వైపు అవసరమైన నిర్మాణాలను పూర్తి చేయలేదు, బోర్డునూ గట్టిగా వ్యతిరేకించడం లేదు. ఈ అనిశ్చిత పరిస్థితుల్లో కృష్ణానదిపై ఆశలు పెట్టుకున్న దక్షిణ తెలంగాణ, రాయలసీమ ప్రజల భవిష్యత్తు అంధకారంగా మారేలా ఉంది. కాబట్టి ఈ కొత్త బోర్డును రెండు రాష్ట్రాలూ నిర్ద్వంద్వంగా వ్యతిరేకించాలి. 


పునర్విభజన చట్ట నిబంధనలకు లోబడి మాత్రమే నీటిని పంచగల బ్రిజేష్ ట్రిబ్యునల్ కాకుండా కొత్తగా ట్రిబ్యునల్ వేయాలని 2015 నుంచే తెలంగాణ ప్రభుత్వం అడుగుతున్నది. ఇప్పుడా అభ్యర్థనను కేంద్రం పరిశీలిస్తున్నది కూడా. పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రాన్ని తెచ్చుకుని అదే చట్టంలోని పాత ప్రాజెక్టులకు నీళ్లు తగ్గించకూడదనే నిబంధనను ఒప్పుకోమనడం తెలంగాణా వాదులది, ప్రత్యేకించి అధికారం పొందిన వారిది అసంబద్ధ వాదనగా అనిపించవచ్చు. కానీ, తెలంగాణ ప్రజలకు మరో మార్గం లేదనే విషయాన్ని ఏపీ ప్రజలు, మేధావులు అర్థం చేసుకోవాలి. అలాగే ఆ నిబంధన శాశ్వతం కాదనేది కూడా సత్యమే. కొత్త ట్రిబ్యునల్ ఏర్పడి దాని అవార్డు రావాలంటే ఇంకా కొన్నేళ్ళు పడుతుంది. అలా చూసినా ఆ నిబంధన ఒక దశాబ్దం పైనే అమలయినట్టు లెక్క. అలాగే రాయలసీమ అవసరాలను తీర్చాలన్నా ఆ నిబంధన అడ్డం వస్తుంది. 


ఈ పరిస్థితుల్లో ఉభయ తెలుగురాష్ట్రాలు ఆచరణాత్మకంగా ఆలోచించాలి. రెండు రాష్ట్రాల విధాన నిర్ణేతల్లో హ్రస్వ దృష్టి కాక, దూరదృష్టి ఉండాలి. ఎటువంటి ఒప్పందాలు చేసుకోకుండా లేదా ఏదో ఒక దానికి సరే అంటూ, క్షేత్రంలో అంతా మాదే అనే నీతిబాహ్యత మొదటికే మోసం చేస్తుంది. ఎవరైనా అనేక మంది ఇతర వ్యక్తుల్ని మోసం చేయవచ్చేమో కానీ ఒక రాష్ట్రం మరో రాష్ట్రాన్ని మోసం చేయలేదు, దౌర్జన్యం అంతకన్నా చేయలేదు. కాబట్టి రెండు రాష్ట్రాలూ పరస్పరం పొరుగురాష్ట్రంతో ప్రజాస్వామిక వైఖరితో ఉండాలి. తమ ప్రజల అవసరాల కోసం ఒక ఉత్తమ జల విధానాన్ని ప్రకటించాలి. ఆ విధానంలో కింది సూత్రాలు, అంశాలు ఉండాలి: 


రెండు తెలుగు రాష్ట్రాలూ సోదరభావంతో కూర్చుని ఇరువైపులా ఏ ప్రాజెక్టుకూ నీళ్లు ఆగిపోకుండా, సముద్రంలోకి వెళ్ళనవసరం లేని నీళ్లను తమ మధ్యనే తాత్కాలిక ప్రాతిపదికన, హేతుబద్దంగా పంచుకుని పాతబోర్డు మధ్యవర్తిగా ఒప్పందాన్ని అమలు చేసుకోవాలి. ఏ రాష్ట్రమైనా పొరుగు రాష్ట్రాలతో, రాజ్యాంగసంస్థలతో చట్టబద్ధంగా, చేసుకున్న ఒప్పందాలకు లోబడి, పారదర్శకంగా వ్యవహరించాలి. తమకు న్యాయం జరగడం లేదని భావిస్తే కూడా పరిష్కారాలకు ప్రజాస్వామిక మార్గాల్నే ఎంచుకోవాలి; కేంద్రానికి న్యాయనిర్ణాయక అధికారమే కానీ రాష్ట్రాల హక్కులను తొలగించి పెత్తనం చేసే అధికారం లేదు. తనకు లేని అధికారాన్ని ప్రదర్శిస్తూ జూలై 15న ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌ను, కేంద్రప్రభుత్వ వైఖరిని నిర్ద్వంద్వంగా వ్యతిరేకించాలి. పొడిగించబడిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కాకుండా రెండు రాష్ట్రాల మధ్య పూర్తిస్థాయి అధికారాలతో కేంద్రం అత్యవసరంగా ఒక కొత్త ట్రిబ్యునల్‌ను వేసి సాధ్యమైనంత తొందరగా నీటి వాటాలు పంచితేనే ప్రధాన సమస్య పరిష్కారమవుతుంది. కొత్త ట్రిబ్యునల్ రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు జరిపేటప్పుడు ప్రాజెక్టులవారీగా కాకుండా నదిపై ఆధారపడ్డ కరువుప్రాంతాలు, నదిపై హక్కు కలిగిన ప్రాంతాలు, ప్రత్యామ్నాయ నీటివనరులు కలిగిన ప్రాంతాలు వంటి అంశాల ప్రాతిపదికనే నీటి పంపకాలు చేయాలి. గోదావరి నీళ్లను కృష్ణానదికి తరలించినప్పుడు ఎగువ రాష్ట్రాలకు వాటాలు ఇవ్వాల్సివస్తున్నది. వాటాలు తీసుకునే రాష్ట్రాలు నీటి తరలింపు ప్రాజెక్టులకయ్యే ఖర్చును కూడా భరించాలి. నీటి పంపకాలు రెండు రాష్ట్రాల మధ్య పూర్తయిన తర్వాత వారి వారి వాటాల మేరకే నదీజలాలను అందించడానికి రాజకీయ జోక్యం లేని, భాగస్వామ్య రాష్ట్రాల ప్రాతినిధ్యంతో కూడిన నదీ యాజమాన్య బోర్డులను ఏర్పాటు చేయాలి. రెండు రాష్ట్రాలూ వాటికి కేటాయించిన నీటిని బోర్డు ద్వారా ఎప్పుడైనా, ఏ ప్రాజెక్టు ద్వారా నైనా వాడుకునే స్వేచ్ఛను కలిగి ఉండాలి. నీటిపారుదల రంగంలో ప్రాంతీయ అసమానతలకు అవకాశం లేకుండా సాగు నీటిని పొందే హక్కు అన్ని జిల్లాలకూ ఉండాలి. నీటిపారుదల అంటే భారీ ప్రాజెక్టులు అనే అవగాహన ప్రమాదకరం. మైనర్ ఇరిగేషన్‌ని గరిష్ఠంగా ఉపయోగించుకోవాలి. చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలే కాకుండా వ్యవసాయక్షేత్రాల్లో నీటి నిల్వలను పెంచే విధానాలూ చాలా అవసరం. ప్రభుత్వాలు సమాజంలో నీటి యాజమాన్య పద్ధతుల పట్ల అవగాహనను పెంచాలి. నీటివనరు సహజస్థానం నుంచి వినియోగస్థానం వరకు రావడానికి అయ్యే ఖర్చను వివరిస్తూ నీటి వృథాను అరికట్టే పద్ధతులు అలవాటు చేయాలి. ప్రతి ప్రాజెక్టు వెనుక వేలాది కుటుంబాల కన్నీళ్ల ప్రవాహం ఉంటున్నది. నిర్వాసితులెవరికీ సెంటిమెంటు బాధను పూడ్చలేము. అది తప్ప పునరావాసంలో వారు గతం కంటే రెట్టింపు ఆర్థికస్థితితో బతకగలిగే ఉపాధి అవకాశాలు కల్పించడాన్ని ఒక నియమంగా ప్రభుత్వాలు పెట్టుకోవాలి. అందుకోసం భూమిని కోల్పోయేవారికి, భూమి లేని కుటుంబాలకు కమాండ్ ప్రాంతం లేదా వారు కోరుకున్న గ్రామంలో భూమిని కొని ఇవ్వాలి. ప్రాజెక్టు కోసం సేకరించే భూమిలో పునరావాసానికి అవసరమయిన భూమిని కూడా కలిపి సేకరించాలి. భూమితో పాటు ఎన్ని ఉపాధి అవకాశాలను కల్పించగలిగితే అన్నిటిని కల్పించాలి. అవన్నీ ప్రాజెక్టు నిర్మాణ ఖర్చులో భాగంగా ఉండాలి.

డా. ఎస్ తిరుపతయ్య

మానవహక్కుల వేదిక

Updated Date - 2021-09-03T06:29:04+05:30 IST