పత్రికా స్వేచ్ఛకు ఇది ప్రమాద కాలం

ABN , First Publish Date - 2020-06-20T05:47:06+05:30 IST

అత్యవసర పరిస్థితి అనంతరం మరెన్నడూ లేనివిధంగా ఇప్పుడు భారతీయ పత్రికారంగం తక్కువ స్వాతంత్ర్యంతో ఉన్నది. కరోనా కాలంలో ప్రభుత్వ బెదిరింపులు, వేధింపులకు మరింత ఎక్కువగా లోనవుతున్నది.

పత్రికా స్వేచ్ఛకు ఇది ప్రమాద కాలం

అత్యవసర పరిస్థితి అనంతరం మరెన్నడూ లేనివిధంగా ఇప్పుడు భారతీయ పత్రికారంగం తక్కువ స్వాతంత్ర్యంతో ఉన్నది. కరోనా కాలంలో ప్రభుత్వ బెదిరింపులు, వేధింపులకు మరింత ఎక్కువగా లోనవుతున్నది. రాజా రామ్ మోహన్ రాయ్ నేడు సజీవంగా ఉన్నట్లయితే అధికారంలో ఉన్నవారికి తప్పకుండా ఒక విజ్ఞాపన పత్రం రాసేవారు. బహుశా, ఆయనపై పలు ఆరోపణలతో ఎఫ్ఐఆర్ దాఖలు అయివుండేదేమో?!


ఈస్టిండియా కంపెనీ ఆధ్వర్యంలోని బెంగాల్ ప్రభుత్వం 1824లో పత్రికా స్వాతంత్ర్యంపై తీవ్ర ఆంక్షలు విధిస్తూ ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. ఎటువంటి వివరణ ఇవ్వనవసరంలేకుండానే ఒక వార్తా పత్రిక లైసెన్స్ రద్దుచేసే అధికారాన్ని ప్రభుత్వానికి ఆ ఆర్డినెన్స్ దఖలుపరిచింది. 


కలకత్తా విద్యావంతులను, ఇంగ్లీషు, బెంగాలీ భాషల్లో పత్రికలు ప్రచురిస్తున్న వారిని ఆ ఆర్డినెన్స్ తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఆర్డినెన్స్ రద్దుచేయమని కోరుతూ రాజా రామ్ మోహన్ రాయ్ ఒక విజ్ఞాపనపత్రాన్ని రూపొందించారు. ఆ వినతిపత్రంలో రాయ్ ఇలా పేర్కొన్నారు: ‘ప్రజలను ఎంత ఎక్కువ అజ్ఞానాంధకారంలో ఉంచితే, పరిపాలకులు అంత అధికంగా ప్రయోజనాలను పొందుతారని ఆసియా దేశాల రాజులు, చక్రవర్తులు విశ్వసిస్తారు. అదే రాజనీతిని మీరు అనుసరించవద్దు’. కొత్త పాలకులు తమ పూర్వపాలకుల కంటే మరింత విశాల దృక్పథంతో వ్యవహరించగలరనే ఆశాభావాన్ని రామ్ మోహన్ వ్యక్తం చేశారు. ‘మానవ స్వభావంలోని బలహీనతల గురించిన అవగాహన ఉన్న పాలకుడు సామ్రాజ్య వ్యవహారాలను నిర్వహించడంలో సహజంగా జరిగే పొరపాట్ల విషయమై అప్రమత్తంగా ఉండాలి. కనుక పాలనలో లోపాల గురించి తన దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ నివ్వాలి. ఇందుకు పత్రికలు, పుస్తకాల ప్రచురణకు నిర్నిబంధమైన స్వేచ్ఛనివ్వడమే ఏకైక మార్గం’ అని రామ్ మోహన్ రాయ్ పేర్కొన్నారు. సుపరిపాలన సుసాధ్యం కావాలంటే సమాచారం స్వేచ్ఛగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండితీరాలని ఆ ఉదారవాది వాదించారు. 19 వ శతాబ్దికి చెందిన ఈ ఉదారవాది వాదనలు 20 వశతాబ్దంలో ఆయన మేధో వారసుడు అమర్త్య సేన్ వాదనలను పోలి వుండడం గమనార్హం. నియంతృత్వ వ్యవస్థలలో కంటే ప్రజాస్వామ్య సమాజాలలో కరువులు, కాటకాలు తక్కువగా సంభవించేందుకు అవకాశమున్నదని అమర్త్యసేన్ తన ‘పావర్టీ అండ్ ఫామిన్స్’ (1977) అన్న పుస్తకంలో వాదించారు. కారణమేమిటి? ఏ ప్రాంతంలో దుర్భిక్షం నెలకొన్నా దాని గురించి వెన్వెంటనే పత్రికలలో వార్తలు రావడం ప్రజాస్వామ్య సమాజాలలో పరిపాటి అని, ప్రభుత్వాలు తక్షణమే ఆ వార్తలకు ప్రతిస్పందించి సంబంధిత ప్రాంతాలకు ఆహార పదార్థాలను సరఫరా చేస్తుందని సేన్ పేర్కొన్నారు. క్రింది స్థాయి అధికారులు కరువు పరిస్థితుల గురించి బీజింగ్ లోని తమపై నాయకులకు తెలియజేసేందుకు భయపడినందునే కమ్యూనిస్టు చైనా 1960 దశకంలో తీవ్ర కరువుకాటకాల నెదుర్కొందని సేన్ వివరించారు.


కొవిడ్ సంక్షోభ సందర్భంలో రామ్ మోహన్ రాయ్, అమర్త్యసేన్ మాటల ఉపయుక్తత ఎంతైనా ఉన్నది. కరోనా మహమ్మారిని శీఘ్రగతిన, సమర్థంగా అదుపు చేసేందుకు స్వేచ్ఛాయుత పత్రికారంగం విశేషంగా ఉపయోగపడుతుందన్న వాస్తవాన్ని విస్మరించి ప్రభుత్వాలు పాత్రికేయుల పట్ల శత్రుభావంతో వ్యవహరిస్తున్నాయి. 

కరోనా సంక్షోభ వేళ ఆసియాదేశాలలో పత్రికా స్వాతంత్ర్యం పై కఠిన ఆంక్షలు విధించడం పట్ల ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హై కమిషనర్ ఇటీవల తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారిని అదుపు చేయడంలో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుతెన్నులను విమర్శించినందుకు భారత్‌లో పలువురు పాత్రికేయుపై తీవ్ర చర్యలు చేపట్టాయని ఆ నివేదికలో పేర్కొన్నారు. ‘ఈ అనిశ్చిత, సంక్షోభ కాలంలో వైద్య వృత్తి నిపుణులు, పాత్రికేయులు, మానవ హక్కుల పరిరక్షకులు, ప్రజలు తమ భావాలు, అభిప్రాయాలు స్వేచ్ఛగా వ్యక్తం చేసేందుకు అనుమతించాలి. ఆరోగ్యభద్రత, సహాయ సామగ్రి పంపిణీ, ఇంకా సామాజిక, ఆర్థిక సంక్షోభ అంశాలపై ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం’ అని ఆ నివేదిక పేర్కొంది. 


మరి ఈ వివేక వాణిని న్యూఢిల్లీ, రాష్ట్ర రాజధానులలోని పాలకులు ఆలకిస్తున్నారా? కరోనా మహమ్మారి సృష్టిస్తున్న బీభత్సం గురించి వార్తలు రాసినందుకు ప్రభుత్వాలనుంచి, రాజకీయనాయకుల నుంచి వేధింపులు, బెదిరింపులనెదుర్కొన్న 55 మంది పాత్రికేయుల విషయమై ఢిల్లీలోని ‘రైట్స్ అండ్ రిస్క్స్ ఎనాలిసిస్ గ్రూప్’ అనే సంస్థ ఇటీవల ఒక నివేదిక వెలువరించింది. ఆ 55 మంది జర్నలిస్టులనూ అరెస్ట్ చేసి వారికి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్‌లు దాఖలుచేశారు. తద్వారా ప్రభుత్వం పాత్రికేయలోకానికి ‘మౌనంగా ఉండండి లేదా మాకు అనుకూలంగా వ్యవహరించండి, లేదంటే మీకూ ఇదే గతి పడుతుందని’ హెచ్చరిక పంపింది. 


ఈ 55 కేసులలో 11 ఉత్తరప్రదేశ్ (బిజెపి పాలిత), ఆరు జమ్మూ -కశ్మీర్‌ (కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పాలన), ఐదు హిమాచల్ ప్రదేశ్ (బిజెపి పాలిత) లో చోటుచేసుకున్నాయి. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న తమిళనాడు, బెంగాల్, ఒడిషా, మహారాష్ట్రలో కూడా నాలుగు చొప్పున ఈ కేసులు చోటు చేసుకున్నాయి. ఈ 55 మంది పాత్రికేయులపైన దేశ ద్రోహం, వివిధ మత వర్గాల మధ్య వైషమ్యాలను పెంచడం, తప్పుడు సమాచారం, ఇతరులను అవమానించడం ద్వారా శాంతి భద్రతలను భగ్నం చేసేందుకు ప్రయత్నించడం, వివిధ వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం ఇత్యాది అభియోగాలు మోపారు. ఇవే నిబంధనల కింద ఒకప్పుడు వలసపాలకులు పాత్రికేయ-దేశభక్తులు బాల గంగాధర తిలక్, మహాత్మా గాంధీలని జైలు పాలుచేశారు. లాక్‌డౌన్ రోజుల్లో వారణాసిలో పేద ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపై సవివర కథనాలు రాసిన ‘స్క్రోల్.ఇన్’ (వెబ్‌సైట్ ) జర్నలిస్టుపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎఫ్ ఐఆర్ దాఖలు చేసినట్టు శుక్రవారం ఉదయం ఈ వ్యాసం రాస్తున్న సమయంలో వార్తలు వెలువడ్డాయి. 


ప్రధానమంత్రి నరేంద్రమోదీ నియోజకవర్గం వారణాసి. ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న చోటే సత్యాన్ని ఇలా అణచివేస్తున్నప్పుడు రామ్ మోహన్ రాయ్ మాటలు గుర్తుకురాకుండా ఎలా ఉంటాయి? ‘నిరంకుశ ప్రభుత్వాలు ఎలాంటి భావ స్వాతంత్యాన్ని అయినా అణచివేసేందుకు ఆరాటపడతాయని’ ఆయన అన్నారు. 


‘రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్’అనే అంతర్జాతీయ సంస్థ ప్రతి సంవత్సరమూ ‘ప్రెస్ ఫీడమ్ ఇండెక్స్’ను రూపొందిస్తుంది. 2010 సంవత్సరంలో ఈ సూచీలో భారత్ 105 వ స్థానంలో ఉన్నది. ఒక దశాబ్దం అనంతరం ఆ స్థానం 142 కి పడిపోయింది. మన పొరుగుదేశాలలో కొన్ని మనకంటే తక్కువ స్థానంలో (పాకిస్థాన్-145, బంగ్లాదేశ్-151) ఉండగా, మరికొన్ని దేశాలు మనకంటే ఉన్నతస్థానంలో (నేపాల్ -112, శ్రీలంక-127) ఉన్నాయి. 


పత్రికా స్వాతంత్ర్యం విషయంలో భారత్ పతనంపై ‘రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్’ స్వతంత్ర అంచనాను నా వ్యక్తిగత అనుభవాలు ధ్రువీకరిస్తున్నాయి. గత మూడు దశాబ్దాలుగా నేను పత్రికలకు, వెబ్ సైట్లకు రాస్తున్నాను. వాటి యజమానులు, ఎడిటర్లపై ఒత్తిడి అంతకంతకూ పెరిగిపోవడాన్ని నేను గమనించాను. మన ప్రధానమంత్రి పత్రికా స్వాతంత్ర్యానికి స్నేహితుడేమీకాదు. ఆమాటకొస్తే ముఖ్యమంత్రులలో అత్యధికులు సైతం పత్రికా స్వాతంత్ర్యానికి సంపూర్ణ అనుకూలురుకాదు. కొన్ని సంవత్సరాలుగా పత్రికా సంపాదకులకు రాజకీయ వేత్తల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఇది దేశవ్యాప్త పరిణామం. ఇప్పుడు పాత్రికేయులకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్‌లు దాఖలు చేయడం సాధారణమైపోయింది. ఇదీ దేశవ్యాప్త పరిణామమే. 


మన దేశంలో ఇంకా స్వతంత్ర వైఖరితో వ్యవహరించే పత్రికలు, వెబ్ సైట్లు ఉన్నాయి. నిర్భయంగా, నిష్పాక్షికంగా, అవిరామంగా రాస్తున్న పాత్రికేయులు అనేకమంది ఉన్నారు. అయితే పత్రికాస్వాతంత్ర్యం పరిస్థితి మొత్తం మీద నిరాశాజనకంగా ఉన్నది. అత్యవసర పరిస్థితి అనంతరం మరెన్నడూ లేనివిధంగా ఇప్పుడు భారతీయ పత్రికారంగం తక్కువ స్వాతంత్ర్యంతో ఉన్నది. ప్రభుత్వ బెదిరింపులు, వేధింపులకు మరింత ఎక్కువగా లోనవుతున్నది. రామ్ మోహన్ రాయ్ నేడు సజీవంగా ఉన్నట్లయితే పత్రికా స్వాతంత్ర్యం పరిరక్షణ విషయమై అధికారంలో ఉన్నవారికి తప్పకుండా ఒక విజ్ఞాపన పత్రం రాసేవారు. బహుశా, ఆ వివేకశీలికి వ్యతిరేకంగా పలు ఆరోపణలతో ఒక ఎఫ్ఐఆర్ దాఖలు అయివుండేదేమో?!




(వ్యాసకర్త చరిత్రకారుడు)

రామచంద్ర గుహ

Updated Date - 2020-06-20T05:47:06+05:30 IST