నేడు వరంగల్‌కు సీఎం కేసీఆర్
ABN , First Publish Date - 2021-05-21T09:04:06+05:30 IST
సీఎం కేసీఆర్ వరంగల్ మహాత్మాగాంధీ స్మారక ఆస్పత్రి(ఎంజీఎం)ని సందర్శించనున్నారు. శుక్రవారం ఆస్పత్రికి రానున్న ఆయన కొవిడ్ వార్డులో పర్యటించి రోగులతో మాట్లాడనున్నారు. ఆయన బుధవారం హైదరాబాద్‌లో గాంధీ ఆస్పత్రికి వెళ్లి కొవిడ్
ఎంజీఎం ఆస్పత్రిలో కొవిడ్
బాధితులకు ముఖ్యమంత్రి పరామర్శ
ఆ ఆస్పత్రిని మాతా, శిశు సంరక్షణ
కేంద్రంగా మార్చే ప్రకటన
సెంట్రల్ జైలు తరలింపుపై సమీక్ష
వరంగల్ అర్బన్, మే 20(ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్ వరంగల్ మహాత్మాగాంధీ స్మారక ఆస్పత్రి(ఎంజీఎం)ని సందర్శించనున్నారు. శుక్రవారం ఆస్పత్రికి రానున్న ఆయన కొవిడ్ వార్డులో పర్యటించి రోగులతో మాట్లాడనున్నారు. ఆయన బుధవారం హైదరాబాద్‌లో గాంధీ ఆస్పత్రికి వెళ్లి కొవిడ్ బాధితులను పరామర్శించిన విషయం తెలిసిందే. అదే తరహాలో ఎంజీఎంలోనూ బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకోనున్నారు. కొవిడ్ రోగులకు చికిత్స అందించడంలో ఎంజీఎం ఆస్పత్రి విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తడం, కొవిడ్ రోగులకు సరైన వైద్య సహాయం అందడం లేదన్న ఆరోపణలు రావడంతో సూపరింటెండెంట్‌గా నాగార్జునరెడ్డిని తప్పించి వి.చంద్రశేఖర్‌ను నియమించారు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించనుండడం ప్రత్యేకతను సంతరించుకున్నది. కేసీఆర్ శుక్రవారం ఉదయం 11 గంటలకు హెలికాప్టర్ నుంచి హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో దిగుతారు.
నేరుగా రాజ్యసభ సభ్యుడు, టీఆర్‌ఎస్ సీనియర్ నేత కెప్టెన్ వి.లక్ష్మీకాంతారావు ఇంటికి వెళ్తారు. అనంతరం 11.45 గంటలకు సెంట్రల్ జైలుకు చేరుకుంటారు. జైలు అధికారులతో చర్చించిన తర్వాత తిరిగి మధ్యాహ్న భోజనం కోసం లక్ష్మీకాంతారావు ఇంటికి వెళ్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లి కొవిడ్ రోగులతో మాట్లాడతారు. ఆస్పత్రిలో సూపరింటెండెంట్, వైద్యులు, ఇతర సిబ్బందితో చర్చిస్తారు. తిరిగి 3 గంటలకు లక్ష్మీకాంతారావు ఇంటికి వెళ్తారు. అధికారులు, నాయకులతో సమీక్ష అనంతరం సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్ బయల్దేరుతారు. ఎంజీఎం ఆస్పత్రి, కాకతీయ వైద్య కళాశాల మధ్య ప్రదేశంలో ఉన్న కేంద్ర కారాగారాన్ని వరంగల్ నగర శివారు ప్రాంతంలోకి తరలించాలని గతంలోనే ప్రతిపాదనలు వచ్చాయి. అనువైన స్థలం కోసం సెంట్రల్ జైలు అధికారులు అన్వేషించారు. వరంగల్ శివారు ప్రాంతంలోని ధర్మసాగర్, బొల్లికుంట, మామునూరు ప్రాంతాల్లో స్థల సేకరణకు పయత్నించారు. 100 ఎకరాలకు పైగా భూమి అవసరం ఉండటంతో పాటు సెంట్రల్ జైలులో ఉన్న హైసెక్యూరిటీ బ్యారక్ తరలింపునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ అనుమతి కావాల్సి ఉండటం వల్ల తరలింపు ఆలస్యమైందంటున్నారు.
ప్రధాన సమస్య మాత్రం అనువైన స్థలం దొరకకపోవడమే అని అధికారులు అంటున్నారు. సీఎం కేసీఆర్ సందర్శన అనంతరం సెంట్రల్ జైలు తరలింపులో వేగం పెరిగే అవకాశాలున్నాయి. ఎంజీఎం ఆస్పత్రిని మాతా, శిశు సంరక్షణ కేంద్రంగా మార్చడంపై సీఎం కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉంది. గతంలో వరంగల్ వచ్చినప్పుడే సెంట్రల్ జైలు తరలింపు, ఎంజీఎం మాతా, శిశు సంరక్షణ కేంద్రంగా మార్చే ప్రతిపాదన చేశారు. కాకతీయ వైద్య కళాశాల, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒకే ఆవరణలో ఉంటాయి. వాటిని ఆనుకుని వరంగల్ సెంట్రల్ జైలు ఉంది. ఈ జైలుకు ఆనుకుని ప్రాంతీయ నేత్ర వైద్య ఆస్పత్రి, దాని పక్కనే ఎంజీఎం ఆస్పత్రి ఉంటుంది. వీటి మధ్య 52 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సెంట్రల్ జైలును తరలించి ఆ ప్రాంతంలో ఎంజీఎం ఆస్పత్రి సూపర్ స్పెషాలిటీ విభాగాలను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. 1000 పడకలతో ఉన్న ఈ ఎంజీఎం ఆస్పత్రిలో ఇప్పటికే ఆధునిక నవజాత శిశు చికిత్సా కేంద్రం ఉంది.
దీనికి అనుబంధంగా దాదాపు 500 పడకలతో మాతా, శిశు కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ రాక కోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. మంత్రి ఎర్రబెల్లి ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించి వైద్యులతో సమీక్ష నిర్వహించారు. ఎంజీఎంలో నెలకొన్న ప్రధాన సమస్యలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, ఇతర సీనియర్ డాక్టర్లతో చర్చించారు. సీఎం రాక సందర్భంగా సీపీ తరుణ్ జోషి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.