నేడు చలో రామతీర్థం

ABN , First Publish Date - 2021-01-07T07:50:32+05:30 IST

రాష్ట్రంలో ధ్వంసం చేసిన ఆలయాలను, దేవతా విగ్రహాలను పరిశీలించేందుకు ఈ నెల 20తరువాత బీజేపీ రాష్ట్ర యాత్ర చేపడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు.

నేడు చలో రామతీర్థం

  • దర్శనానికి ప్రభుత్వమే ఏర్పాట్లు చేయాలి 
  • ఆ ఆలయాల వద్దకు త్వరలో రాష్ట్ర యాత్ర 
  • సర్కారే గెరిల్లా యుద్ధం చేస్తోంది: సోము 
  • పోలీసుల తీరుపై బీజేపీ నిరసనలు 
  • పెట్రోలుతో కార్యకర్త ఆత్మహత్యాయత్నం


విశాఖపట్నం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ధ్వంసం చేసిన ఆలయాలను, దేవతా విగ్రహాలను పరిశీలించేందుకు ఈ నెల 20తరువాత బీజేపీ రాష్ట్ర యాత్ర చేపడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీసీ నాయకులు విజయసాయిరెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాస్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు భద్రతా ఏర్పాట్లు కల్పించి పోలీసులు ఎలా దగ్గరుండి తీసుకెళ్లారో... బీజేపీ నేతలను కూడా గురువారం అలాగే తీసుకెళ్లాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ ‘చుప్‌చాప్‌’ అంటే బీజేపీ ఊరుకోబోదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గెరిల్లా యుద్ధం చేస్తున్నారని సీఎం జగన్‌ చేసిన ఆరోపణలను వీర్రాజు ఖండించారు. హిందువులపై కేసులు పెడుతూ ప్రభుత్వమే గెరిల్లా యుద్ధం చేస్తోందని విమర్శించారు. 


భగ్గుమన్న బీజేపీ శ్రేణులు 

రామతీర్థం వెళ్తున్న బీజేపీ నాయకులను అరెస్టు చేయడంపై ఆ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. బీజేపీ రాష్ట్ర అఽధ్యక్షుడు సోము వీర్రాజు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ బుధవారం విశాఖ, విజయనగరం, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ధర్నాలు నిర్వహించారు. విజయనగరం కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన నిరసనలో బీజేపీ కార్యకర్త అబ్దుల్‌ ఆదిల్‌ ముందుకొచ్చి వెంటతెచ్చుకున్న పెట్రోల్‌ ఒంటిపై పోసుకున్నాడు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే ఆదిల్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. బుధవారం విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బీజేపీ ధర్నా నిర్వహించింది. తమను రామతీర్థంలోకి అడుగు పెట్టనివ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి హెచ్చరించారు. బీజేపీని అణగదొక్కాలని చూస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎమ్మెల్సీ మాధవ్‌ స్పష్టం చేశారు. కాగా, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో గురువారం మరోసారి చలో రామతీర్థం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట బీజేపీ వర్గీయులు చేపట్టిన ధర్నాలో వేణు అనే కార్యకర్త కిరోసిన్‌ చల్లుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. సుమారు 50మందిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. 

Updated Date - 2021-01-07T07:50:32+05:30 IST