లోకం కోసం శిలువనెక్కి...

ABN , First Publish Date - 2021-04-02T06:01:58+05:30 IST

దైవ కుమారుడైన ఏసు క్రీస్తు మానవాళిని పాపాల నుంచి విముక్తం చేయడానికి శిలువ ఎక్కాడు. తన రక్తాన్ని చిందించి మనుషుల పాపాలనూ, దోషాలనూ ప్రక్షాళన చేశాడు. సర్వ లోకానికీ సార్వకాలికమైన శాంతి, క్షమల సందేశాన్ని తన త్యాగంతో ఏసు చాటి

లోకం కోసం శిలువనెక్కి...

నేడు గుడ్‌ ఫ్రైడే


దైవ కుమారుడైన ఏసు క్రీస్తు మానవాళిని పాపాల నుంచి విముక్తం చేయడానికి శిలువ ఎక్కాడు. తన రక్తాన్ని చిందించి మనుషుల పాపాలనూ, దోషాలనూ ప్రక్షాళన చేశాడు. సర్వ లోకానికీ సార్వకాలికమైన శాంతి, క్షమల సందేశాన్ని తన త్యాగంతో ఏసు చాటి చెప్పాడు. ఆ పవిత్రమైన రోజే గుడ్‌ ఫ్రైడే.


మానవునిగా జన్మించాడు కాబట్టి... దేవుని కుమారుడైన ఏసు ప్రభువు మానవ సహజమైన మరణాన్ని స్వీకరించాడు. తన మహిమను ప్రకటించి, లోకంలోని పాపాన్ని తొలగించడం కోసం మనుషులకు బదులుగా శిక్షను అనుభవించానని ప్రకటించాడు. తనను రక్షకుడిగా అంగీకరించిన వారికి పాప క్షమాపణ జరుగుతుందని చాటి చెప్పడానికి మూడవ రోజున తిరిగి సజీవుడై దర్శనమిచ్చాడు. 

దేవుడు తాను సృష్టించిన సకల జీవరాశుల్లో వివేకాన్నీ, జ్ఞానాన్నీ ఒక్క మానవుడికే ఇచ్చాడు. భూలోక రాజ్యంపై మనుషులకు ఆధిపత్యాన్ని ఇచ్చాడు. దేవుని ఆదేశాల ప్రకారం శాంతి సామరస్యాలతో, సహోదరభావంతో జీవించాల్సిన మానవులు దురాశతో, వ్యామోహాలతో పాప కార్యాలలో మునిగిపోయారు. భూమిని అశాంతిపాలు చేశారు. పతనమైపోతున్న మానవులకు మంచి మార్గాన్ని చూపించడానికి తన పుత్రుడైన ఏసు క్రీస్తును దేవుడు భూమి మీదకు పంపాడు. తన ప్రవర్తనతో, ప్రబోధాలతో మానవాళికి దిశా నిర్దేశం చేశాడు ఏసు ప్రభువు. ఈ లోకానికి తాను వచ్చిన కార్యం పూర్తయిందని ఆయన ముందే గ్రహించాడు. తన మరణం గురించి ఆయన ఒక రోజు ముందే... తన శిష్యులతో చేసిన విందు సందర్భంగా ఆయన ప్రకటించాడు. 


యేసు క్రీస్తు శిష్యుడైన యూదా ఇస్కరియోత్‌ 33 నాణేల కోసం ఆయనకు ద్రోహం చేస్తాడు. ఏసు ఉన్న చోటెక్కడో సైనికులకు చెబుతాడు. సైనికులు క్రీస్తును బంధిస్తారు. అన్యాయమైన విచారణను న్యాయమూర్తుల బృందం ఒకటి జరిపి, ఆయనకు శిక్ష విధిస్తుంది. ఆ శిక్ష అమలు కోసం ఏసును శిలువపై మేకులతో కొట్టి, ఈడ్చుకొని వెళ్తారు. శిలువపై ఆయన ప్రాణాలను విడుస్తాడు. ఆ రోజు శుక్రవారం. అనంతరం మూడవ రోజున... ఆదివారం నాడు ఏసు క్రీస్తు పునరుత్థానం చెందాడు. తన మహిమను ప్రకటించాడు. ఆ రోజును ‘ఈస్టర్‌ పండుగ’గా పాటిస్తారు.


మరణించడానికి ముందు ఏసు క్రీస్తు చెప్పిన ఆఖరి ఏడు మాటలు:

  • తన తండ్రి అయిన యెహోవాతో - ‘‘వీళ్ళేం చేస్తున్నారో వీరికి తెలియదు. వీళ్ళను క్షమించు.’’
  • శిలువలో తన పక్కన ఉన్న నేరస్తుడితో - ‘‘ఈ రోజు నేను నీకు మాటిస్తున్నాను, నువ్వు నాతోపాటు పరలోకంలో ఉంటావు.’’
  • తన తల్లితో-  (యోహానును చూపించి) ‘‘ఇదిగో నీ కుమారుడు’’... యోహానుతో- (తల్లి మరియాను చూపిస్తూ) ‘‘ఇదిగో! నీ తల్లి!’’
  • తండ్రి అయిన యెహోవాతో - (ఏలీ, ఏలీ, లామా సబక్తానీ?) ‘‘దేవా! నా దేవా! నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు?’’
  • చివరి క్షణాలు దగ్గరవుతున్నప్పుడు - ‘‘నాకు దాహంగా ఉంది.’’
  • చివరి ఘడియల్లో - ‘‘ఇక సమాప్తమైపోయింది.’’
  • ఆఖరి మాటగా - ‘‘తండ్రీ! నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను.’’


గుడ్‌ ఫ్రైడే సందర్భంగా ఈ మాటలను ప్రత్యేకంగా గుర్తు చేసుకోవడం, ప్రత్యేకమైన ప్రార్థనలు చేయడం, ఉపవాస దినంగా పాటించడం ఆనవాయితీ. అలాగే 33 నాణేల కోసం ఆశపడిన శిష్యుడి వంచనకు చిహ్నంగా కొన్ని చోట్ల చర్చిలలో ముప్ఫై మూడు సార్లు గంటలను మోగిస్తారు. గుడ్‌ ఫ్రైడేని ‘హోలీ ఫ్రైడే’ అని కూడా అంటారు. 


మానవునిగా జన్మించాడు కాబట్టి... దేవుని కుమారుడైన ఏసు ప్రభువు మానవ సహజమైన మరణాన్ని స్వీకరించాడు. తన మహిమను ప్రకటించి, లోకంలోని పాపాన్ని తొలగించడం కోసం మనుషులకు బదులుగా శిక్షను అనుభవించానని ప్రకటించాడు. తనను రక్షకుడిగా అంగీకరించిన వారికి పాప క్షమాపణ జరుగుతుందని చాటి చెప్పడానికి మూడవ రోజున తిరిగి సజీవుడై దర్శనమిచ్చాడు. అజ్ఞానంతో తనను శిలువ వేస్తున్న వారిని క్షమించాలని తన తండ్రిని కోరిన ఏసు... నేరస్తులకు తన లోకంలో చోటు ఇస్తానని మాట ఇచ్చాడు. అజ్ఞానాన్ని విడిచిపెట్టి, దేవుణ్ణి ఆశ్రయిస్తే క్షమాపణ దొరుకుతుందని సందేశం ఇచ్చాడు. దేవునిపైనా, దైవ కుమారుడైన ఏసు క్రీస్తుపైనా విశ్వాసం ఉన్నవారికీ, ఏసు బోధలను మనసులో నిలుపుకొని, ఆయన చూపిన మార్గంలో జీవించినవారికీ పాపాల నుంచి విముక్తి కలుగుతుందనీ, పరలోకంలో వారికి శాశ్వత స్థానం లభిస్తుందనీ పవిత్ర గ్రంథాలు చెబుతున్నాయి.


క్రీస్తు మరణం, మూడవ రోజున ఆయన పునరుత్థానం మానవాళి చరిత్రలో అపూర్వ ఘట్టాలు. గుడ్‌ ఫ్రైడే, ఈస్టర్‌ పండుగలు క్రైస్తవ విశ్వాసానికి పునాదులు.

Updated Date - 2021-04-02T06:01:58+05:30 IST