సూర్యదేవ నమస్తుభ్యం!

ABN , First Publish Date - 2021-02-19T08:44:21+05:30 IST

ఆనందం, ఆరోగ్యం, తేజస్సు, విజయం... లోకంలోని సర్వజనులూ వీటిని కోరుకుంటారు. ఈ సంపదలను ప్రసాదించేవాడు సూర్య భగవానుడు. సకల చరాచర జగత్తూ ఆయన కరుణా కటాక్ష వీక్షణాల వల్లనే

సూర్యదేవ నమస్తుభ్యం!

నేడు రథసప్తమి


ఆనందం, ఆరోగ్యం, తేజస్సు, విజయం... లోకంలోని సర్వజనులూ వీటిని కోరుకుంటారు. ఈ సంపదలను ప్రసాదించేవాడు సూర్య భగవానుడు. సకల చరాచర జగత్తూ ఆయన కరుణా కటాక్ష వీక్షణాల వల్లనే మనగలుగుతోంది. తిమిరాన్ని పారద్రోలి, అన్ని లోకాలలో వెలుగులు నింపే సూర్యనారాయణుడు త్రిమూర్తి స్వరూపునిగా, వేద స్వరూపునిగా, కర్మ సాక్షిగా అనాదిగా పూజలందుకుంటున్నాడు. 


జగతికి ప్రత్యక్ష దైవం సూర్యుడు. సృష్టికారకుడైన సవితగానూ, స్థితికారకుడైన మిత్రునిగానూ, మృత్యుకారకుడైన మార్తాండునిగానూ ఈ విశ్వంలో ఆయన వెలుగొందుతున్నాడు. మాఘ బహుళ సప్తమి సూర్య జయంతి. ‘అఘం’ అంటే పాపం. ‘మాఘం’ అంటే పాపాలను నశింపజేసే శక్తి కలిగినది. మాఘ మాసం సూర్యుడి మాసం. మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభమైన కొద్ది రోజులకే రథ సప్తమి వస్తుంది. ఇది సూర్యోపాసనకు ఎంతో అనుకూలమైన సమయం.


మాఘ శుక్ల సప్తమీ రథ సప్తమీ

సా అరుణోదయ వ్యాపినీ గ్రాహ్య

సూర్య గ్రహణ తుల్యాతు శుక్లా మాఘస్య సప్తమీ


అరుణోదయ వేలాయాం తస్యాం స్నాన మహాఫలమ్‌ అని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. మాఘ శుద్ధ సప్తమిని ‘రథ సప్తమి’ అంటారు. సూర్యోదయం ఉన్న సప్తమి రోజునే దీన్ని ఆచరించాలి. ఈ సప్తమి సూర్య గ్రహణంతో సమానమైనది. అరుణోదయ సమయంలో చేసే స్నానం మహా ఫలితాన్ని ఇస్తుంది. స్నానం చేసే సమయంలో స్థిరమైన బుద్ధితో సూర్యుణ్ణి హృదయంలో ధ్యానించాలి. రథసప్తమి రోజున ఆచరించాల్సిన విధులను పూర్వులు నిర్దేశించారు. వాటి ప్రకారం... ఈ రోజున సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ఏడు జిల్లేడు ఆకులనూ, రేగు ఆకులనూ శిరస్సుపై ఉంచుకొని...


నమస్తే రుద్ర రూపాయ రసనాం పతయే నమః

వరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే...

యద్యత్‌ జన్మ కృతం పాపం మయా దన్మసు సుప్తసు


తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ... అనే శ్లోకాలను చదువుతూ, స్నానం చేయాలి. నువ్వులతోనూ, పిండితోనూ చేసిన ‘అపూపం’ అనే వంటకాన్ని సూర్యుడికి నివేదించాలి. తరువాత శక్తిమేరకు దానాలు చేయాలి.


సూర్యారాధన ఆరోగ్యప్రదం

మన దేశంలో సూర్యుణ్ణి వేదకాలం నుంచి ఆరాధిస్తున్నారు. సూర్యారాధనతో సమస్త పాపాలూ నశిస్తాయనీ, ఆరోగ్యం చేకూరుతుందనీ అనాదిగా వస్తున్న విశ్వాసం. అందుకే ‘ఆరోగ్యం భాస్కరా దిచ్ఛేత్‌’ అనే లోకోక్తి పుట్టింది. రామాయణ కాలంలో శ్రీరామచంద్రుడు సూర్యుణ్ణి ఆరాధించి, అగస్త్య మహర్షి నుంచి పొందిన ‘ఆదిత్య హృదయా’న్ని స్తోత్రం చేసి, రావణుణ్ణి సంహరించాడు. హనుమంతుడు సూర్యుణ్ణి ఆరాధించి నవ వ్యాకరణవేత్త అయ్యాడు. మహాభారతంలో ధర్మరాజు కూడా సూర్యారాధనతో అక్షయపాత్రను పొంది, అరణ్యవాసంలో ఆహారానికి లోటు లేకుండా చేసుకోగలిగాడు. సత్రాజిత్తు సూర్యోపాసనతో శ్యమంతకమణి పొందాడు. సూర్యమంత్రం ప్రభావం వల్లనే కుంతీదేవికి కర్ణుడు జన్మించాడు. ఇలా ఇతిహాసాల్లో, పురాణాలలో సూర్యుడి మహాత్మ్యాన్ని వెల్లడించే ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఆదిదేవుడైన సూర్యభగవానుణ్ణి నిష్టగా అర్చిస్తే, సర్వాభీష్టాలూ సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం.


రథ సప్తమి ప్రాశస్త్యాన్ని తెలిపే ఒక కథ భవిష్య పురాణంలో ఉంది. పూర్వం కాంభోజ దేశాన్ని యశోధర్ముడు అనే రాజు పరిపాలించేవాడు. సంతానం కోసం ఎంతో ఎదురు చూసిన ఆయనకు... వార్థక్యంలో ఒక కుమారుడు కలిగాడు. కానీ పుట్టుకతోనే అతను అనారోగ్యవంతుడు. దీనికి ఎంతో తల్లడిల్లిపోయిన యశోధర్ముడు... తన పుత్రుడు పుట్టురోగి కావడానికి కారణం ఏమిటని ఆస్థాన జ్యోతిష పండితులను అడిగాడు.


ఆ బాలుడి జాతకాన్ని పరిశీలించిన, దీర్ఘ దృష్టితో ఆలోచించిన ఆ పండితులు ‘‘ఓ రాజా! ఇతడు గత జన్మలో ఒక వర్తకుడు. పరమ లోభి. అయితే పూర్వ జన్మ పుణ్యం కొద్దీ, ఎవరో రథసప్తమి వ్రతం చేస్తూ ఉంటే చూశాడు. ఆ కాస్త పుణ్యానికే ఈ జన్మలో రాజవంశంలో జన్మించాడు గత జన్మలో పిసినారి కనుక ఈ జన్మలో రోగ పీడితుడయ్యాడు. రథ సప్తమి వ్రతాన్ని చూస్తేనే ఇంతటి భాగ్యం కలిగినప్పుడు, స్వయంగా ఆచరిస్తే ఎంత గొప్ప ఫలితం ఉంటుందో ఊహించండి. రోగ విముక్తుడు కావడమే కాదు, చక్రవర్తి కూడా అవుతాడు’’ అని చెప్పారు. వారి ఉపదేశంతో... తన కుమారుడితో రథసప్తమీ వ్రతాన్ని మహారాజు చేయించాడు. ఫలితంగా ఆ రాజ కుమారుడు ఆరోగ్యవంతుడే కాదు, చక్రవర్తి కూడా అయ్యాడు. రథసప్తమికీ, ఆ రోజున చేసే జప, ధ్యాన, వ్రతాలకూ అనంతమైన ప్రభావం ఉంటుందని పెద్దలు చెబుతారు.


మాఘ శుద్ధ సప్తమిని ‘రథ సప్తమి’ అంటారు. సూర్యోదయం ఉన్న సప్తమి రోజునే దీన్ని ఆచరించాలి. ఈ సప్తమి సూర్య గ్రహణంతో సమానమైనది. అరుణోదయ సమయంలో చేసే స్నానం మహా ఫలితాన్ని ఇస్తుంది. స్నానం చేసే సమయంలో స్థిరమైన బుద్ధితో సూర్యుణ్ణి హృదయంలో ధ్యానించాలి. ’


ఆచార్య శ్రీవత్స

Updated Date - 2021-02-19T08:44:21+05:30 IST