బలికోరుతున్న బదిలీలు

ABN , First Publish Date - 2022-01-16T05:30:00+05:30 IST

జీవో నెంబరు 317 ఉపాధ్యాయ ఉద్యోగులు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తోంది. స్పౌజ్‌ నిబంధనలను పట్టించుకోకుండా బదిలీలు చేయడంతో ఉద్యోగులు తీవ్ర ఆం

బలికోరుతున్న బదిలీలు

స్పౌజ్‌ బదిలీలతో ఉపాధ్యాయ కుటుంబాల్లో తీవ్ర ఆందోళన

ఒత్తిడితో అనారోగ్యం బారిన పలువురు టీచర్లు

జీవోనెంబరు 317ను రద్దుచేయాలని డిమాండ్‌

ఖమ్మం ఖానాపురం హవేలీ, జనవరి 16: జీవో నెంబరు 317 ఉపాధ్యాయ ఉద్యోగులు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తోంది. స్పౌజ్‌ నిబంధనలను పట్టించుకోకుండా బదిలీలు చేయడంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు టీచర్లు ఆందోళనతో ఊపిరులొదిలారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలోని టీచర్లు కూడా మనోవేదనతో.. పుట్టి పెరిగిన ప్రాంతాన్ని ఎలా వదిలి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లలకు ఏ స్థానికత ఇవ్వాలని నిలదీస్తున్నారు. జీవనయానంలో చివరి దశలో భర్త ఒక చోట భార్య మరో చోట ఎలా ఉద్యోగాలు చేయాలని ఒత్తిడికి గురవుతున్నారు. మానసికఒత్తిడికి గురవుతున్న పలువురు ఉపాధ్యాయులు ఆసుపత్రుల బాటపడుతున్నారు.

భార్యాభర్తలు చెరోదిక్కు

భార్యాభర్తలు ఉద్యోగాలు చేసేవారైతే స్పౌజ్‌నిబంధనల ప్రకారం ఇద్దరు ఒకే చోట పనిచేసేలా పోస్టింగులివ్వాలని నిబంధనలున్నాయి. అయితే జీవోనెం. 317 ప్రకారం జోనల పరిధిని పెంచి చేపట్టిన బదిలీల్లో ఈ రూల్స్‌ ఏమాత్రం పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. ఉపాధ్యాయులు రోడ్కెక్కి నిరసనలు, దీక్షలకు దిగుతున్నారు. భర్తను కాళేశ్వరం, భార్యను అశ్వాపురం బదిలీ చేసిన విషయంలో ముదిగొండ మండలం మేడేపల్లికి చెందిన ఉపాధ్యాయురాలు గుండ్ల చైతన్య కుటుంబం మూడు రోజులుగా ఇంటి వద్దే దీక్షకు దిగింది. ఖమ్మం జిల్లాలో నివాసం ఉండే ఎస్‌కే రహీం 90శాతం దివ్యాంగుడు కాగా ఆయన నగరంలోని రిజిస్ర్టార్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య పల్లెగూడెంలో ఉపాధ్యాయురాలు కాగా ఆమెను నగరానికి 250కిలోమీటర్ల దూరంలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి బదిలీ చేశారు. ఇలాంటి అసంబద్ధ బదిలీలు చాలానే ఉన్నాయి. దీంతో ఉపాధ్యాయులు, ఉద్యోగులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.

ఆటంకంగా మల్టీ జోనల్‌ నిబంధనలు

భార్యాభర్తలు ఒకేచోట పనిచేేస అవకాశం కల్పిస్తూ జిల్లా కేడర్‌ నుంచి తొలుత ఆప్షన్లు కోరారు. గతనెల 27 వరకు దరఖాస్తులు స్వీకరించినా.. పూర్తి స్థాయిలో మల్టీజోనల్‌ పోస్టుల కేటాయింపు జరగలేదు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాల్లో కూడా స్పష్టత లేదు. భార్యా, భర్తల్లో జిల్లా కేడర్‌లో ఒకరు, మల్టీజోనల్‌లో మరొకరు పనిచేస్తుంటే.. జిల్లా కేడర్‌లో ఉన్న వాళ్లు ఇప్పుడు ఆప్షన్‌ ఇవ్వగా, మల్టీజోనల్‌లో పనిచేేస భర్త లేదా భార్యకు ఆ అవకాశం లేకుండా పోయింది. దీంతో ఇద్దరూ ఒకేచోట పనిచేేస వీలు ఎలా ఉంటుందని టీచర్లు ప్రశ్నిస్తున్నారు.  స్థానికంగా ఉండే ఉపాధ్యాయుల్లోనూ బదిలీల ప్రక్రియ గుబులు రేపుతోంది. ఏళ్ల తరబడి పనిచేస్తున్న టీచర్లు తాము కోరుకునే ప్రదేశాన్ని కొత్తగా వచ్చే వారితో నింపితే తమకెలా న్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సీనియారిటీ జాబితాలపైనా అన్ని స్థాయిల్లో వివాదం పెరుగుతోంది. వీటిపై అప్పీలుకు వెళ్లే అవకాశం కూడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా అమలు చేస్తున్న బదిలీలు హేతుబద్ధంగా లేవని ఆందోళన  వ్యక్తం చేస్తున్నారు.

స్థానికతకు తూట్లు..

టీచర్ల బదిలీల కౌన్సెలింగ్‌కు సంబంధించి విడుదల చేసిన జీవో నెంబర్‌ 317పై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తక్షణమే జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేస్తున్నాయి. టీచర్ల బదిలీలలపై వివాదం రోజురోజుకు ముదురుతోంది. జోనల్‌ వ్యవస్థకు పూర్తి విరుద్థంగా ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టారని.. జిల్లాల కేటాయింపుల్లో కూడా అనేక అవకతవకలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికతను పట్టించుకోకుండా ఇష్టారీగా కుటుంబాలను విడదీయడం భావ్యంకాదని ఉపాధ్యాయులు అంటున్నారు.  

స్పౌజ్‌ బదిలీలు ప్రభుత్వ పరిధిలోనివి

ఎస్‌.యాదయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి

ఉపాధ్యాయుల బదిలీలు ఈనెల 7తో పూర్తయిపోయాయి. ప్రస్తుతంస్పౌజ్‌ బదిలీల ఖాళీల్లో భర్తీ ప్రభుత్వ పరిధిలో ఉంది. ప్రభుత్వం వాటిని పూర్తిచేయమని ఎప్పుడు ఆదేశం ఇస్తే అప్పుటు వెంటనే ఖాళీలను భర్తీచేస్తాం. దీనికి సంబంధించి మా దగ్గర ఎలాంటి సమాచారం లేదు. ప్రభుత్వ ఆదేశాలతో ప్రస్తుతం జరిగిన బదిలీలను పూర్తిచేశాం. 

భార్యభర్తలను ఒకే ప్రాంతానికి బదిలీ చేయాలి

మోతుకూరి మధు, పీఆర్టీయూ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు

317 జీవో వల్ల భార్యభర్తలు, ఒంటరి మహిళలను ఖమ్మం జిల్లాలనుంచి ఇతర జిల్లాలకు ప్రభుత్వం కేటాయించింది. భార్యను ఒక జిల్లాకు.. భర్తను మరో జిల్లాకు కేటాయించడంతో కుటుంబసభ్యులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భార్యభర్తలను ఒకే ప్రాంతానికి కేటాయించాలని సీఎం కేసీఆర్‌ చెప్పినా 317జీవో వల్ల భార్యభర్తలను వేర్వేరు జిల్లాలకు కేటాయించారు. వివిధ ప్రాంతాల్లోని భార్యభర్తలను ఖమ్మంజిల్లాకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వాన్ని ఒప్పించేలా పీఆర్టీయూ తరపున ప్రయత్నాలు చేస్తున్నాం. ఉపాధ్యాయులు అధైర్యపడకుండా.. సంయమనం పాటించాలి.


Updated Date - 2022-01-16T05:30:00+05:30 IST