అయోమయంలో టీచర్ల బదిలీలు

ABN , First Publish Date - 2021-01-14T08:57:00+05:30 IST

ఉపాధ్యాయుల బదిలీల వ్యవహారం అగమ్యగోచరంగా మారింది. బదిలీలకు సంబంధించి నియమ నిబంధనలు, మార్గదర్శకాలపై ఉపాధ్యాయ సంఘాలన్నీ ముక్తకంఠంతో చేసిన ప్రతిపాదనలు, సూచనలను బేఖాతరు చేస్తూ అధికారులు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలు బెడిసికొట్టాయి.

అయోమయంలో టీచర్ల బదిలీలు

  • అభాసుపాలైన వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ
  • పారదర్శకతకు పాతర 
  • కోర్టు కేసులతో గందరగోళం
  • తీవ్ర అసంతృప్తితో ఉపాధ్యాయలోకం


(అమరావతి, ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల బదిలీల వ్యవహారం అగమ్యగోచరంగా మారింది. బదిలీలకు సంబంధించి నియమ నిబంధనలు, మార్గదర్శకాలపై ఉపాధ్యాయ సంఘాలన్నీ ముక్తకంఠంతో చేసిన ప్రతిపాదనలు, సూచనలను బేఖాతరు చేస్తూ అధికారులు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలు బెడిసికొట్టాయి. ఉపాధ్యాయ బదిలీల షెడ్యూలును గత ఏడాది అక్టోబరు 12న ఇచ్చారు. దీని ప్రకారం నవంబరు 4 నుంచి 12 వరకు బదిలీలు చేపట్టాల్సి ఉంది. దాదాపు 26 వేల ఖాళీలను బ్లాక్‌ చేశారు. మారుమూల ప్రాంతాల ఖాళీలు ఓపెన్‌ చేసి, పట్టణ ప్రాంతాల ఖాళీలను బ్లాక్‌ చేశారు. దీనిపై సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైనా పట్టించుకోలేదు. టీచర్లను వెబ్‌లోనే ఆప్షన్లు పెట్టుకోమన్నారు. ఇందుకు సర్వర్లు పనిచేయలేదు. పెట్టుకున్న ఆప్షన్లు కనబడలేదు. చివరికి పారదర్శకతకు పాతరేస్తూ మండల విద్యాధికారుల (ఎంఈవో)కు లాగిన్‌ ఇచ్చారు. దీంతో ఎంఈవోలు టీచర్లను పిలిపించి వారు పెట్టుకున్న ఆప్షన్లను బలవంతంగా మార్పించారు. భార్యాభర్తలు వంటి ప్రిఫరెన్షియల్‌ కేటగిరీలు, స్పెషల్‌ కేటగిరీల విషయంలో ఈ వ్యవహారం నడిపించారు.


 అధికారులే ప్రోత్సహించి కొంతమంది పీఈటీ, పండిట్లను కోర్టుకు పంపించారు. కౌంటర్‌ వేయకుండా, కోర్టుకు హాజరుకాకుండా, కోర్టుకు వెళ్లిన వారికి అనుకూలంగా తీర్పు వచ్చేలాచేసి వారికి మళ్లీ షెడ్యూల్‌ ఇచ్చారు. వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత పండిట్లు, పీఈటీలకు కొంతమంది హెడ్మాస్టర్లకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు లేకుండా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ సొంత నిర్ణయంతో తిరిగి షెడ్యూల్‌ ఇచ్చారు. తద్వారా మిగిలిన పండిట్లు, పీఈటీలు కోర్టును ఆశ్రయించి వారికి అనుకూలంగా స్టే తెచ్చుకుని డైరెక్టర్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఖాళీలు వచ్చాయి కాబట్టి మాకూ అవకాశం ఇవ్వాలని మరికొందరు చక్కర్లు కొడుతున్నారు. చివరికి ఏ ఖాళీలు, ఏ కేడర్‌లో ఉన్నాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఎవరు ఆప్షన్లు పెట్టుకోవచ్చో, ఎక్కడ ఖాళీలు ఉన్నాయో కూడా తెలియడం లేదు. ఈ పరిస్థితిపై ఉపాధ్యాయుల బదిలీల్లో తీవ్ర గందరగోళం, అస్పష్టత నెలకొంది. డైరెక్టర్‌ను మారిస్తే తప్ప విద్యాశాఖ, విద్యార్థులు బాగుపడరని ఫ్యాఫ్టో ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయాన్ని సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. 

Updated Date - 2021-01-14T08:57:00+05:30 IST