అనువాద భారతి శాంతసుందరి

ABN , First Publish Date - 2020-12-13T05:56:45+05:30 IST

ప్రఖ్యాత రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమార్తె అంటే సంతోషమే కానీ, తన కృషిపరంగా వచ్చిన గుర్తింపే శాంతసుందరికి ఆనందాన్ని కలిగించేది...

అనువాద భారతి శాంతసుందరి

శాంతసుందరి అనువాదకళను సాంకేతికంగా అభ్యసించిన వ్యక్తి కాదు. విస్తృత అధ్యయనం వల్లనే ఆమె ఆ శక్తిని సాధించింది. ఆమె చేతిలోకి ఓ పుస్తకం రాగానే శ్రద్ధగా చదివేది. అనువాదం ఉబలాటం కాదు, అదొక ఉద్వేగం. ఒక రచయితకు సొంతభాషలో పట్టనంత గుర్తింపు వచ్చినప్పుడే బయటికి ప్రవహించాలి అని ఆమె ఉద్దేశం. మూడ్‌ అంటారే, ఏ కవితలోనైనా దాన్ని పట్టుకోవడంలో ఆమె దిట్ట.


ప్రఖ్యాత రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమార్తె అంటే సంతోషమే కానీ, తన కృషిపరంగా వచ్చిన గుర్తింపే శాంతసుందరికి ఆనందాన్ని కలిగించేది. తమిళనాడులో జన్మించి, ఢిల్లీలో మూడు దశాబ్దాల పాటు హిందీ వ్యవసాయం చేసి, ఇరవయ్యేళ్ళ క్రితం హైదరాబాద్‌ వచ్చి భర్త ప్రొఫెసర్‌ గణేశ్వరరావుతో పాటు స్థిరపడింది. వీరి ఇద్దరు అమ్మాయిలు అమెరికాలో నివసిస్తున్నారు. గణేశ్వరరావు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఆంగ్లం బోధించేవారు. ఆమె అక్కడే హిందీ ఎంఏ చేసి, స్కూళ్లల్లో హిందీ బోధించి మొత్తానికి భాషా సంస్కృతులపరంగా ధిల్లీవాలీగా మారిపోయింది. ఇంత గట్టి నేపథ్యముంది కాబట్టే ఆమె విలక్షణ అనువాద రచయిత్రిగా గణనకెక్కింది. హిందీ నుడికారం తెలుగు సంప్రదాయం మణిప్రవాళచందంగా ఆమెలో ఇమిడిపోయాయి. అందుకే ఆమె హిందీ అనువాదాలు తెలుగుహిందీలా కాకుండా హిందీ పరిమళంతోనే ఉంటాయి.


శాంతసుందరితో నా మొదటి పరిచయం ఢిల్లీలోనే. 2000లో నా ‘కాలాన్ని నిద్రపోనివ్వను’ కవితాసంపుటికి సాహిత్య అకాడమి అవార్డు లభించింది. పురస్కార ప్రదానోత్సవంలో ఆమె నన్ను మొదటిసారి కలవడం ఓ మంచి జ్ఞాపకం. మరునాడు ఢిల్లీలోని ‘తెలుగుసాహితి’ అనే సంస్థ ఓ గోష్ఠిని ఏర్పాటుచేసింది. సాహిత్య అకాడమి అవార్డు అందుకోవడానికి వచ్చే వారి గౌరవార్థం ప్రత్యేక సభలు ఏర్పాటు చెయ్యటం వారి ఆనవాయితీ. నాటి కార్యక్రమానికి సినారె, బండారు దత్తాత్రేయ లాంటి తెలుగు ప్రముఖులు హాజరయ్యారు. ఆ సభలో శాంతసుందరి నా ‘రాయి’ అనే కవితకు హిందీ అనువాదాన్ని చదివి అందరి మన్ననలు పొందింది. అలాగే నా నానీల సంపుటి (నన్హేముక్తక్‌)ని విజయరాఘవరెడ్డి హిందీలోకి అనువదించారు. దాని ఆవిష్కరణ 2005లో ఢిల్లీలోని హిందీభవన్‌లో జరిగింది. అక్కడ ఉమేష్‌చంద్ర అగర్‌వాల్‌ అనే నా పబ్లిషర్‌ ఆమెతో ‘కాలాన్ని నిద్రపోనివ్వను’ హిందీలోకి చేస్తే ప్రచురిస్తానన్నాడు. అదిగో అలా ప్రారంభమైంది మా అక్షరానుబంధం.


భారత్‌ ఒక సంక్లిష్ట దేశం. చప్పన్నదేశాల సమాహారం. అఖండ భారత్‌ అంటున్నాం గాని నిజానికి ఖండభారతమే. అఖండమనేది ఒక ఆశయం. అన్ని ప్రాంతాలను సాహిత్యపరంగా కలపాలంటే అనువాదాలే శరణ్యం. రవీంద్రనాథ్‌ఠాగూర్‌, శరత్‌బాబు, ప్రేవ్‌ుచంద్‌ తదితరులు మన ఇంటివారు కావడానికి అనువాదాలే కారణం. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ‘Indian Literature is one, Written in many Languages’అని అన్నాడు. ‘One’ కావటమంటే భారతీయ ఆత్మిక అంతర్ధారను దర్శించటమే, అది అనువాదాలవల్లే సాధ్యమవుతుందని సారాంశం. అయితే మనకు దిగుమతి ఉన్నంతగా ఎగుమతి లేదు. దానికి కారణాలనేకం. ఒక రచనలో సార్వజనీనత, శిల్పంలో నూతనత్వం, సంస్కృతిలో విశేషంగా ఉండే లక్షణాలు, ఉద్వేగం లాంటి భావపరంపర, తొంగిచూసే భాషాసౌందర్యం లాంటివి అనువాదకులకు పట్టుబడాలి. శాంతసుందరికి ఈ వొడుపు అనితరసాధ్యంగా అలవడింది. తెలుగు నుంచి హిందీలోకి ఆమె 29 గ్రంథాలు అనువదించింది. హిందీ నుంచి తెలుగులోకి 11, ఇంగ్లీషునుంచి తెలుగులోకి, హిందీలోకి 23 రచనలను తీసికెళ్లిన ఘనత కూడా ఆమెదే. మొన్నమొన్నటి వరకు 75 గ్రంథాలను తర్జుమా చేసింది. ‘పనిలో దానవాంశ సంభూతురాలివి’ అని సరదాగా అన్నప్పుడు ఆమె మురిసిపోయేది. 


శాంతసుందరి స్నేహశీలి. స్మితపూర్వాభిభాషిణి, ఇతరులతో సున్నితంగా వ్యవహరించేది. అయితే అనువాదానికి పుస్తకాలను ఎన్నుకోవటంలో మాత్రం నిక్కచ్చిగానే ఉండేది. తనకు నచ్చాలి. అలా నచ్చడానికి ఆమె విలువలు ఆమెకున్నాయి. అవి రాగద్వేషాలకతీతంగా ఒక స్థాయిని, సాహిత్య ప్రయోజనాన్ని బట్టి ఏర్పరచుకున్నవే. ముందుగా ఇతర భాషల్లోకి వెళ్లే యోగ్యత దానికి ఉన్నదా లేదా అనే విచక్షణ ఆమెకుండేది. అనువాదం ఉబలాటం కాదు, అదొక ఉద్వేగం. ఒక రచయితకు సొంతభాషలో పట్టనంత గుర్తింపు వచ్చినప్పుడే బయటికి ప్రవహించాలి అని ఆమె ఉద్దేశం. 


అనువాదకళను ఆమె సాంకేతికంగా అభ్యసించిన వ్యక్తికాదు. విస్తృత అధ్యయనం వల్లనే ఆమె ఆ శక్తిని సాధించింది. ఆమెను సన్నిహితంగా గమనించటం వల్ల గ్రహింపుకొచ్చిన కొన్ని విషయాలు చెప్తాను. ఆమె చేతిలోకి ఓ పుస్తకం రాగానే శ్రద్ధగా చదివేది. నచ్చిన పంక్తుల్ని పెన్సిల్‌తో గుర్తుపెట్టుకునేది. ఓ కవితను అనువదించాక బయటివ్యక్తిలా చదివేది. నచ్చకపోతే రెండో వర్షన్‌ రాసి మెరుగైన దాన్ని ఎన్నుకునేది. మూడ్‌ అంటారే, ఏ కవితలోనైనా దాన్ని పట్టుకోవడంలో ఆమె దిట్ట. కవితను ఎన్నిసార్లు చదివితే అన్ని అర్థాలు స్పుÛరిస్తాయి అనేదామె. ఆమె ఉద్దేశంలో అనువాదకుడికి కొన్ని దశలుంటాయి. అనువాదం చెయ్యాలనుకున్న పుస్తకాన్ని చదవడం, సాకల్యంగా అర్థం చేసుకోవడం, కవి ఆలోచనలకు, భావాలకు పాఠకుడిగా స్పందించడం, వాటిని సొంతం చేసుకోవడం, దీనినే పరకాయ ప్రవేశమనొచ్చు. ఆ కవితను తానే రాసినంతగా తాదాత్మ్యం చెందడం, వీలైనంత నిజాయితీగా, అందంగా అనువాద భాషలో చెప్పడం జరగాలి. కొందరు అంటారు ‘It can’t be beautiful if it is faithful’ అని. can’t be faithful అనే దానితో ఆమె పూర్తిగా ఏకీభవించేది కాదు. అనువాదంలో అనుసృజన తప్పదని ఆమె భావన. రెండు భాషలు తెలిసిన వారెవరైనా పదకోశం దగ్గర పెట్టుకుని చేసేది కాదు అనువాదం అంటే. అనువాదకుడికి కొంత స్వేచ్ఛ ఉండాలి. ఎందుకంటే ఏ రెండు భాషల్లోనూ వాక్యనిర్మాణం ఒకేరకంగా ఉండదు. కొన్ని భాషల్లో సహాయకక్రియలు అవసరం అయినచోట రెండో భాషలో ఆ అవసరం లేకపోవచ్చు. నా ‘కాలాన్ని నిద్రపోనివ్వను’ సంపుటిలో ‘బొంత’ అనే కవిత విషయంలో ప్రాంతీయ సమస్యలను ఆమె నేర్పుగా అధిగమించింది. తెలుగువారికి సంబంధించినంతవరకు అది నిరుపేదల దగ్గరే ఉండాలన్న నియమమేమీ లేదు. మధ్యతరగతి ఇండ్లలో కూడా ఉంటుంది. పాతబట్టలతో కుట్టే రజాయి లాంటిది బొంత. కాని హిందీలో దీనికి సరిగ్గా సరిపోయే మాట లేదు. బొంతకు అతి దగ్గరగా ఉండే పదం గుద్‌డీ, లేదా కంథా. ఈ రెండూ చింకిపాతలతో కుట్టేవే. గుడిసెల్లో నిరుపేదలు వాడుకునేవే. బొంత రజాయికీ, గుద్‌డీకీ మధ్యరకం. అందుకని ఆమె గుద్‌డీని ఖరారు చేసింది. ‘కాలజలం’ అనే మరో కవితలో సముద్రాన్ని అమ్మకుచ్చిళ్లతో పోల్చాను. తెలుగులో సముద్రం నపుంసకలింగం కాబట్టి స్త్రీలింగం లాగే ‘సముద్రం పొంగింది, సముద్రం గర్జిస్తోంది’ అంటాం. హిందీలో నపుంసకలింగం లేదు. నీళ్లు, రాయి, రప్ప, ఆకాశం చివరికి సుఖం, దు:ఖం లాంటి భావాలకు కూడా స్త్రీలింగమో, పుల్లింగమో ఉంటుంది. హిందీలో సముద్రం పుల్లింగం. ‘సముద్రం తల్లిలా తల నిమిరింది’ అంటే ఆ వాక్యాన్ని హిందీలోకి అదేవిధంగా మార్చలేం. ఆమె పుల్లింగాన్ని అట్లాగే ఉంచి ‘సముద్ర్‌ అబ్‌/ మాకీ సాడీకీ మోరియోంకీ తరహ/ మేరే సిర్‌కో సహలాతాహై’ అంటూ ఆ సమస్యను అందంగా అధిగమించింది. 


‘కాలాన్ని నిద్రపోనివ్వను’ సమయ్‌కో సోనే నహీదూంగా’ పేరుతో అనువదించాక ఉత్తరభారతంలో ఉండే కవి రచయితలకు కాపీలు పంపిస్తే వారు సానుకూలంగా స్పందించడంతో ఆమెకు సంతోషం కలిగింది. ‘గోపిగారు ఉపయోగించిన ఉపమానాలు, ఆయన విషయాలను దర్శించే కోణాలూ, భావాభివ్యక్తి చాలా కొత్తగా ఉన్నాయ’ని వారు చెప్పారని ఆమె నాకో ఉత్తరంలో రాశారు.


పై పుస్తకమే కాక ఆమె నా ‘గోవాలో సముద్రం’ (గోవా మై ఔర్‌ సముద్ర్‌), ఇటీవలి ‘వృద్ధోపనిషత్‌’ వరకు నా కవిత్వానికి అనువాదదీపం వెలిగించింది. అలాగే నావి నూరు కవితలను ఎంపిక చేసి అనువాద సర్వస్వంగా సిద్ధం చేసిపెట్టారు. అది తొందరలో అచ్చవుతుందని నా విశ్వాసం. 


ఒక రకంగా మూలరచయితలు అనువాదకులకు రుణపడిఉన్నట్టే లెక్క. నేను అందుకు అపవాదమేమీకాదు. నా ‘కాలాన్ని నిద్రపోనివ్వను’ సంపుటి 23 భాషల్లోకి వెళ్లగా వాటిలో సింహభాగానికి హిందీయే అనుసంధాన భాషగా ఉపకరించింది. అనువాద గ్రంథాల ముఖపత్రంపైన రచయిత పేరుతో పాటు అనువాదకుల పేరు ఉండాలని నమ్మేవాణ్ణి నేను. దాన్ని పాటించాను కూడా. ఇది మీరు పెట్టిన ఒరవడే అని కితాబునిచ్చింది కూడా.


73 ఏళ్ల సార్థక జీవితంలో ఆమె దాదాపు 45 సంవత్సరాలు అనువాదరంగంలో క్రియాశీలకంగా ఉంది. కొ.కు. ప్రసిద్ధ రచన ‘చదువు’ను ‘పడాయి’ పేరిట అనువదిస్తే సాహిత్య అకాడమీ ప్రచురించింది. మహాశ్వేతాదేవి ఉత్తమకథలను ఎన్‌బిటి కోసం తెలుగులోకి తీసుకొచ్చింది. ఓల్గా ‘స్వేచ్ఛÛ’ సలీం ‘కాలుతున్న పూలతోట’ నవలానువాదాలు ఆమెకెంతో నచ్చిన రచనలు. ఆమెకెన్నో పురస్కారాలు లభించాయి గానీ ‘ఇంట్లో ప్రేవ్‌ుచంద్‌’ అనే తెలుగు రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదపురస్కారం లభించడం ఆమె తృప్తికి పరాకాష్ఠ.


అనుకోకుండా మాయదారి రోగం(బ్రెయిన్‌ ట్యూమర్‌) దాపురించి మూడునెలలు ఆమె హాస్పిటల్‌లో బాధపడింది. 73 ఏళ్ల వయస్సులో ఆమె భర్త గణేశ్వరరావు ఆమెను కంటికి రెప్పలా చూసుకున్నారు గానీ, ఆ రెప్పకు చీకటిని మిగిల్చి ఆమె వెళ్లిపోయింది. వాళ్లమ్మ వరూధిని (94– కొ.కు.అర్థాంగి)  ఉండగానే ఆమెను అనాథను చేసి తరలిపోయింది. నా కవితాత్మను స్పృశించి విస్తృత ప్రపంచంలోకి తీసుకువెళ్ళిన ప్రియసోదరి ఇక లేరంటే నమ్మలేకపోతున్నాను. ఆమెకు నా కన్నీటి నివాళి.

ఎన్‌.గోపి

Updated Date - 2020-12-13T05:56:45+05:30 IST