మర్రి ఆకుల కర్రీ!

ABN , First Publish Date - 2021-12-04T05:30:00+05:30 IST

‘మారి’ అంటే దుష్ట శక్తులను నాశనం చేసే దుర్గాదేవి. మర్రిచెట్టుని ‘పెద్దమారి’ అని పిలుస్తారు. ....

మర్రి ఆకుల కర్రీ!

‘మారి’ అంటే దుష్ట శక్తులను నాశనం చేసే దుర్గాదేవి. మర్రిచెట్టుని ‘పెద్దమారి’ అని పిలుస్తారు. ఇది కూడా అనేక వ్యాధుల్ని నాశనం చేసే ఓ దివ్యౌషధం కాబట్టి సార్థక నామధేయి! మహమ్మారి వ్యాధులకు ఈ పెద్ద మారి ఓ చక్కని సమాధానం. కన్నడంలో అలదమార అని పిలుస్తారు.



స్కృతంలో దీన్ని వట, న్యగ్రోధ, బహుపాద, భాండీర అని పిలుస్తుంటారు. మర్రిచెట్టు చెక్కతో టీ కాచుకుని తాగితే, జ్వరాన్ని, అతీసార వ్యాధిని, ఉబ్బసాన్ని తగ్గిస్తుంది. షుగరువ్యాధిలోనూ, మూత్రపిండాల వ్యాధిలోనూ కలిగే అతిమూత్ర లక్షణాన్ని అదుపు చేస్తుంది. నీరుపట్టి వచ్చే ఉబ్బును తగ్గిస్తుంది. మర్రి ఆకులు విరేచనాలను ఆపుతాయి. బీపీని తగ్గిస్తాయి. మర్రి చిగుళ్లు నోటి పూతను తగ్గిస్తాయి. వేడిని, తాపాన్ని మంటలుగా ఉండటాన్ని పోగొడతాయి. మర్రి పండ్లు లైంగిక  శక్తిని పెంచుతాయి. వేడిని తగ్గిస్తాయి. రక్తస్రావాన్ని, రక్తంతో కూడిన వాంతులు, విరేచనాల్ని ఆపుతాయి, బొప్పాయి లాగానే మర్రిచెట్టుకూ  పాలు వస్తాయి ఇవి షుగరు వ్యాధిని, మూత్రవ్యాధుల్ని, చర్మవ్యాధుల్ని పోగొడతాయి. లైంగిక శక్తినిస్తాయి. పురుషుల్లో జీవకణాల్ని పెంచుతాయి. మర్రి చెట్టు సంపూర్ణంగా జీవనీయమైనది. అనేక వ్యాధుల్ని హరిస్తుంది. 


కూరగా వండుకోవటానికి లేత ఆకులనే ఎంచుకోవటం మంచిది. ‘వటో రూక్షో హిమో గ్రాహీ కషాయో యోనిదోషహత్‌ వర్ణ్యో వ్రణవిసర్పఘ్నః కఫ పిత్తోదరో గురుః. చలవనిస్తుంది, విరేచనాలను ఆపుతుంది. వగరు రుచి కలిగి ఉంటుంది. స్త్రీల వ్యాధుల పైన పనిచేస్తుంది’ అని కైయదేవ నిఘంటువు మర్రికి గల ఉపయోగాలను వివరించింది. ఆధునిక వైద్య శాస్త్రం మర్రి ఆకులు పుళ్లు తగ్గిస్తాయని, సూక్ష్మజీవి నాశకగుణం ఉందని చెప్తున్నాయి. అంటువ్యాధిగా వచ్చే అతిసారంలో ఇది సూక్ష్మజీవి సంహారకంగానే కాకుండా, దీనికి గల గ్రాహి గుణం వలన విరేచనాలను ఆపుతుంది. ఆయుర్వేద శాస్త్రం దీని వగరు రుచే ఈ గుణాలకు కారణం అంటుంది. పైగా చలవనిచ్చే గుణం కూడా ఉండటం చేత ఇది శరీరంలోని అన్ని అవయవాలలోనూ ఇరిటేషన్‌ కలగకుండా చేస్తుంది. స్త్రీలను తరచూ ఇబ్బందిపెట్టే తెలుపు అవటం, అధిక ఋతుస్రావం లాంటి లక్షణాలమీద ఇది బాగా పనిచేస్తుంది. 


నలుడు పాకదర్పణం గ్రంథంలో మర్రి ఆకులతో కూర చేసుకుని తరచూ తింటూ ఉంటే ‘ఏతద్‌ వటచ్ఛదం పథ్యం వ్రణజిత్‌ సర్వదోషజిత్‌/కఫపిత్తహరం పథ్యం దీపనం పాచనం భవేత్‌’ ఇది వ్రణాలను తగ్గిస్తుందనీ, అన్ని వ్యాధుల్లోనూ తినదగినదని, కఫ పిత్త దోషాలను పోగొడ్తుందని, సమస్త రోగాలను జయిస్తుందనీ, జీర్ణశక్తిని పెంచుతుందని, ఆహారం సక్రమంగా అరిగేలా చేస్తుందనీ పేర్కొన్నాడు. 


మర్రి ఆకుల కూర తయారీ విధానాన్ని ఇలా సూచించాడు: 

లేత మర్రి ఆకుల్ని సేకరించుకుని, కడిగి పొడిబట్టతో తుడిచి సన్నగా తరగండి. సమానంగా చింత చిగురు కలిపి ఉడికించండి. నేతితో వేయించి కావాల్సిన సుగంధ ద్రవ్యాలను కలిపి కూరగా చేసుకొండి. లేదా ఉడికించిన కందిపప్పుతో కలిపి పప్పుగా చేసుకోండి. రోటి పచ్చడిగా కూడా చేసుకోవచ్చు. చింతచిగురు దొరక్కపోతే చుక్కకూరతో గానీ, గోంగూరతో గానీ కలిపి తయారు చేసుకోవచ్చు. కానీ చలవచేసే మర్రి ఆకులతో వేడిచేసే గోంగూర లాంటివి కలపటం వలన విరుద్ధాహారం కాగలదు. వేడి చేసే స్వభావం ఉన్నవారికి చింతచిగురే మంచిది. వేశానా అన్నట్టుగా ఒక రెబ్బ చింతపండు కలిపి కూడా వండుకోవచ్చు. 

Updated Date - 2021-12-04T05:30:00+05:30 IST