రాత మార్చిన గీత

ABN , First Publish Date - 2021-02-03T05:30:00+05:30 IST

ఒకప్పుడు రోజు కూలీ. ఆరు రూపాయల వేతనంతో ఒక్క పూట కడుపు నింపుకోవడమే కష్టమయ్యేది. కానీ ఆమె చేతిలో ‘గీత’... తరువాత ఆమె రాతనే

రాత మార్చిన గీత

ఒకప్పుడు రోజు కూలీ. ఆరు రూపాయల వేతనంతో ఒక్క 

పూట కడుపు నింపుకోవడమే కష్టమయ్యేది. 

కానీ ఆమె చేతిలో ‘గీత’... తరువాత ఆమె రాతనే 

మార్చేసింది. నాడు పుల్లతో రాళ్లపై గీసిన 

చిత్రం... అగ్రదేశాల వేదికలెక్కి అలరించింది. 

అంతరించిపోతున్న ‘పిథోరా 

చిత్రకళ’కు ప్రాణం పోసి ‘పద్మశ్రీ’ 

పురస్కారం అందుకున్న మధ్యప్రదేశ్‌ గిరిజన మహిళ 

భూరీ బాయి స్ఫూర్తి మంత్రమిది... 


అమ్మానాన్నల అప్యాయతలు... ఆటలు, కేరింతలు... బాల్యమంటేనే సంతోషాల సందడి. కానీ భూరీ బాయి బాల్యంలో ఆ చిరునవ్వులూ లేవు... కేరింతలూ లేవు. కుటుంబం గడవక చిరు ప్రాయంలోనే రోజుకు ఆరు రూపాయలకు బాల కార్మికురాలిగా పనిచేశారు. పదేళ్లప్పుడు ఉన్న చిన్నపాటి ఇల్లు అ్నగిప్రమాదంలో కాలిపోతే... అంతా కలిసి గడ్డితో ఓ గుడిసె వేసుకున్నారు. అందులోనే ఆమె బాల్యం కరిగిపోయింది. అంతటితో భూరి కష్టాలు ఆగలేదు. కాస్తయినా భారం తగ్గుతుందని తండ్రి ఆమెకు పరహారో ఏటే పెళ్లి చేశారు. ఆ తరువాతా కూలీ పని చేయక తప్పలేదు ఆమెకు. 


కళను ప్రేమించినందుకు... 

మధ్యప్రదేశ్‌లోని భీల్‌ తెగకు చెందిన భూరి ఎన్ని ఇబ్బందులొచ్చినా నిలబడ్డారే కానీ, తనవల్ల కాదని ఏ రోజూ తప్పుకోవాలనుకోలేదు. కూలీ నాలి చేసి కుటుంబ భారాన్ని పంచుకుంటున్న ఆమెకు ‘పిథోరా పెయింటింగ్‌’ అంటే చాలా ఇష్టం. అద్భుతమైన జానపద కళ అది. రథ్వా, భీల్‌ తెగల ఆదివాసీలు తమ ఇంటి గోడలపై ‘పిథోరా’ పెయింటింగ్స్‌ వేయడం అక్కడ ఆనవాయితీ. చిన్న వయసులోనే ఆ చిత్రాలు భూరిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ మక్కువతోనే ఖాళీ దొరికినప్పుడు సాధన మొదలుపెట్టారు. అప్పుడే అసలు కథ మొదలైంది. భీల్‌ తెగ అభ్యంతరం చెప్పింది. కళలు అభ్యసించే హక్కు ఆడవారికి లేదని తీర్మానించింది. అయితే ఇవేవీ భూరి పట్టించుకోలేదు. కుల పెద్దలు చెప్పినా... మరెవరు అడ్డు తగిలినా, ఆఖరికి ఆమె భర్తను ఎగదోసి ఆమెపైనే ప్రయోగించినా ఏమాత్రం చలించలేదు. 


‘‘పెయింటింగ్స్‌ ద్వారా నాకు మంచి ఆదాయమే వచ్చేది. నా భర్త సంపాదన కంటే ఎక్కువే ఉండేది. దీంతో ఆయన మనసులో విషం నింపే ప్రయత్నం చేశారు మా తెగ పెద్దలు. ‘మగాడివి నీకంటే నీ భార్య ఎక్కువ సంపాదించడమేమిట’ని అవమానకరంగా మాట్లాడారు. దానివల్ల తొలుత ఇంట్లో ఇబ్బందులెదుర్కున్నాను. అయితే నా ఆశయం వదులుకోలేదు. వివరంగా చెబితే నా భర్త అర్థం చేసుకున్నారు’’ అంటూ చెప్పుకొచ్చారు భూరి. 


అదే జీవనం... జీవితం... 

మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లా భీల్‌ గిరిజన తెగకు కేంద్రం. వీరు విలువిద్యలో ఆరితేరినవారు. వ్యవసాయం ప్రధాన ఆదాయ వనరు. ఉత్తరాన మహి... దక్షిణాన నర్మదా నదుల మధ్య పచ్చదనం పరుచుకున్న అటవీ ప్రాంతం. వ్యవసాయంతో పాటే పురాతనమైన ‘పిథోరా చిత్రకళ’ కూడా అక్కడి ప్రజల జీవనంలో భాగమైంది. జభువాలో ఏ ఇంటి గోడ చూసినా రంగురంగుల చిత్రాలతో ఆకట్టుకుంటాయి. సూర్యుడు, చంద్రడు, గుర్రాలతో పాటు భీల్‌ ప్రజల గ్రామీణ జీవన స్రవంతి ఆ బొమ్మల్లో ప్రతిబింబిస్తుంది. ఇందులోని ప్రత్యేకతేంటంటే ఏ రెండు పెయింటింగ్సూ ఒకేలా ఉండకపోవడం. భూరి అందులో నిష్ణాతురాలు. ఆమె సృజనకు హద్దులు ఉండవు. ప్రతి చిత్రమూ ప్రత్యేకమే! 


అమ్మా నాన్నల నుంచే... 

‘‘మా అమ్మా నాన్న వ్యవసాయ కూలీలుగా పనిచేసేవారు. ఖాళీ సమయాల్లో వారు కూడా గోడలపై బొమ్మలు గీసేవారు. ఇందులో వాడేవన్నీ ప్రకృతిసిద్ధమైన రంగులే. దాని కోసం పువ్వులు, ఆకులు, సుగంధ ద్రవ్యాల నుంచి రంగులు తయారు చేసేవారు. నాకు అవన్నీ బాగా నచ్చాయి. ఆసక్తిని పెంచాయి. అదీగాక అప్పట్లో మాకున్న ఒకే ఒక్క వినోదం అది. మొదట్లో నేను రాళ్లపై పుల్ల ముక్కతో బొమ్మలు గీయడం నేర్చుకున్నా. నా బొమ్మల్లో ఎక్కువగా నెమళ్లు, ఇతర పక్షులు, సూర్యుడు... ఇవే కనిపిస్తాయి. బ్రష్‌లు గానీ, కాగితాలు కానీ ఉండేవి కావు’’ అంటూ భూరి చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకున్నారు. 


మహానగరానికి మారినా...  

చిత్రకళలో భూరి ప్రతిభకు గ్రామస్తులందరూ ముగ్ధులయ్యారు. తమ ఇళ్లల్లో కూడా బొమ్మలు వేయమని ఆహ్వానించారు. భవన నిర్మాణ కార్మికురాలిగా ఒక పక్క పనిచేస్తూనే తన పెయింటింగ్స్‌ కూడా కొనసాగించారు భూరి. అయితే పెళ్లి తరువాత భర్త జోహార్‌ సింగ్‌తో కలిసి భూపాల్‌ వెళ్లారు. అతనూ రోజు కూలీనే! మొట్టమొదటిసారి ఊరు దాటి వెళ్లిన ఆమెకు భూపాల్‌ చాలా కొత్తగా అనిపించింది. ‘‘కళ్లెం లేని గుర్రంలో జనం పరుగెడుతున్నారు. నా భర్తే నాకు అపరిచితుడిలా మారిపోయాడు. అంతలా క్షణం తీరిక లేని ఉరుకుల పరుగుల జీవితం ఆ మహానగరంలో! ఆయన్ను చూడడమే గగనమైపోయింది. ఆ పరిస్థితులకు అలవాటు పడడానికి కూడా నాకు సమయం లేదు. ఇంతలో నేనూ మా ఆయనతో కలిసి కూలీకి వెళ్లడం మొదలుపెట్టాను’’ అంటున్న భూరి అక్కడ కూడా బొమ్మలు వేయడం ఆపలేదు. 




అదే మలుపు తిప్పింది... 

పనిలో ఏ మాత్రం ఖాళీ దొరికినా అక్కడున్న రాళ్లపై రంగు రంగు చిత్రాలు వేసేవారు భూరి. కొన్ని నెలలు గడిచాయి. అనుకోకుండా ఒక రోజు ప్రముఖ కళాకారుడు జగశ్‌ స్వామినాథన్‌ భూరి పనిచేస్తున్న సైట్‌ వద్దకు వచ్చారు. అక్కడ రాళ్లపై ఆమె వేసిన చిత్రాలు చూసి ఆరా తీశారు. ఆ చిత్రాలకు ముగ్ధుడైన ఆయన భూరిని కలిశారు. రాళ్లపైన కాకుండా కాగితంపైన వేయమని సూచించారు. అంతే గోడపై ఉన్నది ఉన్నట్టుగా పేపర్‌పై దించేశారు భూరి. దానికి జగదీశ్‌ ఫిదా అయిపోయారు. మరిన్ని చిత్రాలు వేయాల్సిందిగా భూరిని కోరారు జగదీశ్‌. తిరిగి వాటిని ఆయనే ఒక్కోటి రూ.50తో కొనుగోలు చేశారు. అప్పట్లో అది ఆమె సంపాదించే కూలీ డబ్బు కంటే ఎక్కువ. అలా తన జీవితం ఊహించని మలుపు తిరిగింది. 




ఇంత పేరు వస్తుందనుకోలేదు... 

చిత్రకళలో లీనమై... ఆ కళ కోసమే జీవిస్తున్న భూరి అలుపెరుగని కృషిని గుర్తించిన కేంద్రం ఆమెకు ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ప్రకటించింది. దీంతో ఆమె ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ‘‘పెయింటింగ్‌పై నాకున్న అభిరుచి ఇంతటి గుర్తింపు తెస్తుందని ఏ రోజూ ఊహించలేదు. జనవరి 25న ఓ కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. అప్పటికే పాత్రికేయులంతా ఇంటి ముందు గుమ్మికూడారు. మరో అవార్డు ఏదో వచ్చిందనుకున్నాను! నాలాంటి ఒక గిరిజన మహిళ అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలకు వెళ్లడమే అరుదైన ఘట్టమనుకున్నాను. అలాంటిది ఇప్పుడు ‘పద్మశ్రీ’ కూడా దక్కడం అస్సలు నమ్మలేకపోతున్నాను’’ అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు భూరి.


దేశవిదేశాల్లో గుర్తింపు... 

ఇష్టంతో నేర్చుకున్న పిథోరా పెయింటింగ్స్‌ చివరకు భూరి జీవనోపాధిగా మారాయి. అంతేకాకుండా అంతరించిపోతున్న ఈ పురాతన కళకు పునర్‌వైభవం తెచ్చిన ఘనత కూడా ఆమెదే! క్రమంగా దేశంలోని ప్రధాన నగరాల్లో తన చిత్రాలు ప్రదర్శించారు భూరి. వాటికి అపూర్వ ఆదరణ లభించింది. కళాకారిణిగా ఆమెను మరో స్థాయికి తీసుకువెళ్లడానికి సోపానాలు అయ్యాయి ఆ ప్రదర్శనలు. ఆమె కీర్తి విదేశాలకూ పాకి, అక్కడా ప్రదర్శనలకు ఆహ్వానాలు అందుకున్నారు.


అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాల్లో ప్రదర్శించిన తన చిత్రాలకు విశేష స్పందన వచ్చింది. ఇక అవార్డులూ వెతుక్కుంటూ వచ్చాయి. మధ్యప్రతేశ్‌ ప్రభుత్వం నుంచి ‘శిఖర్‌ సమ్మాన్‌, దేవి అహల్యాబాయి సమ్మాన్‌, రాణి దుర్గావతి సమ్మాన్‌’ అందుకున్నారు. కళాకారిణిగా అత్యున్నత శిఖరాలు అధిరోహించిన ఆమెకు అక్కడి పాలకులు ‘ఆదివాసీ లోక్‌ కళా అకాడమీ’లో ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి సత్కరించారు. భూరి అక్కడి ట్రైబల్‌ మ్యూజియంలో వర్కుషాప్‌లు నిర్వహిస్తున్నారు. చిత్రకళా పాఠాలు బోధిస్తూ ఔత్సాహికులెందరినో తనలా తీర్చిదిద్దుతున్నారు. ‘పిథోరా’ కళాకారులందరినీ ఒక నెట్‌వర్క్‌గా ఏర్పాటు చేసి, ఆ కళను విశ్వవ్యాప్తం చేసే పనిలో ఇప్పుడామె నిమగ్నమయ్యారు. 



Updated Date - 2021-02-03T05:30:00+05:30 IST