ఫ్లెక్సీలు ఫుల్‌.. ఖాతా క్లోజ్‌

ABN , First Publish Date - 2021-10-23T07:42:08+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో ఫ్లెక్సీలు, పోస్టర్లు, బ్యానర్లు, అనధికారిక హోర్డింగ్‌లపై చర్యలు తీసుకుని, బాధ్యులపై కొరడా ఝుళిపించే జీహెచ్‌ఎంసీ సెంట్రల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సెల్‌(సీఈసీ) మూగనోము పట్టింది. నగరంలో ఫ్లెక్సీలపై నిషేధం ఉన్న విషయం..

ఫ్లెక్సీలు ఫుల్‌.. ఖాతా క్లోజ్‌

  • టీఆర్‌ఎస్‌ ప్లీనరీ వేళ ఫిర్యాదుల విభాగం మూగనోము!
  • తాత్కాలికంగా ట్విటర్‌ ఖాతా నిలిపివేత
  • హైదరాబాద్‌ అంతటా ఫ్లెక్సీలు, కటౌట్లు
  • వాటిపై ఫిర్యాదుకు నెటిజన్లకు నో చాన్స్‌
  • సాప్ట్‌వేర్‌ అప్‌డేట్‌ కోసమేనన్న ఈవీడీఎం
  • దానికీ.. ట్విటర్‌ ఖాతాకు లింకేంటి?
  • అధికార పార్టీకి మేలు కోసమేనని ఆరోపణ
  • మూడు రోజుల సెలవులో ఈవీడీఎం డైరెక్టర్‌
  • ఫోన్‌లో స్పందించని కమిషనర్‌, డైరెక్టర్‌


హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో ఫ్లెక్సీలు, పోస్టర్లు, బ్యానర్లు, అనధికారిక హోర్డింగ్‌లపై చర్యలు తీసుకుని, బాధ్యులపై కొరడా ఝుళిపించే జీహెచ్‌ఎంసీ సెంట్రల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సెల్‌(సీఈసీ) మూగనోము పట్టింది. నగరంలో ఫ్లెక్సీలపై నిషేధం ఉన్న విషయం తెలిసిందే. ఈ అంశాన్ని జీహెచ్‌ఎంసీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌(ఈవీడీఎం) నేతృత్వంలో సీఈసీ పర్యవేక్షిస్తోంది. ట్విటర్‌ ద్వారా నెటిజన్ల నుంచి ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లపై ఫిర్యాదులు స్వీకరిస్తోంది. వాటిని విశ్లేషించి, బాధ్యులను గుర్తిస్తోంది. వారికి కనిష్ఠంగా రూ. 5 వేలు, గరిష్ఠంగా రూ. 5 లక్షల మేర జరిమానా విధిస్తోంది. అలాంటి విభాగం ఉన్నఫళంగా ట్విటర్‌లో తన ఖాతాను తాత్కాలికంగా ఇనాక్టివ్‌ చేసింది. ఈ-చలానాలను జనరేట్‌ చేసే సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తున్నందున.. ఫిర్యాదులను స్వీకరించడం లేదంటూ గురువారం అర్ధరాత్రి ట్వీట్‌ చేసింది. అంతేకాదు.. ఈవీడీఎం డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటి మూడు రోజుల పాటు సెలవులపై వెళ్లారు. అంటే.. ఈ మూడు రోజులు సీఈసీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేనట్లే..!


టీఆర్‌ఎస్‌ మెహర్బానీ కోసమా?

సీఈసీ ట్విటర్‌ ఖాతాను తాత్కాలికంగా ఇనాక్టివ్‌ చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 25న హెచ్‌ఐసీసీలో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ద్విదశాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నగరమంతా గులాబీమయం కావాలని ఓ కీలక నేత ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఎక్కడికక్కడ పార్టీ అధినేత భారీ కటౌట్లు ఏర్పాటు చేయాలని, ఫ్లెక్సీలు కట్టాలని సూచించినట్లు సమాచారం. నగరంలోని గల్లీ రోడ్డు మొదలు.. నగరం మీదుగా వెళ్లే హైవేల్లో గులాబీ జెండాలతో తోరణాలు ఏర్పాటు చేయాలని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. అదే సమయంలో.. ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లపై నిషేధాజ్ఞలున్న నేపథ్యంలో.. జీహెచ్‌ఎంసీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సీఈసీ విభాగం ఉన్నఫళంగా మూగనోము పట్టినట్లు స్పష్టమవుతోంది. అంటే.. ఈ నెల 25న టీఆర్‌ఎస్‌ ప్లీనరీ ముగిసేదాకా.. నెటిజన్లు, నగర పౌరులెవరూ జీహెచ్‌ఎంసీకి ఫ్లెక్సీలపై ఫిర్యాదు చేసే అవకాశమే ఉండదు. గతంలో బీజేపీ, కాంగ్రెస్‌ నిర్వహించిన సభలు, పాదయాత్రల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకూ జరిమానాలు విధించిన సీఈసీ.. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌కు.. ట్విటర్‌కు సంబంధమేంటి?

సీఈసీ ట్విటర్‌ ఖాతా కేవలం నెటిజన్లు/పౌరుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఓ మాధ్యమం మాత్రమే. ఆయా ఫిర్యాదులను అధికారులు విశ్లేషించి, సిబ్బందిని క్షేత్రస్థాయికి పంపుతారు. అక్కడ వారు ఫొటో ఆధారాలను సేకరించి, సీఈసీ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో ఈ-చలానాలు జనరేట్‌ చేస్తారు. వాటిని బాధ్యులకు సర్వ్‌ చేస్తారు. ఈ-చలానాల సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ వంకతో ఇప్పుడు సీఈసీ తన ట్విటర్‌ ఖాతాను తాత్కాలికంగా బ్లాక్‌ చేసింది. నిజానికి సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌కు.. ట్విటర్‌ ఖాతాకు సంబంధమే లేదు. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ అవుతున్నా.. ట్విటర్లో ఫిర్యాదులు స్వీకరించవచ్చు. సాఫ్ట్‌వేర్‌ తిరిగి అందుబాటులోకి వచ్చాక.. చలానాలను జనరేట్‌ చేయవచ్చు. టీఆర్‌ఎస్‌ ప్లీనరీ నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే సీఈసీ అధికారులు ట్విటర్‌ ఖాతాను హోల్డ్‌లో పెట్టినట్లు కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, ఈవీడీఎం డైరెక్టర్‌ విశ్వజిత్‌ను ‘ఆంధ్రజ్యోతి’ ఫోన్‌ ద్వారా సంప్రదించేందుకు యత్నించగా.. వారు అందుబాటులోకి రాకపోవడం గమనార్హం!

Updated Date - 2021-10-23T07:42:08+05:30 IST