టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో.. సర్పంచ్‌కు అవమానం!

ABN , First Publish Date - 2021-06-18T05:36:39+05:30 IST

వరంగల్‌ అర్బన్‌ జిల్లా..

టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో.. సర్పంచ్‌కు అవమానం!
సమావేశం వెనుక నిలబడిన మహిళా సర్పంచ్‌ తిరుపతమ్మ

నిల్చున్న సర్పంచ్‌.. కూర్చున్న నేతలు...

చర్చనీయాంశంగా మారిన టీఆర్‌ఎస్‌ సమావేశం 


కమలాపూర్‌: వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలం నేరెళ్ల గ్రామంలో గురువారం జరిగిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో సర్పంచ్‌ దొంగల తిరుపతమ్మకు అవమానం జరిగిందని విమర్శలు వెల్లువెత్తాయి.   సర్పంచ్‌ ఇంటి ముందు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ఉదయం స్థానిక టీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సమావేశం వేదిక వెనుక సర్పంచ్‌ తిరుపతమ్మ నిలబడి ఉండగా, ఆమె భర్త శ్రీనివాస్‌, ఇతర నాయకులు కుర్చీల్లో కూర్చున్నారు. అయితే సర్పంచ్‌ను నిల్చోబెట్టి సమావేశం నిర్వహించి అవమానించారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌  కావడంతో ఎమ్మెల్యే తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. 


ఈ విషయమై  సర్పంచ్‌ తిరుపతమ్మ స్పందిస్తూ.. తనకు అవమానం జరిగినట్లు సోషల్‌మీడియాలో అసత్య ప్రచారం చేశారని తెలిపారు. తమ ఇంట్లో టీఆర్‌ఎస్‌ పార్టీ సమావేశం జరిగిందని, అధికారిక సమావేశం కాదని తెలిపారు. తనకు ఎలాంటి అవమానం జరగలేదని ఆమె పేర్కొన్నారు.

Updated Date - 2021-06-18T05:36:39+05:30 IST